
ఏపీలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన రోజు నుంచి రాష్ట్రంలో సొంత ఇల్లు లేని ప్రతి ఒక్కరికీ ఇళ్ల పట్టాల పంపిణీ జరగాలని 30 లక్షల ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. గ్రామ, వార్డ్ వాలంటీర్లు సమగ్ర సర్వే చేసి ఇళ్ల పట్టాలకు అర్హుల జాబితాను రూపొందించారు. మొదట ఈ సంవత్సరం ఉగాది పండుగ సందర్భంగా మార్చి 25వ తేదీన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం చేపట్టాలని జగన్ సర్కార్ భావించింది.
అయితే అదే సమయంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఉండటంతో ఇళ్ల పట్టాల పంపిణీ వాయిదా పడింది. ఆ తరువాత ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి సందర్భంగా, జులై 8వ తేదీన వైఎస్సార్ జయంత్రి సందర్భంగా ఇళ్ల పట్టాల పంపిణీ చేపట్టాలని జగన్ సర్కార్ భావించినా అప్పటికే కోర్టుల్లో పలు పిటిషన్లు దాఖలు కావడంతో ఇళ్ల పట్టాల పంపిణీ వాయిదా పడుతూ వస్తోంది.
జగన్ సర్కార్ సేకరించిన భూముల విషయంలో కొన్ని వివాదాలు ఉన్నాయి. నిబంధనలకు విరుద్ధంగా జగన్ సర్కార్ భూములు సేకరించిందనే ఆరోపణలు ఉన్నాయి. ఆ వివాదాల వల్లే కోర్టు ఇళ్ల పట్టాల పంపిణీకి ఆమోదం ఇవ్వడం లేదు. పలు ప్రాంతాల్లో జగన్ సర్కార్ ఆవభూములను సేకరించిందనే ఆరోపణలు ఉన్నాయి. ఈ భూముల విషయంలో జగన్ సర్కార్ మొండి వైఖరి గురించి ఎవరికీ అర్థం కావడం లేదు.
జగన్ సర్కార్ ఇళ్ల పట్టాల పంపిణీ గురించి ప్రశ్న ఎదురైతే న్యాయస్థానాల నుంచి అనుమతి కోసం మాత్రమే తాము వేచి ఉన్నామని… గ్రీన్ సిగ్నల్ వస్తే వెంటనే ఇళ్ల పట్టాల పంపిణీ జరుగుతుందని చెబుతోంది. రోజులు గడుస్తున్నా నెలలు గడుస్తున్నా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అనే విధంగా ఉండటంతో ఇళ్ల పట్టాల కోసం ఇంకా ఎన్ని నెలలు వేచి ఉండాలని లబ్ధిదారుల నుంచి ప్రశ్నలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.