America Attacked Russian Ship: రష్యా–ఉక్రెయిన్ వార్ మూడేళ్లుగా సాగుతోంది. ఉక్రెయిన్‌కు అమెరికాతోపాటు నాటో దేశాలు ఆర్థిక, ఆయుధ సహకారం అందిస్తున్నారు. రష్యాను దెబ్బతీసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే రష్యా ఎక్కడా వెనక్కు తగ్గడం లేదు. ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతున్నా.. యుద్ధం కొనసాగిస్తోంది. ఈ క్రమంలో అమెరికా తాజాగా వెనుజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురో, ఆయన భార్యను ఇంట్లోనే అదుపులోకి తీసుకుని అమెరికా తరలించారు. తాజాగా అమెరికా చర్యలు ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంలో ఉద్రిక్తతలకు దారితీశాయి. రష్యా జెండాతో ప్రయాణిస్తున్న వెనెజువెలా చమురు ట్యాంకర్ ’మ్యారినెరా’(గతంలో బెల్లా–1)తోపాటు జెండా లేని ’సోఫియా’ నౌకలను బుధవారం స్వాధీనం చేసుకుంది. ఐస్‌లాండ్ దక్షిణ తీరానికి 190 మైళ్ల దూరంలో జరిగిన ఈ ఆపరేషన్‌కు అమెరికా దక్షిణ, యూరోపియన్ కమాండ్‌లు నడిపాయి. హెలికాప్టర్ల నుంచి మెరీన్ సైనికులు దిగి సిబ్బందిని అదుపులోకి తీసుకుని, నౌకలను దక్షిణ దిశలో మళ్లించారు. యుద్ధవిమానాలు, జలాంతర్గామి వేటాడే విమానాలు, ఇంధన సరఫరా విమానాలు ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నాయి.
2024లోనే అమెరికా ఆంక్షలు..
ఈ నౌకలపై 2024లోనే అమెరికా ఆంక్షలు విధించింది. ఇవి ఇరాన్ మద్దతున్న హెజ్‌బుల్లాకు ఆయుధాలు, రష్యా–ఇరాన్–వెనెజువెలా నుంచి ఆసియా దేశాలకు చమురు సరఫరా చేస్తున్నాయని అమెరికా ఆరోపిస్తోంది. మ్యారినెరా మొదట గుయానా జెండాతో కరీబియన్ వైపు వెళ్తుండగా, ఆకస్మికంగా ఉత్తరం తిరిగి ఐరోపా దిశగా మారింది. తర్వాత రష్యా జెండా అమర్చి రక్షణగా జలాంతర్గాములు, నౌకలు పంపారు. అయినా అమెరికా డిసెంబరు నుంచి సన్నాహాలు చేసి విజయవంతమయ్యింది.
రష్యా ఆగ్రహం..
రష్యా విదేశాంగ, రవాణా శాఖలు ఘాటుగా స్పందించాయి. అంతర్జాతీయ సముద్ర చట్టం (్ఖNఇఔౖ 1982) ప్రకారం, మరో దేశ నౌకను స్వాధీనం చేసే హక్కు ఎవరికీ లేదని వాదించాయి. నౌకలు అంతర్జాతీయ జలాల్లో చట్టాల ప్రకారం ప్రయాణిస్తున్నాయని, సిబ్బంది హక్కులు కాపాడాలని డిమాండ్ చేశాయి. రక్షణ దళాలు సమీపంలో ఉన్నప్పటికీ, అమెరికా చర్య విజయవంతమైంది.
ఆపరేషన్‌కు బ్రిటన్ సహకారం..
అమెరికా నిర్వహించిన ఆపరేషన్‌కు బ్రిటన్ పూర్తి సహకారం అందించింది. యూకే సైనిక దళాలు ముందస్తు ప్రణాళిక, నిఘా, ఇంధన సరఫరా అందించాయి. ఐస్‌లాండ్–గ్రీన్‌లాండ్ మధ్య టైడ్‌ఫోర్స్ ట్యాంకర్, వైమానిక దళం పాల్గొన్నాయి. రక్షణ మంత్రి జాన్ హీలీ ఆంక్షల అమలుకు ఇది ముఖ్యమైన దశ అని పేర్కొన్నారు.
ఈ సంఘటన ఆంక్షల అమలు, భౌగోళిక రాజకీయాల్లో కొత్త మలుపుగా నిపుణులు భావిస్తున్నారు. రష్యా–అమెరికా మధ్య ఉద్రిక్తతలు తీవ్రమవుతున్నాయి, భవిష్యత్ యుద్ధం మొదలయ్యే ప్రమాదం కూడా ఉందని అంచనా వేస్తున్నారు.