American Elections: అమెరికా అధ్యక్ష ఎన్నికలకు కౌంట్ డౌన్ మొదలైంది. ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్న ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. ఇక్కడ కేవలం రెండు పార్టీల మధ్యనే పోటీ నెలకొంటుంది. అందులో ఒకటి రిపబ్లికన్ పార్టీ మరొకటి డెమోక్రటిక్. ఈ సారి ఎన్నికల్లో మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ పోటీలో ఉన్నారు. వీరిద్దరి మధ్య పోటీ చాలా ఆసక్తికరంగా మారింది. నువ్వా నేనా అన్నట్లుగా పోటీ కనిపిస్తోంది. అటు అగ్రదేశానికి కాబోయే అధ్యక్షుడు ఎవరని ప్రపంచం కూడా ఆసక్తిగా ఎదురుచూస్తోంది.
ఈసారి అమెరికా ఎన్నికల్లో భారత ఓటర్లు కీలక పాత్ర పోషించబోతున్నారనేది వాస్తవం. అమెరికాలో భారతీయ ఓటర్లు కూడా చాలా వరకు ఉన్నారు. ఇక్కడకు వచ్చిన సెటిల్ అయిన వారే కాకుండా.. గ్రీన్ కార్డు హోల్డర్లకు కూడా ఓటు వేసే ఛాన్స్ ఉండడంతో అధ్యక్షుడి గెలుపోటముల్లో వీరు కూడా ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి. అయితే.. గతంలో ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో భారతీయులు చాలా వరకు ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా వీసాల అంశంలో కట్టుదిట్టమైన నిర్ణయాలతో ఇబ్బందులు పెట్టారు. ఈసారి కూడా ట్రంప్ అధ్యక్షుడు అయితే అలాంటి నిబంధనలే అమలు చేసే అవకాశాలు లేకపోలేదు. దీంతో అమెరికన్ కంపెనీలు ఇండియా నుంచి ఉద్యోగులను తెప్పించుకోవడం కూడా మానేస్తాయన్న ప్రచారం జరుగుతోంది. దీంతో ఐటీ కంపెనీలకు కూడా ట్రంప్ నిర్ణయాలు సవాల్ కానున్నాయి. ఇప్పటికే అమెరికన్ మార్కెట్‌లో భారత ఉద్యోగులకు చాలా వరకు డిమాండ్ తగ్గింది. కోవిడ్ తర్వాత కంపెనీలు కూడా ఆన్‌సైట్‌ను ప్రోత్సహించడంలేదు. ట్రంప్ అధికారంలోకి వస్తే వీసాలను మరింత టైట్ చేసే అవకాశాలు లేకపోలేదు.
ఈ క్రమంలో భారత అమెరికాన్లు కమలా హ్యారిస్‌కే మద్దతు తెలుపుతున్నారని అక్కడి సర్వేలు చెబుతున్నాయి. భారతీయుల మద్దతు కూడగట్టడంలో కమలా సక్సెస్ అయ్యారని సర్వేలు వెల్లడిస్తున్నాయి. కమలాకు భారత మూలాలు ఉండడం కూడా ఆమెకు కలిసి వచ్చే అవకాశం అని సర్వేలు చెబుతున్నాయి. అటు.. భవిష్యత్ కోసం కూడా భారతీయులు కమలా వైపు మొగ్గుచూపుతున్నారని తెలిపాయి. ఇదిలా ఉంటే.. ఇమ్మిగ్రెంట్స్ విషయంలోనూ సానుకూలంగా ఉంటానని కమలా చెప్పారు. మరోవైపు ఆమెరికా ఆర్థిక పరిస్థితి కూడా అంత గొప్పగా లేదు. అటు ఇరాన్, ఇజ్రాయెల్, రష్యా ఉక్రెయిన్ యుద్ధాలు తలనొప్పిలా మారాయి. మరోవైపు అమెరికా ఇజ్రాయెల్‌కు నేరుగా మద్దతు తెలుపుతోంది. ఆయుధాలతోపాటు సైన్యాన్ని కూడా సమకూరుస్తోంది. ఇప్పుడు ఈ ఎన్నికల్లో ఈ రెండు అంశాలు కూడా కీలకంగా మారబోతున్నాయి. ఈ ట్రెండింగ్ ఆధారంగానే అభ్యర్థులు ఓట్లు పడుతాయని నిపుణులు భావిస్తున్నారు. అయితే మొన్నటివరకు ట్రంప్‌కు కాస్త మెజార్టీ కనిపించినట్లుగా సర్వేలు వెల్లడించినా.. మరోసారి కమలా రేసులోకి వచ్చారని తెలిపాయి. అందులో భాగంగా భారతీయ అమెరికన్ల మద్దతు కూడా ఆమెకు రోజురోజుకూ పెరుగుతున్నట్లుగా వెల్లడించాయి. ప్రస్తుతం కమలాకు భారతీయ అమెరికన్ల మద్దతు 61 శాతం నమోదైంది. అటు ట్రంప్‌కు మాత్రం కేవలం 31శాతం మంది మాత్రమే మద్దతుగా నిలిచారు. ఈ విషయాన్ని ఇండియన్ అమెరికన్ ఆటిట్యూడ్ సర్వే వెల్లడించింది.