Eluru District: మృత్యువు ఏ రూపంలో కబలిస్తుందో ఎవరికీ తెలియని రోజులు ఇవి. అటువంటి ఘటనే ఏలూరులో తాజాగా వెలుగులోకి వచ్చింది. దీపావళి పండుగ పూట విషాదం అలుముకుంది. ఓ వ్యక్తి బాణసంచా తీసుకెళ్తుండగా భారీ పేలుడు సంభవించింది. బైక్ పై తీసుకెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఆరుగురు వ్యక్తులు నిల్చున్నచోట బైక్ పై బాణసంచా పేలిపోయింది. ఈ ఘటనలో ఒక వ్యక్తి మృతి చెందారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఏలూరు తూర్పు వీధిలో సుధాకర్ అనే వ్యక్తి బైక్ పై ఉల్లిపాయ బాంబులు బస్తా పట్టుకెళ్తున్నాడు. గంగానమ్మ ఆలయ సమీపంలో వచ్చేసరికి రోడ్డుపై గుంత కారణంగా.. బైక్ పైనుంచి బస్తా కింద పడింది. దీంతో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో సుధాకర్ అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఆ ప్రాంతంలో భయానక వాతావరణం నెలకొంది. మృతదేహం తునాతునకలైంది. గాయపడిన వారిని ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్య సేవలు అందిస్తున్నారు. గాయపడిన వారిలో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.
*అమ్మకాలు ప్రారంభం
అయితే రాష్ట్రవ్యాప్తంగా దీపావళి బాణసంచా అమ్మకాలు నిన్నటి నుంచి ప్రారంభం అయ్యాయి.ఈ నేపథ్యంలో ఉల్లిపాయ బాంబులు తయారుచేసిన సుధాకర్ విక్రయించేందుకు తీసుకెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఈ ఘటనతో ఒక్కసారిగా ఏలూరులో సంచలనం రేగింది. స్థానికులు అయితే ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. సమీప నివాసితులు భయంతో పరుగులు పెట్టారు.
* స్పందించిన మంత్రి
కాగా ఈ ఘటనపై మంత్రి పార్థసారథి స్పందించారు. తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దీపావళి పండుగను ప్రజలు జాగ్రత్తగా జరుపుకోవాలని సూచించారు. బాణసంచా తరలింపులో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. పోలీసులు నిరంతరం నిఘా పెట్టాలని ఆదేశించారు. కాగా ఈ ఘటనతో పోలీస్ శాఖ సైతం అప్రమత్తం అయ్యింది. రాష్ట్రవ్యాప్తంగా నిఘా పెంచింది.