ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ పదో తరగతి చదివిన విద్యార్థులకు శుభవార్త చెప్పింది. కరోనా వైరస్, లాక్ డౌన్ వల్ల ట్రిపుల్ ఐటీ ప్రవేశాల్లో గందరగోళం నెలకొనడంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతి సంవత్సరం ట్రిపుల్ ఐటీల్లో విద్యార్థుల పదో తరగతి మార్కులు లేదా జీపీఏ ఆధారంగా ప్రవేశాలు జరిగేవి. ఈ సంవత్సరం కరోనా వల్ల విద్యాశాఖ పదో తరగతి పరీక్షలను నిర్వహించలేదు.
Also Read : టీడీపీకి షాక్ తగలనుందా..?
దీంతో రాష్ట్రంలోని ట్రిపుల్ ఐటీల్లో పరీక్షలు లేకుండా ప్రవేశాలు ఎలా చేపడతారో విద్యార్థుల తల్లిదండ్రులకు, విద్యార్థులకు అర్థం కాలేదు. ప్రస్తుతం రాష్ట్రంలోని నాలుగు ట్రిపుల్ ఐటీల్లో 4,000 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ సీట్ల కోసం ప్రవేశ పరీక్ష నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం గమనార్హం. మ్యాథ్స్, సైన్స్ సబ్జెక్టులపై ప్రవేశ పరీక్ష నిర్వహించి పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా విద్యార్థులకు ప్రవేశాలు కల్పిస్తారు.
విద్యార్థులు ఆఫ్ లైన్ విధానంలో 180 నిమిషాల సమయంలో పెన్ను, పేపర్ సహాయంతో పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఈ పరీక్షకు 50 వేల నుంచి 70 వేల మంది విద్యార్థులు హాజరు కావచ్చని అధికారులు భావిస్తున్నారు. అధికారులు మొదట పదో తరగతి ఇంటర్నల్ మార్కుల ద్వారా ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలు కల్పించాలని భావించారు. అయితే అధికారుల విచారణలో రాష్ట్రంలోని పలు ప్రైవేట్ పాఠశాలల్లో మార్కుల విషయంలో అక్రమాలు జరిగినట్లు గుర్తించారు.
ఇంటర్నల్ మార్కుల ద్వారా ప్రవేశాలు కల్పిస్తే ప్రభుత్వ స్కూళ్లకు చెందిన విద్యార్థులు నష్టపోయే అవకాశం ఉందని భావించారు. అలా కాకుండా పరీక్ష నిర్వహిస్తే ప్రతిభ కలిగిన విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. విద్యాశాఖా మంత్రి ఆదిమూలపు సురేశ్ నుంచి ఈ మేరకు ప్రకటన వెలువడింది. ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాల గురించి జగన్ సర్కార్ స్పష్టత ఇవ్వడంపై విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Also Read : ట్రబుల్ షూటర్ ‘సెంటిమెంట్’ రాజకీయం వర్కవుట్ అవుతుందా?