ED : ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు జోరు చూపిస్తున్నారు. సోదాలు, అరెస్టులు, తనిఖీల పేరుతో అడ్డన్నదే లేకుండా ఆర్థిక నేరగాళ్లపై ఉక్కు పాదం మోపుతున్నారు. ఇటీవల ఢిల్లీ మద్యం కుంభకోణంలో భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేయడం ద్వారా సంచలనం సృష్టించిన ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు.. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను చెరసాలకు పంపి పెను ప్రకంపనలకు నాంది పలికారు. స్వతంత్ర భారత చరిత్రలోనే ఒక ముఖ్యమంత్రిని జైల్లో వేసిన ఘనతను ఎన్ఫోర్స్మెంట్ అధికారులు లిఖించారు.
పదేళ్లలో పెరిగింది
ఎన్ ఫోర్స్ మెంట్ అధికారుల జోరు గత పది సంవత్సరాల నుంచి పెరిగింది. సోదాలు, అరెస్టుల సంఖ్య తారాస్థాయికి చేరింది. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పోల్చి చూస్తే భారతీయ జనతా పార్టీ పరిపాలనలోనే దేశవ్యాప్తంగా 86 రెట్లు ఎక్కువగా ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు సోదాలు జరిపారు. అరెస్టులు కూడా 24 రేట్లు అధికంగా చోటుచేసుకున్నాయి. ఏప్రిల్ 2024 నుంచి మార్చి 2024 వరకు గణాంకాలను పరిశీలిస్తే.. మనీ లాండరింగ్ కేసులను కట్టడి చేసేందుకు తాము ఈ చర్యలు తీసుకున్నామని ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు వెల్లడించారు. ప్రతిపక్షాలు ఎన్ ఫోర్స్ మెంట్ అధికారుల పై విమర్శలు చేస్తున్నప్పటికీ.. వారు చట్టం ప్రకారం నడుచుకుంటున్నారని భారతీయ జనతా పార్టీ సమర్థిస్తోంది.
కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో 1, 797 కేసులను ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు నమోదు చేశారు.. భారతీయ జనతా పార్టీ పరిపాలనా కాలంలో ఆ సంఖ్య 5,155 కు చేరుకుంది. అంటే దాదాపు కేసుల నమోదులో మూడు రెట్ల వృద్ధి నమోదయింది.
సోదాల విషయంలో ఏకంగా 86 రెట్ల వృద్ధి నమోదయింది. 2014 నుంచి 24 మధ్యకాలంలో దేశవ్యాప్తంగా 7,264 సోదాలను ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు నిర్వహించారు. అంతకుముందు సోదాల సంఖ్య 84 మాత్రమే ఉండడం విశేషం.
2005లో ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ యాక్ట్ అమల్లోకి వచ్చినప్పటికీ.. 2014 నుంచి శిక్ష పడటం మొదలైంది. ఇప్పటివరకు 63 మంది దోషులుగా తేలారు.
నరేంద్ర మోడీ పరిపాలన కాలంలో 755 మందిని ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు అరెస్టు చేశారు. 1,21,618 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేశారు. యూపీఏ హయాంలో 29 అరెస్టులు జరిగాయి. జప్తు చేసిన ఆస్తుల మొత్తం 5,086.43 కోట్లు మాత్రమే. అంటే బిజెపి హయాంలో అరెస్టులు 26 రెట్లు, ఆస్తుల జప్తులు 24 రెట్లు పెరిగాయి.
ఇక స్థిర, చర ఆస్తుల జప్తునకు సంబంధించి 10 సంవత్సరాలలో 1971 ఉత్తర్వులను ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు జారీ చేశారు. యూపీఏ హయాంలో ఆ సంఖ్య కేవలం 311 గా ఉంది. గత పదేళ్లలో చార్జ్ షీట్ల సంఖ్య 12 రెట్లు పెరిగింది.. యూపీఏ హయాంలో 102 చార్జ్ షీట్లు మాత్రమే దాఖలయ్యాయి. బిజెపి హయాంలో ఏకంగా 1,281 చార్జ్ షీట్లు నమోదయ్యాయి.
ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ నేరాల కింద 15,710.96 కోట్ల విలువైన ఆస్తులు జప్తు చేసేందుకు న్యాయస్థానం నుంచి ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు అనుమతి పొందారు. మొత్తం జప్తు చేసిన ఆస్తుల్లో తిరిగి 16,404.19 కోట్ల ఆస్తులను ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు తిరిగి వెనక్కి ఇచ్చేశారు.
ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ యాక్ట్ కింద నగదును జప్తు చేసే అధికారం ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులకు ఉంది. 10 సంవత్సరాలలో 2,310 కోట్ల విలువైన భారత, విదేశీ కరెన్సీని ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ పరిపాలన కాలంలో కేవలం 43 లక్షలు మాత్రమే నగదు జప్తు చేశారు.
2014 నుంచి 24 మధ్యకాలంలో మన దేశాన్ని వదిలి వెళ్లిపోయిన నిందితులను పట్టుకునేందుకు ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు 24 ఇంటర్ పోల్ సంస్థ ద్వారా రెడ్ నోటీసులు జారీ చేశారు. 43 మంది నిందితులను అప్పగించాలని కోరుతూ వివిధ దేశాలకు లేఖలు రాశారు. అయితే ఇటువంటి చర్యలు కాంగ్రెస్ పార్టీ పరిపాలన సమయంలో తీసుకోలేదు.
ఆర్థిక నేరాలకు సంబంధించి అభియోగాలు ఎదుర్కొంటున్న నలుగురు నిందితులను మన దేశానికి రప్పించడంలో ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు విజయవంతమయ్యారు. విజయ్ మాల్యా, నీరవ్ మోడీ, సంజయ్ బండారి కి వ్యతిరేకంగా ఇలాంటి ఉత్తర్వులను సాధించడంలో ఎన్ ఫోర్స్ మెంట్ విభాగం విజయం సాధించింది.
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read More