Devara Collection: ఎన్టీఆర్ నటించిన ‘దేవర’ చిత్రానికి ఆరంభం లో డివైడ్ టాక్ వచ్చినప్పటికీ కూడా ఓపెనింగ్స్ విషయం లో చరిత్ర తిరగరాసిన సంగతి అందరికీ తెలిసిందే. మొదటి రోజు 150 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ ని రాబట్టిన ఈ సినిమా, మూడు రోజుల్లో 250 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఓవర్సీస్ వంటి ప్రాంతాల్లో మొదటి రోజు ‘కల్కి’ లాంటి పాన్ ఇండియన్ బ్లాక్ బస్టర్ మూవీస్ కి పోటీ ని ఇచ్చింది కానీ, ఆ తర్వాత మాత్రం మామూలు తెలుగు కమర్షియల్ సూపర్ హిట్ మూవీ కి ఎంత వసూళ్లు వస్తాయో అంత వసూళ్లు వచ్చాయి. ఇది ట్రేడ్ కి కూడా పెద్ద షాక్. కానీ ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ తక్కువ చేయడం వల్ల బ్రేక్ ఈవెన్ మార్కుని కేవలం మూడు రోజుల్లోనే నార్త్ అమెరికా లో దాటేసింది ఈ చిత్రం.
ఇక ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణ లో ఈ సినిమాకి మొదటి సోమవారం అత్యంత కీలకంగా మారింది. మొదటి సోమవారం ఒక్కటి గట్టెక్కితే సినిమా బ్రేక్ ఈవెన్ అయిపోతుంది, ఎన్టీఆర్ కెరీర్ లో భారీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచే చిత్రం అవుతుందని అందరూ అనుకున్నారు. కానీ అది జరగలేదు. ఈ సినిమాకి నాల్గవ రోజు అనేక ప్రాంతాలలో దారుణమైన వసూళ్లు నమోదు అయ్యాయి. కొన్ని ప్రాంతాలలో ట్రేడ్ కి కూడా అంతు చిక్కని ట్రెండ్ కనిపించింది. ఎందుకంటే సాధారణంగా ఏ సినిమాకి అయినా మార్నింగ్ షోస్ వర్కింగ్ డే రోజు డల్ గా ఉంటాయి. కానీ ‘దేవర’ కి మార్నింగ్ షోస్ బాగున్నాయి కానీ, ఆ తర్వాత మ్యాట్నీస్, ఫస్ట్ షోస్ బాగా తగ్గిపోయాయి. ఇలాంటి ట్రెండ్ ఇప్పటి వరకు ఏ సినిమాకి కూడా కనిపించలేదు. ఎక్కడైనా మార్నింగ్ షోస్ వీక్ గా ఉంటాయి, సాయంత్రం పికప్ అవుతాయి కానీ, ఈ అంతు చిక్కని ట్రెండ్ ఏంటబ్బా, ఎప్పుడు చూడలేదే, కేవలం భారీ వర్షాలు, వరదలు వచ్చిన సమయంలోనే ఇలాంటివి జరుగుతూ ఉంటాయి, కానీ అలాంటి దాఖలాలు ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ లో ఎక్కడా కనపడలేదు.
అయినప్పటికీ కూడా ఈ సినిమాకి ఎందుకు ఇంత విచిత్రమైన ట్రెండ్ నడిచింది అనేది షాకింగ్ గా మారిన విషయం. అలా మొత్తం మీద ఈ సినిమాకి నాల్గవ రోజు రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి 3 కోట్ల 20 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయని ట్రేడ్ పండితులు అంటున్నారు. అది కూడా జీఎస్టీ కలిపితేనే, లేకుంటే 3 కోట్ల రూపాయిలకంటే తక్కువ వసూళ్లు వచ్చాయని అంటున్నారు. మరో విశేషం ఏమిటంటే తెలుగు వెర్షన్ వసూళ్ల కంటే నిన్న హిందీ వెర్షన్ వసూళ్లు కాస్త బెటర్ గా ఉన్నిందట. అక్కడి ట్రేడ్ పండితుల లెక్కల ప్రకారం ఈ సినిమాకి నాల్గవ రోజు 3 కోట్ల 50 లక్షల రూపాయిల నెట్ వసూళ్లు వచ్చాయట. ఓవరాల్ గా హిందీ వసూళ్ల వల్ల మొదటి సోమవారం డీసెంట్ అనిపించుకునే రేంజ్ వసూళ్లు వచ్చాయని అంటున్నారు ట్రేడ్ పండితులు.