Love Marriage: ఏదో అనుకుంటే ఇంకేదో అయింది. చివరికి ఇతగాడి బతుకు జైలు పాలు అయింది. ఇతడికి సహాయం చేసిన స్నేహితుడి పరిస్థితి కూడా అలానే మారిపోయింది. ఇతడు చేసిన పని కేవలం ఆ రాష్ట్రంలోనే కాదు, దేశవ్యాప్తంగా సంచలనమైంది. సోషల్ మీడియాలో ఇతడి గురించి ఇప్పుడు విస్తృతంగా చర్చ నడుస్తుంది.
అది కేరళ రాష్ట్రం.. పతనం తిట్ట.. ఆ ప్రాంతంలో రంజిత్ రాజన్ అనే యువకుడు ఉన్నాడు. ఇతడు ఒక అమ్మాయిని ప్రేమించాడు. ఆమె కూడా ఇతడిని ప్రేమించింది. ఇద్దరి పెళ్ళికి అమ్మాయి కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదు. దీంతో అమ్మాయి తరఫున కుటుంబ సభ్యుల ముందు మంచివాడినని నిరూపించుకోవాలని భావించాడు. దీనికోసం ఒక ప్రణాళిక రూపొందించాడు. అయితే అతడు రూపొందించిన ప్రణాళిక కొంతవరకు విజయవంతమైంది. కానీ ఆ తర్వాత అసలు కథ తెలియడంతో రాజన్ జైలు పాలు కావలసి వచ్చింది.
తన ప్రియురాలు కుటుంబ సభ్యుల ముందు మంచివాడిని అనిపించుకోవాలని రాజన్ ఒక ప్రణాళిక రూపొందించాడు. గత ఏడాది డిసెంబర్ 23న రాజన్ ప్రియురాలు కోచింగ్ సెంటర్ నుంచి స్కూటీ మీద ఇంటికి వెళ్తుంది. ఈ సమయంలో వాజముట్టం తూర్పు ప్రాంతంలో ఏజెస్ అనే యువకుడు కారుతో ఆమెను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో రాజను ప్రియురాలు గాయపడింది. ఆమె చేయి, కాలు విరిగింది. ఆ సమయంలో వెనుక కారులో వచ్చిన రాజన్ ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లాడు. ఆ యువతి తల్లిదండ్రుల ముందు మంచివాడిని అనిపించుకున్నాడు. ఆమెను పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో దానికి వారు కూడా ఒప్పుకున్నారు. అయితే ఆ యువతి జరిగిన ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. పోలీసులు సిసి కెమెరాలలో దృశ్యాలను పరిశీలించారు. కారు నెంబర్ ఆధారంగా వివరాలు సేకరించి ఏజస్ ను అరెస్ట్ చేశారు. కేసులో నిజాలు తేల్చడానికి అతడిని విచారించగా.. అసలు విషయాలు వెలుగు చూశాయి.
రాజన్, తాను స్నేహితులమని.. అతడు చెబితేనే కారుతో ఆమెను ఢీకొట్టానని.. ఇందులో తన తప్పు ఏమీలేదని అతడు పోలీసులు ఎదుట చెప్పాడు. దీంతో పోలీసులు రాజన్ ను అరెస్ట్ చేశారు. ఈ విషయం తెలిసిన ఆ యువతి రాజన్ మోసాన్ని చూసి తట్టుకోలేకపోయింది.. అతనితో ప్రేమను పెటాకులు చేసుకుంది. ప్రియురాలి కుటుంబ సభ్యుల ముందు మంచి వాటిని అనిపించుకోవాలని రాజన్ చేసిన ప్రయత్నం చివరికి ఇలా ముగిసిపోయింది.