Bigg Boss Tanuja: ‘బిగ్ బాస్ 9’ ద్వారా కోట్లాది మంది తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన సెలబ్రిటీ తనూజ. ‘ముద్ద మందారం’ వంటి సెన్సేషనల్ మెగా సీరియల్ ద్వారా ఈమె మొదటి నుండి బుల్లితెర ఆడియన్స్ కి బాగా దగ్గరైన నటి, కానీ బిగ్ బాస్ ద్వారా ఆమె క్యారెక్టర్ ని నచ్చి ఫ్యామిలీ ఆడియన్స్ కి తోడు, యూత్ ఆడియన్స్ కూడా కలిశారు. 12 వారాల వరకు ఆమెనే టాప్ స్థానంలో కొనసాగుతూ వచ్చింది, కానీ ఆ తర్వాత హౌస్ లో జరిగిన కొన్ని పరిణామాల కారణంగా కళ్యాణ్ టాప్ 1 లోకి రావడం, తనూజ టాప్ 2 లోకి పడిపోవడం జరిగింది. కచ్చితంగా మొట్టమొదటి లేడీ టైటిల్ విన్నర్ గా నిలుస్తుందని అంతా అనుకున్నారు, కానీ చివరికి కథ అడ్డం తిరిగింది. అయితే తనూజ కి ఎంత మంది అభిమానులు ఉన్నారో, అంత మంది ట్రోలర్స్ కూడా ఉన్నారు.
బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు ఆమెపై విపరీతమైన ట్రోల్స్ పడేవి. బయటకి వచ్చిన తర్వాత అందరూ మర్చిపోతారు, ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ గా ఉంటారని అనుకున్నారు. కానీ ఇప్పటికీ కూడా ఆమె పై ట్రోల్స్ ఆగడం లేదు. దీంతో విసుగెత్తిపోయిన తనూజ, నిన్న తన ఇన్ స్టాగ్రామ్ లో బాధ పడుతూ ఒక స్టోరీ ని పెట్టింది. అందులో ఆమె మాట్లాడుతూ ‘నా మనసులో చాలా రోజుల నుండి ఉన్న బాధని ఈరోజు నేను మీ ముందు పెట్టాలని అనుకుంటున్నాను. ముందుగా నన్ను ఊరికే నిందించడం ఆపండి. మీ అందరిలాగానే, నాకు ఒక జీవితం ఉంది. నా పనేదో నేను చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాను. నాకంటూ కొన్ని బాధ్యతలు ఉన్నాయి, ఎవరి జీవితాల్లో వారందరూ బిజీ గా ఉంటున్నాం. బిగ్ బాస్ నుండి బయటకు వచ్చి ఇన్ని రోజులు అవుతుంది, ఇప్పటికీ నాపై నెగిటివ్ కామెంట్స్ చేస్తూనే ఉన్నారు’.
‘నేను పీఆర్ టీం తో కావాలని ఒకరిని తగ్గించాలని ఎందుకు చూస్తాను?, నాకు అసలు పీఆర్ టీం అనేదే లేదు. నా సోషల్ మీడియా అకౌంట్స్ ని కేవలం ఒక వ్యక్తి మాత్రమే మ్యానేజ్ చేస్తూ ఉంటాడు. నేను చేయని తప్పుకి నన్ను నిందిస్తున్నారు. ప్రతీ రోజూ నన్ను అసభ్యంగా దూషిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. అవతలివారిపై మీకున్న ప్రేమ ని నేను అర్థం చేసుకోగలను. కానీ నేను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నానో మీకు తెలియదు కదా?, రోజు నేను ఎదురుకుంటున్న ఈ నెగిటివిటీ ని చూసి ఒక అమ్మాయిగా నరకం అనుభవిస్తున్నాను. ఫేక్ అకౌంట్స్ తో వచ్చి ఇప్పటికీ నాపై విషం కక్కుతున్నారు. ఇలా చేస్తే మీకు ఏమొస్తుంది చెప్పండి?, ఇక్కడ నేను ఎవరి గురించీ ప్రస్తావించాలని అనుకోవడం లేదు, డ్రామా క్రియేట్ చెయ్యాలని అసలు చూడట్లేదు. నా పని నేను చేసుకుంటూ, ప్రశాంతంగా, గౌరవవంతమైన జీవితం అనుభవించాలని అనుకుంటున్నాను, దయచేసి నన్ను అలా బ్రతకనివ్వండి’ అంటూ ఎమోషనల్ అయిపోయింది తనూజ.