Anasuya Sen Gupta : భారతీయ నటి అనసూయ సేన్ గుప్తా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో చరిత్ర సృష్టించింది. ఉత్తమ నటిగా అవార్డు దక్కించుకున్న తొలి భారతీయ మహిళగా నిలిచింది. ఫ్రాన్స్ లో 77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ అట్టహాసంగా జరుగుతుంది. ఇందులో ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినిమా ఇండస్ట్రీల నుంచి రూపొందిన చిత్రాలను ప్రదర్శిస్తారు. నటులకు, టెక్నిషయన్లకు అవార్డులు అందిస్తారు. ప్రతి ఏడాది లాగే ఈ సంవత్సరం కూడా పలువురు సినీ ప్రముఖులు పాల్గొని సందడి చేస్తున్నారు.
ఈసారి భారత్ తరపున బాలీవుడ్ నుంచి ఐశ్వర్యరాయ్ బచ్చన్, కియారా అద్వానీ, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, శోభిత ధూళిపాళ్ల కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో సందడి చేశారు. అయితే ఈ వేడుకలో భారతీయ నటి అనసూయ సేన్ గుప్తా చరిత్ర సృష్టించారు. ‘ అన్ సర్టేటైన్ రిగార్డ్ ‘ విభాగంలో ఉత్తమ నటిగా కేన్స్ వేదిక పై అవార్డు అందుకున్నారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రోత్సవంలో అవార్డు గెలిచిన తొలి భారతీయ మహిళగా అరుదైన ఘనత సాధించారు.
బల్గెరియన్ దర్శకుడు కాన్స్టాంటిన్ భోజనోవ్ తెరకెక్కించిన ‘ ది షేమ్ లెస్ ‘ చిత్రానికి గాను ఆమె అవార్డు అందుకున్నారు. ఈ సినిమాలో ‘ రేణుక ‘ అనే సెక్స్ వర్కర్ పాత్రలో నటించారు. ఈ చిత్రాన్ని భారత్, నేపాల్ లో నెలన్నర రోజుల పాటు చిత్రీకరించారు. ఈ చిత్రం కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఈ చిత్రాన్ని ప్రదర్శించారు. కథ విషయానికొస్తే .. ఢిల్లీలోని ఓ వ్యభిచార గృహంలో లో రేణుక పోలీసును చంపి పారిపోతుంది.
అక్కడ నుంచి ఆమె సెక్స్ వర్కర్ల కమ్యూనిటీలో ఆశ్రయం పొందుతుంది. అక్కడ 17 ఏళ్ల దేవికతో ప్రేమలో పడుతుంది. తర్వాత వీరిద్దరూ ఎదుర్కొన్న పరిస్థితుల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. అనసూయ సేన్ గుప్తా ముంబైలో ప్రొడక్షన్ డిజైనర్ గా వర్క్ చేస్తున్నారు. దర్శకుడు బోజనోవ్ ఆమెకు ఫేస్ బుక్ ఫ్రెండ్. ఆమెకు సినిమాలో అవకాశం ఇచ్చారు. ‘ ది షేమ్ లెస్’ చిత్రంతో నటిగా పరిచయం అయింది. తొలి ప్రయత్నంలోనే కేన్స్ అవార్డు దక్కించుకోవడం విశేషం.