https://oktelugu.com/

Woman: అది ఆమె మొదటి రాత్రి.. పాల గ్లాస్ తో వెళ్ళింది.. భర్త వాలకం చూసి.. హృదయం ద్రవించే జీవిత కథ ఇది

చాలా రోజుల తర్వాత రమ్యకు ఒక సంబంధం వచ్చింది. 40 సంవత్సరాల వయసు ఉన్న వ్యక్తి ఆమెను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడు. దీంతో రమ్య ఒక్కసారిగా ఊపిరి పీల్చుకుంది. హమ్మయ్య నాకు కూడా పెళ్లవుతున్నదని ఎగిరి గంతేసింది.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : April 28, 2024 6:40 pm
    Woman

    Woman

    Follow us on

    Woman: తన పేరు రమ్య (పేరు మార్చాం). ఆమెకు నలుగురు అన్నాదమ్ముళ్లు, ఒక సోదరి. వయసు 35. లావుగా ఉండటం వల్ల ఆమెకు ఆ ఈడు వచ్చేవరకు కూడా పెళ్లి కాలేదు. బరువు తగ్గేందుకు ఎన్నో ప్రయత్నాలు చేసింది. చివరికి ఎంతో కొంత విజయం సాధించింది. అయినప్పటికీ ఆమె బొద్దుగానే ఉంది. తోబుట్టువులు అందరూ పెళ్లిళ్లు చేసుకున్నారు. వారికి కుటుంబాలు కూడా ఏర్పడ్డాయి. రమ్య లావుగా ఉండటంతో ఆమెకు పెళ్లి సంబంధాలు పెద్దగా వచ్చేవి కావు. వచ్చినా కూడా అబ్బాయిలు ఏదో ఒక వంక పెట్టి వెళ్ళిపోయేవారు. ఇలా సంబంధాలు వచ్చినట్టే వచ్చి, వెళ్ళిపోతుండడంతో రమ్య దిగులుగా ఉండేది. ఆమె హృదయం ప్రేమను కోరుకునేది. వయసు కోరికలతో జ్వలించిపోయేది. ఆమె బొద్దుగా ఉండటంతో.. కుటుంబ సభ్యులు ఒకరకంగా చూసేవారు. ఫలితంగా ఆమె చుట్టూ ఒక ఒంటరితనం ఉండేది. “లావుగా పుట్టడం నా తప్పా?, నాకెందుకు సంబంధాలు రావడం లేదు? నేనెప్పటికీ ఇలా ఒంటరిగా ఉండాల్సిందేనా?, నా తోబొట్టువులు కుటుంబాలు ఏర్పరచుకున్నారు. నాకు లైంగిక అనుభూతి కల్లేనా?” ఇలాంటి ప్రశ్నలతో నిత్యం రమ్య మదనపడేది.

    ఇలా చాలా రోజుల తర్వాత రమ్యకు ఒక సంబంధం వచ్చింది. 40 సంవత్సరాల వయసు ఉన్న వ్యక్తి ఆమెను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడు. దీంతో రమ్య ఒక్కసారిగా ఊపిరి పీల్చుకుంది. హమ్మయ్య నాకు కూడా పెళ్లవుతున్నదని ఎగిరి గంతేసింది. కుటుంబ సభ్యులు వాళ్ళిద్దరి ఎంగేజ్మెంట్ ను ఘనంగా జరిపారు. అది పూర్తయిన తర్వాత రమ్య తనకు కాబోయే భర్తతో మాట్లాడాలని దగ్గరికి వెళ్ళింది. ఇద్దరు మాత్రమే ఉండడంతో ముద్దు పెట్టాలని ట్రై చేసింది. కానీ, అతడు ఆమెను దూరంగా నెట్టేశాడు. అయితే ఆమె ఒక్కసారిగా కంగారు పడింది. ఆ తర్వాత తేరుకుని, అతడికి సిగ్గు ఎక్కువ అని భావించి తనకు తానే సర్ది చెప్పుకుంది. తొందరపడినందుకు అతడికి సారి కూడా చెప్పింది. ఇంత జరుగుతున్నప్పటికీ అతడి కేవలం నేల వైపు మాత్రమే చూశాడు. ఆ తర్వాత ఆమె ఫోన్లో మాట్లాడినా అతడు అంతగా రెస్పాండ్ కాకపోయేవాడు. ఇవన్నీ రమ్యకు ఇబ్బందిగానే ఉండేవి. కానీ తన లావు శరీరం గుర్తుకొచ్చి వీటన్నింటినీ భరించేది. ఇలా కొంతకాలానికి రమ్యకు, అతడికి పెళ్లయింది. పెళ్లి తర్వాత వ్రతాలు, ఇతర కార్యక్రమాలు ముగిశాయి. ఒక మంచి ముహూర్తం చూసి రమ్య, అతని భర్తకు తొలిరాత్రి జరిపేందుకు ఆమె తల్లిదండ్రులు ఏర్పాట్లు చేశారు. ఆరోజు రాత్రి తెల్లటి వస్త్రాలు ధరించి, తల నిండా మల్లెపూలు పెట్టుకుని, చేతిలో పాల గ్లాస్ తో ఆ గదిలోకి వెళ్ళింది. గది మొత్తం పూల సువాసనతో అదిరిపోతోంది. రమ్య మదిలో ఎన్నో ఆలోచనలు.. కట్టుకున్నవాడు దగ్గరకు తీసుకుంటే.. అతని కౌగిలిలో బంధీ కావాలని, అతడు శరీరాన్ని పంచుకోవాలని.. ఇలా రకరకాల కోరికలతో ఆమె శరీరం, ఆమె మనసు విహరిస్తున్నాయి. ఆమె పాల గ్లాస్ తో అలా వెళ్ళిందో లేదో.. ఆమె భర్త మంచం మీద గాఢ నిద్రలో ఉండడాన్ని చూసి రమ్య షాక్ కు గురైంది. ఎంత లేపినా అతడు లేవకపోవడంతో.. ఆ రాత్రంతా ఏడుస్తూనే ఉండిపోయింది. మరుసటి రోజు తన భర్తను అదే విషయంపై అడిగితే.. అతడు తనకు ఆరోగ్యం బాగోలేదని సమాధానం చెప్పాడు. ఇలా అనేక రాత్రులు నిస్సారంగా గడిచిపోయాయి. ఈ విషయాన్ని రమ్య తన అత్తగారితో చెబితే.. ఆమె తన కుమారుడిని వెనకేసుకొచ్చింది. దీంతో రమ్య మనసు మరింత దిగాలు చెందింది.

