Homeఎడ్యుకేషన్Group 2 Exam Postponed: తెలంగాణ గ్రూప్‌ 2 పరీక్ష వాయిదా.. అభ్యర్థుల ఆందోళనతో నిర్ణయం.....

Group 2 Exam Postponed: తెలంగాణ గ్రూప్‌ 2 పరీక్ష వాయిదా.. అభ్యర్థుల ఆందోళనతో నిర్ణయం.. డిసెంబర్‌లో పరీక్ష

Group 2 Exam Postponed: తెలంగాణలో డీఎస్సీ, గ్రూప్‌–1, 3 పరీక్షలు వాయిదా వేయాలని కొన్ని రోజులుగా అభ్యర్థులు, విద్యార్థి సంఘాలు చేస్తున్న ఆందోళనకు రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చింది. డీఎస్సీ పరీక్షల నేపథ్యంలో గ్రూప్‌–2 పరీక్షను వాయిదా వేయాలని నిర్ణయించింది. ఆగస్టు 7, 8వ తేదీల్లో జరగాల్సిన గ్రూప్‌–2 పరీక్షను డిసెంబర్‌కు వాయిదా వేస్తున్నట్లు టీజీపీఎస్సీ ప్రకటించింది. దీంతో అభ్యర్థులకు ఊరట లభించింది.

ప్రభుత్వాన్ని కుదిపేసిన వివాదం..
తెలంగాణ డీఎస్సీ, గ్రూప్‌ 2 పరీక్షల వివాదం రాష్ట్ర ప్రభుత్వాన్ని కుదిపేస్తోంది. వివాదాల నడుమ డీఎస్సీ పరీక్షలు గురువారం(జులై 18) నుంచి ప్రారంభమయ్యాయి. సిద్ధమయ్యేందుకు తగిన సమయం ఇవ్వనందున పరీక్షను రద్దు చేయాలని కోరుతూ కొందరు నిరుద్యోగులు హైకోర్టును ఆశ్రయించారు. అయితే పరీక్షలపై స్టే ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. మరోవైపు పిల్‌ వేసిన అభ్యర్థులు హాల్‌టికెట్లు సమర్పించకపోవడంపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఈ వివాదం కోర్టులో నడుస్తోంది. మరోవైపు డీఎస్సీ పరీక్షలు ముగిసిన వారానికే గ్రూప్‌–2 పరీక్ష ఉంది. ఈ నేపథ్యంలో అభ్యర్థుల కోరిక మేరకు గ్రూప్‌ 2 వాయిదా వేసేందుకు ప్రభుత్వం నుంచి సానుకూల స్పందించింది. గ్రూప్‌–2 వాయిదాకు కృషి చేస్తామని ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌ అభ్యర్థులకు హామీ ఇచ్చారు. గురువారం (జులై 18) బేగంపేటలోని టూరిజం ప్లాజాలో నిరుద్యోగులతో సమావేశమైన వీరు.. వారిని సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నిరుద్యోగులు తమ గోడును వెల్లడించారు. డీఎస్సీ, గ్రూప్‌–2 పరీక్షలకు మధ్య చాలా తక్కువ వ్యవధి ఉందని తెలిపారు. గ్రూప్‌–2 పరీక్ష వాయిదా వేయాలని కోరారు. అభ్యర్థుల డిమాండ్‌ న్యాయమైనదే అని గుర్తించిన ఎంపీ, ఎమ్మెల్సీ సమస్యను సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి గ్రూప్‌–2 వాయిదా వేయిస్తామని తెలిపారు. చెప్పినట్లుగానే సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్లగా ఆయన సానుకూలంగా స్పందించారు. దీంతో టీజీపీఎస్సీ గ్రూప్‌–2 వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. అయితే డిసెంబర్‌లో ఎప్పుడు నిర్వహించేది ప్రకటించలేదు.

783 పోస్టులతో గ్రూప్‌–2
ఇదిలా ఉంటే.. 18 విభాగాల్లో 783 పోస్టులతో టీజీపీఎస్స గతేడాది గ్రూప్‌–2 నోటిఫికేషన్‌ ఇచ్చింది. 2023 జనవరి 18 నుంచి ఫిబ్రవరి 16 వరకు దరఖాస్తులు స్వీకరించింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 5,51,943 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటికే మూడుసార్లు వివిధ కారణాలతో గ్రూప్‌ 2 వాయిదా పడింది. తాజాగా ప్రభుత్వం మరోమారు గ్రూప్‌–2ను డిసెంబర్‌కు వాయిదా వేసింది.

30 వేల మంది డీఎస్సీకి దూరం..
ఇదిలా ఉంటే.. గ్రూప్‌–2 పరీక్ష వాయిదా వేయని కారణంగా సుమారు 30 వేల మంది డీఎస్పీ పరీక్ష రాయకూడదని నిర్ణయించుకున్నారు. వీరంతా హాల్‌టికెట్లు కూడా డౌన్‌లోడ్‌ చేసుకోలేదు. డీఎస్సీపై దృష్టిపెడితే గ్రూప్‌–2 పరీక్ష రాయలేమని డీఎస్సీని వదులుకున్నారు. అయితే తాజాగా టీజీపీఎస్సీ గ్రూప్‌–2 వాయిదా వేసిన నేపథ్యంలో వీరంతా డీఎస్సీ పరీక్షలు రాసే అవకాశం ఉంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular