Prudhvi Raj: సీనియర్ నటుడు 30 ఇయర్స్ పృథ్వి పై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది కోర్టు. ఈ మేరకు విశ్వసనీయ సమాచారం అందుతుంది. విషయంలోకి వెళితే… పృథ్విరాజ్ అలియాస్ 30 ఇయర్స్ పృథ్వి కొన్నాళ్లుగా భార్య లక్ష్మీకి దూరంగా ఉంటున్నారు. వీరికి మనస్పర్థలు వచ్చిన నేపథ్యంలో విడివిడిగా జీవిస్తున్నారు. లక్ష్మీ పిటిషన్ ఆధారంగా నెలకు పృథ్విరాజ్ రూ. 8 లక్షల మనోవర్తి భార్యకు చెల్లించాలని ఫ్యామిలీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. తీర్పును సవాల్ చేస్తూ పృథ్విరాజ్ హైకోర్టును ఆశ్రయించాడు.
ఈ కేసును పరిశీలించిన హైకోర్ట్ నెలకు రూ. 22 వేలు లక్ష్మీకి చెల్లించాలని పృథ్విరాజ్ కి సూచించింది. ఈ తీర్పును కూడా పృథ్విరాజ్ బేఖాతరు చేశాడు. భార్యకు మనోవర్తి క్రింద చెల్లించాల్సిన డబ్బులు చెల్లించలేదు. దాంతో లక్ష్మి తరపు న్యాయవాదులు ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఆదేశాలు పాటించని పృథ్విరాజ్ పై విజయవాడ ఫ్యామిలీ కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. దాంతో పృథ్విరాజ్ అరెస్ట్ కి రంగం సిద్ధమైంది.
Also Read: Nayanthara: స్టార్ హీరోకి హ్యాండ్ ఇచ్చిన నయనతార… రంగంలోకి సమంత!
పృథ్విరాజ్ మూడు దశాబ్దాలకు పైగా చిత్ర పరిశ్రమలో ఉన్నాడు. కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా విలన్ గా వందల చిత్రాల్లో నటించాడు. 2019 ఎన్నికల ముందు వైఎస్సార్సీపీ పార్టీలో చేరిన పృథ్విరాజ్ ఆ పార్టీ తరపున ప్రచారం చేశాడు. ఇందుకు గాను మాజీ సీఎం జగన్ ఆయనకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ చైర్మన్ ;పదవి ఇచ్చాడు. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొన్న పృథ్విరాజ్ ఆ పదవి పోగొట్టుకున్నాడు.
వైసీపీ వాళ్లే తనపై కుట్ర పన్నారంటూ అనంతరం ఆరోపణలు చేశాడు. జనసేన పార్టీలో చేరి ఆ పార్టీ తరపున విస్తృత ప్రచారం చేశాడు. 2024 ఎన్నికల ప్రచారం లో కూటమిని గెలిపించాలని పృథ్విరాజ్ కోరాడు. కెరీర్ పరంగా పృథ్విరాజ్ ఏమంత జోరు చూపడం లేదు. గతంలో మాదిరి ఆయనకు ఆఫర్స్ లేవు. దానికి తోడు లీగల్ సమస్యలు చుట్టుముడుతున్నాయి.