New Liquer Policy : జగన్ నీ మద్యానికి దండం.. మందుబాబుల గరంగరం!

మరో పది రోజుల్లో నచ్చిన ప్రీమియం మద్యం బ్రాండ్లు అందుబాటులోకి రానున్నాయి. గతం మాదిరి ధరలకే లభించనున్నాయి. దీంతో గత ఐదేళ్లుగా చుక్కలు చూపించిన జగన్ మద్యం పాలసీని గుర్తు చేసుకుంటున్నారు మందుబాబులు. కొత్త మద్యం పాలసీని ఆహ్వానిస్తున్నారు.

Written By: Dharma, Updated On : October 1, 2024 10:19 am

New Liquer Policy

Follow us on

New Liquer Policy :  గత ఐదేళ్ల వైసిపి హయాంలో మద్యం విషయంలో అనేక ఇబ్బందులు ఎదురయ్యాయి. 2019 ఎన్నికల్లో నవరత్నాల్లో భాగంగా మద్య నిషేధానికి హామీ ఇచ్చారు జగన్. తాము అధికారంలోకి వస్తే ఏపీలో మద్య నిషేధం చేస్తామని చెప్పుకొచ్చారు. ఆ ఎన్నికలకు ముందు జగన్ రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేసిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంలో కూడా ప్రకటించారు జగన్. పచ్చని కుటుంబాల్లో చిచ్చు రేపుతున్న మద్యాన్ని నిషేధిస్తే కానీ.. ఆడపడుచుల కళ్ళల్లో ఆనందం రాదని… అధికారంలోకి వచ్చిన మరుక్షణం నిషేధం అమలు చేస్తామని హామీ ఇచ్చారు. నవరత్నాల్లో చెప్పడమే కాదు.. మేనిఫెస్టోలో సైతం పొందుపరిచారు. దీంతో మహిళలు ఎంతగానో ఆశలు పెట్టుకున్నారు. జగన్ కు ఏకపక్షంగా ఓటు వేసి వైసీపీని గెలిపించారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ మాట మార్చారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదని.. మద్య నిషేధ విషయంలో ఇప్పటికిప్పుడు నిర్ణయం తీసుకోలేనని దాటవేసే ప్రయత్నం చేశారు. ప్రభుత్వమే నేరుగా మద్యం దుకాణాలు నడిపే వీలుగా మద్యం పాలసీని మార్చారు. సొంతంగా మద్యం దుకాణాలు ఏర్పాటు చేశారు. అయితే మాట ఇచ్చాను కనుక తప్పనని.. ఏటా 25% షాపులను తగ్గించి.. నాలుగేళ్లలో సంపూర్ణ మద్యనిషేధం వైపు అడుగులు వేస్తానని మరోసారి హామీ ఇచ్చారు. కానీ ఒక్క షాపు కూడా తగ్గించలేదు. మద్య నిషేధం అన్నమాట మరిచిపోయారు.

* వింత బ్రాండ్లు
వైసిపి హయాంలో మద్యం పాలసీ అస్తవ్యస్తంగా మారింది. ప్రభుత్వమే నేరుగా మద్యం దుకాణాలు నడిపింది. దేశంలో ఎక్కడా చూడని, వినని బ్రాండ్లు ఏపీలో దర్శనమిచ్చాయి. నాసిరకం మద్యంతో ప్రజారోగ్యానికి తీవ్ర భంగం వాటిల్లింది. నాసిరకం మద్యం తాగి వేలాదిమంది చనిపోయారని విపక్షాలు ఆరోపణలు చేసినా.. జగన్ పెద్దగా వినిపించుకోలేదు. పైగా మద్యం ధరలను 100 శాతానికి పెంచారు. దీంతో మందుబాబులు మద్యానికి దూరం అవుతారని కొత్త నిర్వచనం చెప్పారు. అయితే అదంతా జే బ్రాండ్ మద్యం అని విపక్షాలు ఆరోపించాయి. కమిషన్లకు కక్కుర్తి పడి ఎడాపెడా వైసీపీ నేతల కంపెనీల మద్యాన్ని విక్రయించారని ఆరోపణలు కూడా వచ్చాయి.

* ఎక్సైజ్ శాఖ విభజన
2019 అక్టోబర్ 2న నూతన మద్యం పాలసీ అమల్లోకి వచ్చింది. అప్పటివరకు ఉన్న మద్యం విధానాన్ని పూర్తిగా మార్చేశారు జగన్. షాపుల నిర్వహణ, మద్యం, సారా అక్రమ రవాణా నియంత్రణ బాధ్యతలను ఎక్సైజ్ శాఖ చూసేది. కానీ ఆ శాఖను అడ్డగోలుగా విభజించారు. షాపుల నిర్వహణ బాధ్యతలను ఎక్సైజ్ శాఖకు అప్పగించగా.. మద్యం, సారా అక్రమ రవాణా నియంత్రణ బాధ్యతల కోసం కొత్తగా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోను ఏర్పాటు చేశారు. కానీ సిబ్బంది నియామకం చేపట్టలేదు. అటు షాపుల నిర్వహణ అస్తవ్యస్తంగా మారగా.. ఇటు పొరుగు మద్యం, సారా రాష్ట్రంలో ఏరులై పారింది. పక్క రాష్ట్రాల్లో తక్కువ ధరకు మద్యం, సారా లభిస్తుండడంతో.. అక్కడి సరుకు రాష్ట్రంలో చలామణి అయ్యింది.

* ఇచ్చిన హామీ మేరకు
అయితే తాము అధికారంలోకి వస్తే పాత బ్రాండ్లు అందుబాటులోకి తెస్తామని.. ధర కూడా తగ్గిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు ప్రైవేటు మద్యం దుకాణాలను ఏర్పాటు చేయనున్నారు. తక్కువ ధరకే మద్యం అందించనున్నారు. దీంతో మందుబాబులు ఖుషి అవుతున్నారు. జగన్ నీ మద్యానికి ఒక దండం అంటూ నిట్టూరుస్తున్నారు. కొత్త మద్యం పాలసీని ఆహ్వానిస్తున్నారు.