Pushpa 2: అనుకున్నదే జరిగింది. పుష్ప 2 విడుదల వాయిదా పడింది. ఏకంగా మరో నాలుగు నెలలు వెనక్కి వెళ్ళింది. ఇది ఫ్యాన్స్ ని నిరాశ పరిచే అంశమే. పుష్ప 2 రిలీజ్ ఆలస్యం కానుందని కొన్ని రోజులుగా పుకార్లు వినిపిస్తున్నాయి. పూరి జగన్నాథ్-రామ్ పోతినేని కాంబినేషన్ లో తెరకెక్కుతున్న డబల్ ఇస్మార్ట్ చిత్రం విడుదల తేదీగా ఆగస్టు 15 ప్రకటించారు. దాంతో అనుమానాలు బలపడ్డాయి. పుష్ప 2 విడుదల తేదీగా ప్రకటించిన ఆగస్టు 15న డబల్ ఇస్మార్ట్ ప్రకటించారు అంటే… అల్లు అర్జున్ చిత్రం వాయిదా పడినట్లే అని టాలీవుడ్ వర్గాలు అభిప్రాయపడ్డాయి.
నిన్న అధికారికంగా పుష్ప 2 యూనిట్ స్పష్టత ఇచ్చారు. పుష్ప 2 డిసెంబర్ 24న విడుదల కానుంది. దర్శకుడు సుకుమార్ క్వాలిటీ విషయంలో అసలు కాంప్రమైజ్ కావడం లేదు. పుష్ప 2 పై ఉన్న హైప్ రీత్యా అంచనాలు అందుకోవాలంటే బెస్ట్ కంటెంట్ తో రావాలని ఆయన తాపత్రయ పడుతున్నారు. అలాగే పుష్ప 3కి లీడ్ ఇచ్చేలా క్లైమాక్స్ ని ఆయన మార్చారనే వాదన ఉంది. ముందుగా అనుకున్న రెండు క్లైమాక్స్ లు కాకుండా మరో క్లైమాక్స్ షూట్ చేస్తున్నారట.
ఈ కారణాలతో పుష్ప 2 చిత్రీకరణ అనుకున్న సమయానికి పూర్తి కాలేదు. హడావుడిగా ప్రేక్షకుల ముందుకు రావడం సరికాదని భావిస్తున్న సుకుమార్ మరో నాలుగు నెలల సమయం తీసుకున్నాడు. పుష్ప 2 విడుదల ఆలస్యం కావడం అభిమానులను నిరాశ పరిచే అంశమే. కాబట్టి ఫ్యాన్స్ కి ఇది బ్యాడ్ న్యూస్. అయితే విడుదల వాయిదా పడటంలో గుడ్ న్యూస్ కూడా ఉంది.
Also Read: Allu Arjun: అల్లు అర్జున్ సుకుమార్ మధ్య విభేదాలు వచ్చాయా..?
పుష్ప మూవీ కూడా డిసెంబర్ లోనే విడుదలైంది. 2021 డిసెంబర్ 17న క్రిస్మస్ కానుకగా విడుదలైన పుష్ప ది రైజ్ అనూహ్య విజయం సాధించింది. హిందీలో పుష్ప చిత్రానికి ఆ స్థాయిలో ఆదరణ దక్కుతుందని ఊహించలేదు. నార్త్ ఇండియాలో అల్లు అర్జున్ ఇమేజ్ తార స్థాయికి చేర్చింది. కలిసొచ్చిన డిసెంబర్ నెలలో పుష్ప 2 విడుదల కానుంది. సెంటిమెంట్ రిపీట్ అయితే పుష్ప పార్ట్ 1కి మించిన విజయం సొంతం అవుతుంది. అలాగే డిసెంబర్ చివరి వారంలో విడుదలయ్యే చిత్రాలకు లాంగ్ రన్ ఉంటుంది. క్రిస్మస్, ఆ వెంటనే న్యూ ఇయర్ మూడ్ ప్రేక్షకుల్లో ఉంటుంది. సినిమాలో విషయం ఉంటే… సంక్రాంతి చిత్రాలు వచ్చే వరకు బాక్సాఫీస్ కొల్లగొట్టవచ్చు. కాబట్టి పుష్ప 2 విడుదల ఆలస్యం అయినా కలిసొచ్చే అంశాలు చాలా ఉన్నాయి.