    ఇలా ఆమె కలలు మొత్తం ఒక్కొక్కటిగా కాలగర్భంలో కలిసిపోవడం ప్రారంభమైంది. రమ్యను కనీసం ఆమె భర్త ముట్టుకునేవాడు కాదు. రాత్రుళ్లు మొత్తం ఆమె కవ్వించినా పెద్దగా చలించేవాడు కాదు. దీంతో ఆమెకు అనుమానం వచ్చి డాక్టర్ వద్దకు తీసుకెళ్ళింది. అయితే అతడు నపుంసకుడని వైద్యులు చెప్పారు. పెళ్లికి ముందే ఇదే విషయాన్ని డాక్టర్లు అతడి తల్లిదండ్రులకు చెప్పారని రమ్యకు తర్వాత తెలిసింది. కానీ, ఆ విషయం ఆమెకు చెప్పకుండా మోసం చేశారు. దీంతో రమ్య గుండెలు పగిలేలా ఏడ్చింది. అయినప్పటికీ అతడు కొంచెం కూడా చలించలేదు. రమ్య ఎదుట పశ్చాత్తాపం కూడా వ్యక్తం చేయలేదు.

    వాస్తవానికి మన సమాజంలో మహిళలు చిన్న తప్పు చేసినా భూతద్దంలో పెట్టి చూస్తారు. అదే పురుషుడి వైపు తప్పు ఉంటే మాత్రం చూసి చూడనట్టు వెళుతుంటారు. ఈ విషయాన్ని రమ్య తన తల్లిదండ్రులకు చెప్పడంతో.. కుటుంబం పరువు పోతుందని, బయటకు చెప్పకని వేడుకున్నారు. బంధువులేమో “జీవితంలో శృంగారం మాత్రమే ముఖ్యం కాదు.. అతడు దానికి పనికిరాడనుకున్నప్పుడు నువ్వు అనాధ పిల్లల్ని దత్తత తీసుకోవచ్చు కదా” అని ఉచిత సలహా ఇచ్చారు. రమ్య భర్త అయితే.. “నువ్వు ఎవరితో ఉన్నా నాకు ఇబ్బంది లేదు. నేను దానికి అడ్డు చెప్పను. ఒకవేళ పిల్లలు పుట్టినా నేను పెద్దగా పట్టించుకోను. వారికి నా ఇంటి పేరు పెట్టిన ఇబంది లేదని” అనడంతో ఆమె మనసు మరింత తీవ్రంగా కలత చెందింది. అంతే కాదు రమ్య కాళ్ల మీద పడి ఏడ్చాడు. విడాకులు ఇవ్వద్దని కోరాడు.

    ఇన్ని ఆలోచనల తర్వాత తన భర్త ఇంట్లో ఉండడం కరెక్ట్ కాదని, రమ్య బయటకు వచ్చింది. పుట్టింటికి వెళ్తే తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. చివరికి తన స్నేహితుల సహాయంతో ఒక హాస్టల్లో చేరింది. ఉద్యోగ జీవితం మొదలుపెట్టింది. కొద్దిరోజులు గడిచిన తర్వాత విడాకులకు దరఖాస్తు చేసుకుంది. అయితే ఇక్కడ ఆమె భర్త తరఫున వారు ఆమెకు వివాహేతర సంబంధం అంటగట్టారు. ఆమె భర్త రకరకాలుగా ప్రచారం చేశాడు. ఈ విషయం కోర్టుమెట్లకు ఎక్కింది. దీంతో రమ్య తన భర్తకు వైద్య పరీక్షలు చేయాలని కోరితే.. కోర్టు ఆదేశాలు జారీ చేసింది. చివరికి ఆమె కోర్టులో విజయం సాధించింది. మూడు సంవత్సరాల తర్వాత ఆమెకు విడాకులు మంజూరయ్యాయి. ఈ క్రమంలో సభ్య సమాజం లో చాలామంది మగాళ్లు ఆమెకు దగ్గర కావాలని ప్రయత్నించారు. కానీ ఆమెతో ఎవరు కూడా దీర్ఘకాలికంగా ఉండేందుకు ఒప్పుకోలేదు. ఇప్పటికీ రమ్య ఒంటరిగానే ఉంది. ఇప్పుడు ఆమె వయసు 40 సంవత్సరాలు. ఆమె వైవాహిక జీవితం గురించి, ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి ఎంతోమంది, ఎన్నో విధాలుగా తీర్పులిచ్చారు. కానీ ఆమె మనసును ఎవరూ అర్థం చేసుకోలేదు. ఇకపై అర్థం చేసుకోరు కూడా..

    (ఇటీవల దక్షిణాది రాష్ట్రంలో ఓ మహిళకు ఎదురైన అనుభవం ఇది. ఆమె వ్యక్తిగత గోప్యతను దృష్టిలో పెట్టుకొని.. అక్షరబద్ధం చేశాం. ఆమె పేరు కూడా మార్చాం)