
చైనా దేశంలోని వుహాన్ లో పుట్టిన కరోనా మహమ్మారి ఆ దేశంతో పాటు ప్రపంచ దేశాల ప్రజలను గజగజా వణికిస్తోంది. చైనాలో ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టినా వైరస్ మళ్లీ విజృంభించే అవకాశాలు ఐతే ఉన్నాయి. మరోవైపు కరోనాను కట్టడి చేసే వ్యాక్సిన్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందనే విషయాన్ని ఎవరూ ఖచ్చితంగా చెప్పలేకపోతున్నారు. సమర్థవంతమైన వ్యాక్సిన్ అందుబాటులోకి రావాలంటే మరికొంతకాలం వేచి ఉండక తప్పదు.
ఇలాంటి సమయంలో కరోనా వైరస్ శాస్త్రవేత్తలకు కొత్త సవాల్ విసురుతోంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఒకే వ్యక్తికి మూడుసార్లు కరోనా నిర్ధారణ అయింది. ప్రజల్లో కరోనా వైరస్ గురించి భయం తగ్గుతున్న తరుణంలో ఒకే వ్యక్తికి మూడుసార్లు కరోనా సోకిందనే వార్త అటు శాస్త్రవేత్తలను, ఇటు ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేస్తోంది. ఒకే వ్యక్తికి రెండుసార్లు, మూడుసార్లు కరోనా సోకితే వైరస్ కట్టడి చేయడానికి మరిన్ని కొత్త సమస్యలు ఎదురవుతాయి.
కేరళలోని త్రిస్సూర్ ప్రాంతానికి చెందిన సావియో జోసఫ్ అనే 38 సంవత్సరాల వ్యక్తి కరోనా వైరస్ వల్ల పడుతున్న ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. ఇప్పటికే అతను మూడుసార్లు కరోనా బారిన పడి వైరస్ నుంచి కోలుకున్నాడు. ఒకే వ్యక్తికి మూడుసార్లు వైరస్ నిర్ధారణ కావడం తో వైద్యులు, శాస్త్రవేత్తలు అతని జన్యువులపై పరిశోధనలు చేస్తున్నారు. అతని కేసును ప్రత్యేక కేసుగా నమోదు చేసుకున్నారు.
ఢిల్లీకి చెందిన శాస్త్రవేత్తలు అతని జన్యువులపై పూర్తిస్థాయిలో పరిశోధనలు చేసి వైరస్ సోకడానికి గల కారణాలను విశ్లేషించే పనిలో పడ్డారు. మరోవైపు కరోనా బారిన పడిన వ్యక్తి మాత్రం తనకు మళ్లీ వైరస్ సోకుతుందని భయపడుతున్నాడు. తాను కరోనా నుంచి కోలుకున్న తరువాత అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా వైరస్ బారిన పడుతున్నానని తెలిపాడు.