Covid: కోవిడ్ ముప్పు మళ్లీ ముంచుకొస్తోందా.. మరోసారి వైరస్ పంజా విసరబోతోందా అంటే అవుననే అంటున్నారు వైద్య నిపుణులు. ఇప్పటికే సింగపూర్‌ను కోవిడ్ కొత్త వేరియంట్ కుదిపేస్తోంది. కేపీ–1, కేపీ–2 వేరియంట్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. కొత్త వేరియంట్ వ్యాప్తి అధికంగా ఉన్నట్లు అక్కడి వైద్యులు పేర్కొంటున్నారు. గడిచిన 20 రోజుల్లో ఆదేశంలో 34 వేల కేసులు నమోదయ్యాయని అధికార వర్గాలు వెల్లడించాయి.
అన్నీ జేఎన్1 సబ్ వేరియంట్లే..
సింగపూర్‌లో నమోదవుతున్న కేసులన్నీ జేఎన్1 సంబ్ వేరియంట్లే అని వైద్యులు చెబుతున్నారు. కంగారు చెందాల్సిన అవసరం లేదని పేర్కొంటున్నారు. వైరస్‌లో మ్యుటేషన్ల కారణంగా వైరస్ వ్యాపిస్తోందని తెలిపారు. భారత్‌తో కూడా కొత్త వేరియంట్ కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటి వరకు కేపీ2 వేరియంట్ కేసులు 290, కేపీ1 కేసులు 34 నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. ఇండియన్ సార్స్–కోవ్2 జీనోమిక్స్ కన్సార్షియం సభ్యులు ఎప్పటికప్పుడు కోవిడ్ వేరియంట్లపై పరిశోధన చేస్తున్నట్లు పేర్కొన్నారు. కేపీ–1 కేసులు ఎక్కువగా పశ్చిమ బెంగాల్‌లో 23 నమోదయ్యాయని పేర్కొన్నారు. ఇక కేపీ2 కేసులు ఎక్కువగా మహారాష్ట్ర(148) నమోదైనట్లు వెల్లడించారు.
సింగపూర్‌లో విజృంభణ..
ఇదిలా ఉంటే కోవిడ్ కొత్త వేరియంట్లు సింగపూర్‌లో విజృంభిస్తున్నాయి. మే 5 నుంచి 11 మధ్య కేవలం వారం వ్యవధిలో 25,900 కేసులు నమోదు కావడం వైరస్ తీవ్రతకు అద్దం పడుతోంది. భారత్‌లో ఇలాంటి పరిస్థితి ఉండదని వైద్య ఆరోగ్య శాఖ చెబుతోంది. అయినా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తోంది.