
ప్రస్తుతం దేశమంతటా కరోనా కాలం నడుస్తోంది. వైరస్ శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. దేశంలో ప్రతిరోజూ రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఇతర రంగాలతో పోలిస్తే వైరస్ విద్యా రంగంపై తీవ్ర ప్రభావం చూపింది. మరి కొన్ని నెలల వరకు వైరస్ తో సహజీవనం చేయక తప్పదని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరోక్షంగా సంకేతాలు ఇస్తున్నాయి. ఇంట్లో సందేహాలను నివృత్తి చేసేవాళ్లు లేక పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేవాళ్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఇలాంటి తరుణంలో విద్యార్థులకు ప్రయోజనం చేకూరే విధంగా ఏపీ ఉన్నత విద్యామండలి నుంచి శుభవార్త వెలువడింది. ఎంసెట్, పీజీసెట్, ఎడ్‌సెట్, లాసెట్, ఏపీపీఈసెట్, తదితర పరీక్షల గడువును మరికొన్ని రోజుల పాటు పొడిగిస్తున్నట్టు విద్యా మండలి కీలక ప్రకటన చేసింది. అధికారికంగా ఉన్నత విద్యామండలి నుంచి ఈ మేరకు ఒక ప్రకటన విడుదలైంది. విద్యార్థులు ఈ పరీక్షలకు దరఖాస్తు చేసుకునేందుకు ఉన్నత విద్యామండలి మరో అవకాశం ఇచ్చింది.
లాసెట్, ఎడ్ సెట్, ఏపీపీఈసెట్ లేట్ ఫీజు దరఖాస్తు గడువును ఈ నెల 25 వరకు, పీజీసెట్‌కు ఈ నెల 23 వరకు, ఎంసెట్‌కు ఈ నెల 15వ తేదీ వరకు అధికారులు దరఖాస్తు గడువు పొడిగించారు. ఈ నెల 17, 18,21,22,23 తేదీల్లో రాష్ట్రంలో ఎంసెట్ పరీక్షలు జరగనున్నాయి. అగ్రికల్చర్ ఎంసెట్ పరీక్షలు 23, 24, 25 తేదీలలో జరగనున్నాయి.
https://sche.ap.gov.in/ వెబ్ సైట్ ద్వారా పరీక్షల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు సులభంగా హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకోవడం సాధ్యమవుతుంది. ఎంసెట్, అగ్రికల్చర్ ఎంసెట్ పరీక్షలను ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు ఒక సెషన్ గా మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మరో సెషన్ గా నిర్వహించనున్నారు.