దేశంలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియ శరవేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ గురించి ప్రజల్లో అనేక సందేహాలు నెలకొన్నాయి. టీకా కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ, వ్యాక్సిన్ల కొరత, వ్యాక్సిన్లను రాష్ట్రాలకు సరఫరా చేయడం వంటి కీలక అంశాలకు సంబంధించి కొన్ని అపోహలు ప్రచారంలోకి వస్తున్నాయి. ఏపీ కోవిడ్-19 స్టేట్ నోడల్ ఆఫీసర్ డాక్టర్ అర్జా శ్రీకాంత్ కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియకు సంబంధించి ప్రజల్లో నెలకొన్న సందేహాలకు వివరణ ఇచ్చారు.
కరోనా వ్యాక్సిన్ తీసుకోవడానికి ఎలాంటి ముందస్తు రిజిస్ట్రేషన్ అవసరం లేదని 18 సంవత్సరాల కంటే వయస్సు పైబడిన వాళ్లు దగ్గర్లో ఉన్న వ్యాక్సినేషన్ సెంటర్లకు వెళ్లి వ్యాక్సిన్ వేయించుకోవచ్చని అధికారులు చెబుతున్నారు. అధికారులు టీకాల లభ్యతను బట్టి రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసి వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియలు అనేక రకాలుగా ఉండగా కోవిన్, హెల్త్ వర్కర్లు, ఆశా వర్కర్లు రిజిస్ట్రేషన్ చేసి వ్యాక్సిన్ ఇస్తారు.
కొవిన్ పోర్టల్ లో మొత్తం 69,995 వ్యాక్సిన్ సెంటర్లు ఉండగా 71 శాతం వ్యాక్సినేషన్ సెంటర్లు గ్రామాల్లోనే ఉన్నాయని పట్టణ ప్రాంతాల కంటే గ్రామీణ ప్రాంతాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ నిదానంగా జరగడం లేదని నోడల్ ఆఫీసర్ శ్రీకాంత్ అర్జా తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో వ్యాక్సినేషన్ తక్కువ స్థాయిలో జరుగుతోందని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని నేరుగా టీకా కేంద్రానికే వచ్చి టీకా వేయించుకున్నవారిలో మిగతావారి కంటే సగటున గిరిజనులే ఎక్కువగా ఉన్నారని శ్రీకాంత్ వెల్లడించారు.
టీకాలు వేసిన తరువాత కరోనా రోగుల మరణాల సంఖ్య పెరిగిందన్న ప్రచారంలో నిజం లేదని వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత మరణం సంభవిస్తే అధి వ్యాక్సిన్ నేషన్ వల్ల జరిగిందని చెప్పలేమని శ్రీకాంత్ తెలిపారు. దేశవ్యాప్తంగా 23.5 కోట్ల డోసుల వ్యాక్సినేషన్ చేయడం జరగగా 0.0002 శాతం మాత్రమే మరణాలు ఉన్నట్టు గుర్తించామని శ్రీకాంత్ వెల్లడించారు.