Hema Malini: తమిళ చిత్రం ఇదు సతియం అనే సినిమాలో సహాయ నటి పాత్రతో తెరంగేట్రం చేశారు హేమ. సప్నో కా సౌదాగర్(1968) సినిమాతో హీరోయిన్ అయ్యారు ఆమె. బాలీవుడ్ లో ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించిన హేమ ఎక్కువగా దర్మేంద్ర, రాజేశ్ ఖన్నా లతో సినిమాలు చేశారు. హిట్ జంటగా పేరు పొందిన హేమా మాలినీ, ధర్మేంద్ర తరువాతి కాలంలో వివాహం చేసుకున్నారు కూడా.
హేమాను మొదట్నుంచీ అభిమానులు “డ్రీం గర్ల్” అని పిలిచేవారు. 1977లో అదే పేరుతో సినిమా కూడా చేశారామె. మంచి నాట్యకళాకారిణి అయిన హేమా మంచి నటిగా కూడా గుర్తింపు తెచ్చుకున్నారు. దాదాపు 150 సినిమాల్లో నటించారు ఆమె. ఫిలింఫేర్ ఉత్తమ నటి పురస్కారానికి 11 నామినేషన్లు సంపాదించుకున్న హేమా 1972లో పురస్కారం గెలుచుకున్నారు. ఫిలింఫేర్ జీవిత సాఫల్య పురస్కారం, పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు ఆమె. తాజాగా నటి హేమామాలినికి మరో గౌరవం దక్కింది.
ఆమెకు ‘ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్’ అవార్డును ప్రకటించారు. ఈ పురస్కారాన్ని.. నవంబరు 20 నుంచి 28 వరకు గోవాలో జరగనున్న భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం(ఇఫి) వేడుకలో ఆమెకు ప్రదానం చేయనున్నారు. ఈ విషయాన్ని సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. ఈమెతో పాటు సీబీఎఫ్సి ఛైర్పర్సన్ ప్రసూన్ జోషి కూడా ఈ అవార్డు వరించింది. భారతీయ చిత్రసీమకు విశేష సేవలందించినందుకుగానూ ఈ పురస్కారాన్ని వీరికి అందజేయనున్నట్లు ఠాకూర్ వెల్లడించారు. తెలుగులో నందమూరి బాలకృష్ణ హీరోగా నటించినగౌతమి పుత్ర శాతకర్ణి సినిమాలో నటించారు హేమ. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.