Vijaya Sai Reddy : ఏపీలో రాజకీయాలు( politics) ఆసక్తికరంగా మారుతున్నాయి. ఎవరికి ఎవరు శత్రువు.. ఎవరి మిత్రుడు తెలియని పరిస్థితి ఉంది. కొద్ది రోజుల కిందట వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు విజయసాయిరెడ్డి. వ్యవసాయం చేసుకుంటానని చెప్పుకొచ్చారు. ఇకనుంచి రాజకీయాలు మాట్లాడనని కూడా చెప్పుకున్నారు. కానీ కొద్దిరోజుల పాటు సైలెంట్ గా ఉన్న ఆయనలో సరికొత్త కోణం బయటపడింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా ఆయన విమర్శలు ఉన్నాయి. ముఖ్యంగా వైసీపీలో కోటరీ పై ఆయన టార్గెట్ చేశారు. తాజాగా మద్యం కుంభకోణం విషయంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నేతలే టార్గెట్ గా విజయసాయిరెడ్డి చేసిన కామెంట్స్ ఇప్పుడు ప్రకంపనలు రేపుతున్నాయి. ఈ కేసులో ప్రధాన సూత్రధారిగా ఉన్న రాజ్ కసిరెడ్డిని టార్గెట్గా చేసుకొని.. విజయసాయిరెడ్డి కీలక కామెంట్స్ చేశారు. మద్యం కుంభకోణం విషయంలో తనకు తాను విజిల్ బ్లోయర్ గా అభివర్ణించుకున్నారు. మద్యం స్కాం లో మిగిలిన నిందితుల బట్టలు విప్పేందుకు సహకరిస్తానన్నారు. అయితే ఇప్పుడు వైయస్సార్ కాంగ్రెస్ తో పాటు టిడిపికి ఆయన టార్గెట్ అవుతున్నారు.
Also Read :విప్పింది సగం బట్టలే.. విజయసాయి రెడ్డి సంచలన కామెంట్స్!
* ఆ అనుమానం నేపథ్యంలో..
సహజంగానే ఈ చర్యలు చూశాక విజయసాయిరెడ్డి( Vijaya Sai Reddy).. కూటమి చేతుల్లోకి వెళ్లిపోయారు అన్నది సర్వత్రా అభిప్రాయం. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో కీలక బాధ్యతలు వదులుకున్నారు. మూడున్నర ఏళ్ల పాటు ఉన్న రాజ్యసభ పదవీ కాలాన్ని సైతం వదులుకున్నారు. ఇది ముమ్మాటికి కూటమికి మేలు చేసేందుకేనని రాజీనామా చేసినప్పుడు విజయసాయిరెడ్డి ప్రకటించారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత టిడిపి కూటమికి వ్యతిరేకంగా ఎన్నడూ వ్యాఖ్యలు చేయలేదు. పైగా మద్యం కుంభకోణం విషయంలో అడగకుండానే ఆధారాలు ఇస్తానని బహిరంగంగా ప్రకటించారు. అదే సమయంలో ప్రత్యేక దర్యాప్తు బృందం విజయసాయి రెడ్డికి నోటీసులు ఇచ్చింది. అయితే ఆ కేసులో అనుమానితుడిగా ఇచ్చిందా? లేకుంటే సాక్షిగా ఇచ్చిందా? అన్నది తెలియాల్సి ఉంది. అయితే ఈ కేసు విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి మాత్రం దర్జాగా గౌరవప్రదంగా వెళ్లి వచ్చారు.
* అంబటి రాంబాబు ఫైర్
అయితే ఈ కేసులో తాను విజిల్ బ్లోయర్( whistle blower) గా అభివర్ణించుకోవడంపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రి అంబటి రాంబాబు దీనిపై తీవ్రంగా స్పందించారు. తమ పార్టీ నుంచి బయటకు వెళ్లిన విజయసాయిరెడ్డి ఇప్పుడు చంద్రబాబు చేతుల్లో ఉన్నారని ఆరోపించారు. అందుకే ఆయన అలా మాట్లాడుతున్నారని గుర్తు చేశారు. మూడున్నర ఏళ్ల పదవీ కాలాన్ని కూటమి ప్రయోజనాల కోసం వదులుకున్న విషయాన్ని ప్రస్తావించారు. అలాంటి వ్యక్తి మాటలకు, సాక్షాలకు విశ్వసనీయత లేదని చెప్పారు అంబటి రాంబాబు.
* టిడిపి నేత ట్వీట్
మరోవైపు టిడిపి యువనేత చింతకాయల విజయ్( chintakayala Vijay ) సైతం విజయసాయిరెడ్డి కామెంట్స్ పై స్పందించారు. నువ్వు విజిల్ బ్లోవర్ వి కాదు. క్రైమ్ బ్లోవర్ వి. విశాఖపట్నం సర్క్యూట్ హౌస్ లో కూర్చుని విజయసాయిరెడ్డి నిర్వహించిన డిస్టలరీల దందా, తయారు చేయించిన నకిలీ మద్యం వ్యవహారాలపై తనకు స్పష్టమైన సమాచారం ఉందని చింతకాయల విజయ్ స్పష్టం చేశారు. త్వరలోనే ఆ బాధితులు సిఐడి కి ఫిర్యాదు చేయనున్నారని.. అప్పటికి విజయసాయిరెడ్డి బట్టలు విప్పి పరిస్థితి ఏర్పడుతుందని హెచ్చరించారు. తస్మాత్ జాగ్రత్త అంటూ వార్నింగ్ ఇచ్చారు.
నువ్వు విజిల్ బ్లోవర్ వి కాదు, క్రైమ్ బ్లోవర్ వి @VSReddy_MP .. విశాఖ సర్క్యూట్ హౌస్ లో కూర్చొని నువ్వు చేసిన డిస్టలరీల దందా,తయారు చేయించిన నకిలీ మద్యం గురించి నాకు తెలుసు..త్వరలోనే ఆ బాధితులు సీఐడీ కి కంప్లైంట్ ఇచ్చి నీ బట్టలు విప్పడానికి సిద్ధంగా ఉన్నారు.. తస్మాత్ జాగ్రత్త !!
— Vijay chintakayala (@vijaychinthak) April 22, 2025