Lok Sabha Elections 2024: 2014 నుంచి బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతున్న కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్షం.. ప్రతీసారి గెలుపు అవకాశాలను చేజార్చుకుంటోందని అన్నారు మాజీ ఎన్నికల స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిశోర్ అలియాస్ పీకే. మూడు అవకాశాలను సద్వినియోగంచేసుకుని ఉంటే.. 2024 లోక్‌సభ ఎన్నికల నాటికి మెరుగైన స్థితిలో ఉండేదని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని బీజేపీని ఎదుర్కొనేందుకు బలంగా ఉండేదని తెలిపారు. కాంగ్రెస్ వినియోగించుకోలేకపోయిన మూడు అంశాలను ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు.
– 2015 జనవరిలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధించింది. అదే ఏడాది నవంబర్‌లో జరిగిన బీహార్ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయింది. మరుసటి ఏడాది మేలో అసోం, తమిళనాడు, పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. బీజేపీ కేవలం అసోంలో మాత్రమే గెలిచింది. ఈ 18 నెలల కాలంలో కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్షాలకు అవకాశం ఉన్నా.. సద్వినియోగం చేసుకోలేకపోయాయని తెలిపారు.
– ఇక 2016లో ప్రధాని మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం పెద్ద నోట్లు(రూ.5001,000) రద్దు చేసిన తర్వాత ప్రతిపక్షాలకు మరో అవకాశం లభించిందని తెలిపారు. దేశంలో ఒక రకమైన అలజడి నెలకొందని పేర్కొన్నారు. ఆ తర్వాత 2016లో జరిగిన యూపీ ఎన్నికల్లోనూ బీజేపీ గెలిచింది. తర్వాత గుజరాత్ ఎన్నికలకు ముందు పటేళ్ల నుంచి నిరసనలు వెల్లువెత్తాయి. మహారాష్ట్రలో కూడా నిరసనలు జరిగాయి అని పేర్కొన్నారు. బీజేపీకి, ప్రధాని మోదీకి ఇది గడ్డు పరిస్థితి అని తెలిపారు. 2017 నవంబర్‌లో జరిగిన గుజరాత్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయినప్పటికీ గట్టి పోటీ ఇచ్చిందని గుర్తు చేశారు. కానీ ఆ పోటీని ప్రతిపక్షాలు సద్వినియోగం చేసుకోలేకపోయాయని వెల్లడించారు. దీంతో రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ మరియు మధ్యప్రదేశ్ ఎన్నికల్లోనూ ఓడిపోయినట్లు వివరించారు. 2017 నుంచి 2018 చివరి వరకు 17 నెలల వ్యవధిలో బీజేపీ వెనుకంజలో ఉన్నా ప్రతిపక్షాలు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాయని తెలిపారు.
– 2021 కోవిడ్ రెండో వేవ్ తర్వాత కూడా మోదీ వేవ్ తగ్గిందని గుర్తుచేశారు. ఈ సమంయలో ప్రతిపక్షాలు మరో అవకాశాన్ని కోల్పోయాయని చెప్పారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయిందని తెలిపారు. 2023 జూన్‌లో అనేక పార్టీలు కలిసి, మాజీ ఇండియా కూటమికి వచ్చినప్పుడు ప్రతిపక్షానికి చివరి అవకాశం. ఈ సమయంలో లోక్‌సభ ఎన్నికల్లో 220–240 సీట్లు గెలిచే అవకాశం వచ్చిందని తెలిపారు. అయితే దానిని కాపాడుకోవడంలో విపక్షాలు విఫలమయ్యాయని పేర్కొన్నారు. ఫలితంగా అదే ఏడాది నవంబర్ – డిసెంబర్‌లో జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచే అవకాశం ఏర్పడిందని తెలిపారు. విపక్షాలకు వచ్చిన ఊపును కొనసాగించకపోవడంతో బీజేపీ మళ్లీ బలపడి మూడు రాష్ట్రాల్లో విజయం సాధించిందని పేర్కొన్నారు. రామ మందిరం ప్రారంభం తర్వాత విపక్షాలు పూర్తిగా చేతులెత్తేశాయని తెలిపారు.