Gas Cylinder Theft In Jhansi: అయిపోయింది.. ఇది కూడా జరిగిపోయింది.. మనదేశంలో టమాటాల ధరలు పెరిగినప్పుడు.. ఉల్లిపాయలకు ధరలు పెరిగినప్పుడు సహజంగా దొంగతనాలు జరుగుతుంటాయి. కానీ ఇప్పుడు టమాటాల చోరీ జరగడం లేదు. ఉల్లిగడ్డల విషయంలో ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ, ఘనత వహించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పుణ్యం వల్ల సరికొత్త దొంగతనాలు జరుగుతున్నాయి. అవి కూడా మనదేశంలోనే కావడం విశేషం..
Also Read: ట్రంప్ సీరియస్ యుద్ధంలో సీపీఐ నారాయణ కామెడీ
వినియోగదారులపరంగా ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్ మనది. ప్రపంచ దేశాలు మొత్తం వివిధ రకాల వస్తువులు సరఫరా చేస్తేనే మన డిమాండ్ తీరుతుంది. ఇక గ్యాస్ విషయంలో మనదేశంలో డిమాండ్ ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మన దేశానికి గల్ఫ్ దేశాలు వంట గ్యాస్ సరఫరా చేస్తుంటాయి. ఇందులో ఇరాన్ కూడా ఉంటుంది. ఈ గ్యాస్ మొత్తం హార్ముజ్ జల సంధి గుండా సాగుతుంది.
ఇప్పుడు మిడిల్ ఈస్ట్ లో యుద్ధం జరుగుతోంది. ఇరాన్ మీద అమెరికా, ఇజ్రాయిల్ దాడులు చేస్తున్నాయి. ఈ దాడుల వల్ల ప్రపంచానికి చమురు సరఫరా నిలిచిపోయింది. గ్యాస్ రవాణా కూడా ఆగిపోయింది. దీంతో ప్రపంచం మొత్తం ఇబ్బంది పడుతోంది. వినియోగదారులపరంగా అతిపెద్ద దేశమైన భారత్ లో గ్యాస్ సరఫరా లో అంతరాయం ఏర్పడుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పటికే అనేక రకాల చర్యలు తీసుకుంది. కమర్షియల్ హోటల్స్ కు గ్యాస్ సరఫరా నిలిపివేసింది. కేవలం హాస్పిటల్స్, అత్యవసరమైన విభాగాలకు మాత్రమే గ్యాస్ సర్ఫల చేస్తోంది. దీంతో చాలా వరకు హోటల్స్ మూతపడ్డాయి.
సప్లై తక్కువ ఉన్నప్పుడు డిమాండ్ అనేది పెరుగుతుంది. డిమాండ్ ఎక్కువైనప్పుడు రకరకాల పరిణామాలు చోటు చేసుకుంటాయి. కొంతమంది వ్యక్తులు డిమాండ్ పెరిగినప్పుడు తమకు అనుకూలంగా పరిస్థితిని మార్చుకోవడానికి ఎంతటి దుర్మార్గానికైనా తెగిస్తారు. అటువంటి సంఘటనే ఇది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఝాన్సీలో ఈ సంఘటన జరిగింది.
ఝాన్సీ ప్రాంతంలో 524 భారత్ గ్యాస్ కంపెనీకి సంబంధించిన సిలిండర్లతో ఒక ట్రక్ బయలుదేరింది. ఈ ట్రక్ డ్రైవర్ గా సిపిరి బజార్ ప్రాంతానికి చెందిన రాజ్ కుమార్ పనిచేస్తున్నాడు. సిలిండర్లతో కూడిన ట్రక్ ను నడుపుకుంటూ వెళ్తున్న రాజ్ కుమార్.. హోలీ పండుగ జరుపుకోవడానికి వెళ్లాడు. వెళ్తూ వెళ్తూ ట్రక్ ను భారత్ గ్యాస్ డిపో వెలుపల నిలిపివేశాడు. హోలీ పండుగ జరుపుకొని మరుసటి రోజు డిపో వద్దకు వచ్చేసరికి ట్రక్ కనిపించలేదు. దీంతో ఈ విషయాన్ని రాజకుమార్ ట్రక్ యజమాని నీరజ్ అగర్వాల్ కు సమాచారం అందించాడు. నీరజ్ అగర్వాల్, రాజ్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. వారు వివరాలు నమోదు చేశారు. ఆ తర్వాత దర్యాప్తు మొదలుపెట్టారు. గ్యాస్ సిలిండర్ల తో కూడిన ట్రక్ బర గావ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక దాబా వద్ద ఆగి ఉన్నట్టు గుర్తించారు. అందులో ఒక్క సిలిండర్ కూడా లేదని పోలీసుల విచారణలో తేలింది. దొంగలు ట్రక్కులో ఏర్పాటు చేసిన జిపిఎస్ పరికరాన్ని ధ్వంసం చేశారు. అయితే పోలీసులు అనేక బృందాలుగా ఏర్పడి ఈ కేసు దర్యాప్తు మొదలుపెట్టారు. బుధవారం ఉదయం 3 గంటల ప్రాంతంలో గ్వాలియర్ రోడ్డులోని గ్యాస్ గోదాం సమీపంలో దొంగలు మాటు వేసినట్టు పోలీసులు గుర్తించారు. వారే గ్యాస్ సిలిండర్లను దొంగతనం చేశారని పోలీసులు తమ దర్యాప్తులో గుర్తించారు. ఆ తర్వాత వారిని పట్టుకోవడానికి పోలీసులు అక్కడికి వెళ్ళగా.. దొంగలు కాల్పులు జరిపారు. దీంతో పోలీసు కూడా ఆత్మ రక్షణ నిమిత్తం కాల్పులు జరపాల్సి వచ్చింది.
ప్రేమనగర్ ప్రాంతానికి చెందిన జావేద్, సుమిత్, సమతారు ప్రాంతానికి చెందిన అమీర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని విచారించిన తర్వాత చెప్పిన వివరాల ప్రకారం సమతార్ ప్రాంతానికి చెందిన శుభంకర్, అభిషేక్, సురేంద్రను కూడా ఈ కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. వారు చెప్పిన వివరాల ఆధారంగా దొంగిలించిన సిలిండర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బహిరంగ మార్కెట్లో వీటి విలువ లక్షలలో ఉంటుందని తెలుస్తోంది. గ్యాస్ సిలిండర్ల దొంగతనం వెలుగులోకి వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో మీమ్స్ పేలుతున్నాయి. ఏమోయ్ ట్రంప్ చూస్తున్నావ్ కదా.. ఇదంతా నీ వల్లే కదా అని నెటిజన్లు అంటున్నారు.