
‘లేడి సూపర్ స్టార్’ అనే ఈ ట్యాగ్ లైన్ ను ఈ మధ్య ఎవరికీ పడితే వారికి ఇచ్చేస్తున్నారు గానీ, ఒకప్పుడు.. అంటే, ఒక ఇరవై – ముప్పై ఏళ్ల క్రితం.. ఆ రోజుల్లో అసలు ఒక హీరోయిన్ కు స్టార్ డమ్ ఉంది అని ఒప్పుకోవడానికే, అప్పటి హీరోలకు మరియు దర్సకనిర్మాతలకు అహం అడ్డు వచ్చేది. అందుకే, ఏ ఇండస్ట్రీలోనూ ఒక హీరోయిన్ గా ఉంటూ.. హీరో రేంజ్ ఇమేజ్ ను సంపాదించలేదు. ఒకే ఒక్క హీరోయిన్ తప్ప. ఆ హీరోయినే విజయశాంతి.
లేడీ అమితాబ్ గా టాలీవుడ్ లో ఇమేజ్ తెచ్చుకున్న విజయశాంతి అంటేనే అప్పట్లో విపరీతమైన క్రేజ్ ఉండేది. ఓ దశలో చిరు, బాలయ్యల కంటే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంది అంటేనే.. విజయశాంతి స్టార్ డమ్ ఏ స్థాయిలో సాగిందో అర్ధం చేసుకోవచ్చు. ఇక చాలా గ్యాప్ తరువాత మహేష్ సినిమాతో సినిమాల్లోకి మళ్ళీ రీఎంట్రీ ఇచ్చింది ఈ లేడీ సూపర్ స్టార్. దాదాపు 13 ఏళ్ల తరువాత సరిలేరు నీకెవ్వరూ సినిమాలో విజయశాంతిని చూసిన అభిమానులు షాక్ అయ్యారు. వయసు అయిపోయినా.. ఇంకా ఆమెలో అదే అందం, అదే బిగువు కనిపించడం నిజంగా విశేషమే.
అందుకే ఇండస్ట్రీలోని మేకర్స్ లో చాలామంది ఆమె కోసం ఒక ప్రత్యేకమైన పవర్ ఫుల్ క్యారెక్టర్స్ ను రాస్తున్నారు. ఈ క్రమంలో విజయశాంతి మరో సినిమాకి ఓకే చెప్పినట్టు వార్తలు వస్తున్నాయి. పైగా అది ఎన్టీఆర్ సినిమాలో. త్రివిక్రమ్ డైరెక్షన్ లో వస్తోన్న సినిమాలో ఎన్టీఆర్ కి అత్త పాత్రలో విజయశాంతి నటిస్తోందట. ఎంతైనా త్రివిక్రమ్ సినిమా అంటేనే భారీ తనం ఉంటుంది.
పైగా వరుసగా ఆరు సినిమాలతో ఫుల్ సక్సెస్ లో ఉన్న ఎన్టీఆర్ తో సినిమా అంటే, ఇక ఏ రేంజ్ లో ఉండాలి. అందుకే, ‘అయినను పోయి రావలె హస్తినకు’ అంటూ త్రివిక్రమ్ మొత్తానికి విజయశాంతిని ఒప్పించాడట. మరి ఎన్టీఆర్ తో విజయశాంతి నటన అంటే.. ఈ కలయిక పై అందరిలో బాగా ఆసక్తి నెలకొంది.