AP SSC Results 2025: ఏపీలో( Andhra Pradesh) పదో తరగతి పబ్లిక్ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. మంత్రి నారా లోకేష్ ఈ ఫలితాలను విడుదల చేశారు. మొత్తం పరీక్షలు రాసిన విద్యార్థుల్లో 81.14 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. బాలుర ఉత్తీర్ణత శాతం 78.31 శాతం ఉండగా.. బాలికల ఉత్తీర్ణత శాతం 84.09. ఈ ఏడాది 6,14,459 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. 4,98,585 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. మార్చి 17 నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. అదే నెల 31 వరకు కొనసాగాయి. తరువాత మూల్యాంకనం, ఫలితాల కంప్యూటరీకరణ వంటివి పూర్తి చేశారు. అవన్నీ పూర్తి కావడంతో ఫలితాలను వెల్లడించారు.
Also Read: అటు వైసిపి.. ఇటు టిడిపి.. ఏకకాలంలో విజయసాయిరెడ్డి టార్గెట్!
* పార్వతీపురం మన్యం ప్రథమ స్థానం..
రాష్ట్రవ్యాప్తంగా ఫలితాల్లో పార్వతీపురం మన్యం( parvatipuram manyam ) జిల్లా విద్యార్థులు 93.90%తో అగ్రస్థానంలో నిలిచారు. కాగా ఫెయిల్ అయిన విద్యార్థులు నిరుత్సాహ పడవద్దని.. వారికి రెండోసారి పరీక్ష రాసే అవకాశం ఉందన్నారు. మే 19 నుంచి 28 వరకు సప్లమెంటరీ పరీక్షలు జరుగుతాయని.. వారందరూ పరీక్ష రాసి ఉత్తీర్ణత సాధించాలని లోకేష్ ఆకాంక్షించారు. మరోవైపు ఏపీలో 1680 పాఠశాలలు 100% ఉత్తీర్ణత నమోదు చేసుకున్నాయి. 19 పాఠశాలలు సున్నా శాతం ఉత్తీర్ణత పొందాయి. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పరీక్ష ఫలితాల సందడి నెలకొంది.
* వాట్సాప్ ద్వారా ఫలితాలు..
విద్యార్థుల కోసం తొలిసారిగా వాట్సాప్ ( WhatsAp) ద్వారా ఫలితాలను వెల్లడించారు. విద్యార్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్సైట్స్ https://bse.ap.gov.in…https://apopenschool.ap.gov.in/ లలో మాత్రమే కాకుండా పలు సైట్స్ లో చెక్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఈ ఏడాది మనమిత్ర వాట్సాప్ ద్వారా కూడా చెక్ చేసుకునే అవకాశం ఉంది. వాట్సాప్ లో 95523 00009 నంబర్కు హాయ్ అని మెసేజ్ పంపి విద్యా సేవలను ఎంచుకోవచ్చు. ఆపై ఎస్ఎస్సి పరీక్ష ఫలితాలను ఎంచుకొని… వారి రూల్ నెంబర్ను నమోదు చేయడం ద్వారా ఫలితాలను పిడిఎఫ్ కాపీని పొందవచ్చు. అలాగే సంబంధిత పాఠశాలల హెచ్ఎంల లాగిన్ ల ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా లీప్ మొబైల్ యాప్ ఉపాధ్యాయులు, విద్యార్థుల లాగిన్ ల ద్వారా కూడా ఫలితాలు పొందే సౌలభ్యం ఉంది.