మన దేశంలో సెకండ్ వేవ్ లో ఫస్ట్ వేవ్ ను మించి కరోనా కొత్త కేసులు నమోదవుతున్నాయి. రోజుకు మూడు లక్షలకు పైగా కొత్త కేసులు నమోదవుతూ ఉండగా 2,000 కంటే ఎక్కువ సంఖ్యలో కరోనా మరణాలు నమోదవుతున్నాయి. మాస్క్ ధరిస్తూ, భౌతిక దూరం పాటిస్తూ జాగ్రత్తలు తీసుకుంటే వైరస్ సోకకుండా మనల్ని మనం రక్షించుకునే అవకాశాలు ఉంటాయి. రోజురోజుకు కేసుల సంఖ్య పెరగడమే తప్ప తగ్గడం లేదు.
దేశంలోని కొన్ని ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో నమోదవుతున్న కేసుల వల్ల లాక్‌డౌన్, నైట్ కర్ఫ్యూ అమలవుతోంది. కొన్ని రాష్ట్రాల్లో కఠిన ఆంక్షలు అమలవుతుంటే మరికొన్ని రాష్ట్రాలు లాక్ డౌన్ దిశగా అడుగులు వేస్తున్నాయి. మరోవైపు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు, ఉచిత సలహాలు ప్రచారంలోకి వస్తున్నాయి. కొన్ని ఆహార పదార్థాలను తీసుకోవడం ద్వారా కరోనా తగ్గుతుందని ప్రచారం జరుగుతోంది.
పచ్చి ఉల్లిపాయను కల్లు ఉప్పు ద్వారా తింటే కరోనాకు చెక్ పెట్టవచ్చని ప్రస్తుతం సోషల్ మీడియా గ్రూపులలో ఒక వార్త తెగ వైరల్ అవుతోంది. అయితే వైరల్ అవుతున్న ఈ వార్తలో నిజం లేదు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలను నిజమేనని నమ్మి చాలామంది కరోనా సోకినా సొంత వైద్యం చేసుకుంటున్నారు. నిపుణులు చేసిన దర్యాప్తులో కల్లు ఉప్పు, పచ్చి ఉల్లిపాయ తినడం ద్వారా కరోనా అంతం కాదని వెల్లడైంది.
ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, వర్ల్ హెల్త్ ఆర్గనైజేషన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలో ఎలాంటి నిజం లేదని పేర్కొంది. ప్రజలు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని నమ్మవద్దని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు.