
Bandla Ganesh : మొన్నటి వరకు టాలీవుడ్ మా ఎలక్షన్స్ రచ్చ ఏ స్థాయిలో సాగిందో తెలిసిందే. ఏకంగా ఐదుగురు పోటీలో నిలిచి గోల గోల చేశారు. ఈ పరిస్థితిని చాకచక్యంగా మార్చేసిన ప్రకాశ్ రాజ్.. ఇద్దరు అధ్యక్ష బరిలో నిలిచిన అభ్యర్థులను తనవైపు లాగేసుకోవడంతో అందరూ ఆశ్చర్యపోయారు. విలక్షణ నటుడి రాజకీయానికి అందరూ ఫిదా అయ్యారు. ఇక, ఫైనల్ వార్ ప్రకాష్ రాజ్ – మంచు విష్ణు మధ్యనే అని, వార్ వన్ సైడే అవుతుందా? అనే చర్చ కూడా సాగింది. ఇలాంటి పరిస్థితుల్లో బాంబు పేల్చాడు బండ్ల గణేష్.
అప్పటి వరకూ ప్రకాష్ రాజ్ ప్యానల్ లో ఉన్న బండ్ల గణేష్.. బయటకు వచ్చి, ఆయన ప్యానల్ లోని జనరల్ సెక్రెటరీ అభ్యర్థి మీదనే వార్ అనౌన్స్ చేశాడు. ఆ పోస్టుకు జీవిత పోటీ చేస్తున్నారు. ఆ జీవిత మీదనే పోటీ చేస్తున్నట్టు ప్రకటించాడు బండ్ల. తన మనసు అంగీకరించట్లేదని, పోటీ చేయమంటోందని చెప్పిన గణేష్.. యుద్ధానికే సై అన్నాడు. దీంతో.. అంతా షాకయ్యారు. సరికొత్త విశ్లేషణలు మొదలయ్యాయి. అంతేకాదు.. మధ్యలోకి మెగా ఫ్యామిలీని కూడా దించేశారు.
అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న ప్రకాష్ రాజ్ కు మెగా ఫ్యామిలీ మద్దతు ఉన్న సంగతి తెలిసిందే. మరి, జీవితపై పోటీ చేస్తున్నానని చెప్పినప్పటికీ.. ప్రకాష్ రాజ్ కు ఎదురుగా నిలబడటమే కదా? ఆయనకు ఎదురుగా నిలబడడమంటే.. మెగా ఫ్యామిలీ మాటను లెక్క చేయకపోవడమే కదా? అంటూ జోరుగా విశ్లేషణలు సాగిస్తున్నారు జనం.
దీంతో.. అసలు బండ్ల గణేష్ ఈ నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందని చర్చించుకుంటున్నారు. జీవితారాజశేఖర్ కు, మెగా ఫ్యామిలీకి ఎప్పటి నుంచో వివాదాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. సందర్భం వచ్చినప్పుడల్లా చిరంజీవిపై తమ అసహనాన్ని వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఆ మధ్య మా డైరీ ఆవిష్కరణ సభలోనూ వివాదాన్ని రాజేసే ప్రయత్నం చేశారనే విమర్శలు రాజశేఖర్ పై వచ్చాయి. అలాంటి జీవితను ఓడించడమే తన లక్ష్యంగా బరిలోకి దిగారట బండ్ల గణేష్.
కానీ.. చిరు మద్దతు ఇస్తున్న ప్రకాష్ రాజ్ ప్యానల్ కు వ్యతిరేకంగా పోటీ చేయడమేంటే.. మెగా ఫ్యామిలీని ధిక్కరించినట్టే కదా అనే సందేహం కూడా వస్తోంది. మెగా ఫ్యామిలీకి దగ్గరయ్యేందుకే.. గణేష్ ఇలాంటి చర్యకు దిగాడని మరికొందరు అంటున్నారు. అయితే.. ఎంత కాదనుకున్నా.. ఇది పెద్ద నిర్ణయమే. మరి, ఇలాంటి నిర్ణయం మెగా ఫ్యామిలీకి తెలియకుండా బండ్ల తీసుకుంటాడా? అనే సందేహం కూడా వ్యక్తం చేస్తున్నారు కొందరు. ఇలాంటి ఆన్సర్ లేని శేష ప్రశ్నలు చాలానే ఉన్నాయి. మరి, వీటికి ముందు ముందు సమాధానం లభిస్తుందేమో చూడాలి.