
తెలుగు సినీ పరిశ్రమలో ప్రస్తుతం బాగా డిమాండ్ ఉన్న పోస్ట్ ‘మాటల రచయిత’. గతంలో అనేకమంది మాటల రచయితలు ఉండేవాళ్ళు. ఇప్పుడు మాత్రం నలుగురు ఐదుగురు తప్ప పెద్దగా ఎవరూ కనిపించడం లేదు. వనమాలి లాంటి గీత రచయితను కూడా మాటల రచయితగా మార్చేశారు అంటేనే అర్ధం చేసుకోవచ్చు. వెయ్యికి పైగా పాటలు రాసిన వనమాలికి ఇప్పుడు మాటలు రాయమని అవకాశాలు వస్తున్నాయి. పైగా ఆయన మొదటిసారి కలం పట్టి మాటలు రాసిన ‘అరణ్య’ సినిమా ప్లాప్ అని తేలిన తరువాత కూడా, ఆయనకు ఇంకా అవకాశాలు వస్తున్నాయి అంటే.. ప్రస్తుతం తెలుగు సినిమాకి మాటలు ఎంత అవసరమో అర్ధం అవుతుంది.
మొత్తానికి వనమాలికి కొత్త బాధ్యతల్ని భుజాన వేస్తున్నారు. అయితే తన మాటల ప్రయాణం ఎలా మొదలైందో వనమాలి చెబుతూ ‘నేనింత వరకూ పాటలే రాశాను. ఏ చిత్రానికీ మాటలు రాయలేదు. ఆశ్చర్యంగా ‘అరణ్య’ మాటల కోసమే నన్ను సంప్రదించడం నాకు మొదట షాక్ కి గురి చేసింది. పైగా నన్ను మాటలు రాయమంటూ అరణ్య చిత్ర దర్శకుడు ప్రభు సాల్మన్ చెన్నై నుంచి వచ్చి మరి నాతో మాట్లాడి నన్ను మాటలు రాయమన్నారు. అయితే నిజానికి ఈ ఛాన్స్ రావడం వెనుక నాకు తమిళం తెలియడం అనే అంశం ఉందని నేను భావిస్తున్నాను.
అయినప్పటికీ నాకు అవకాశం అంత ఈజీగా రాలేదు. ముందు నాకు రెండు సన్నివేశాలిచ్చారు. వాటికి మాటలు రాసి పంపించాక, ఆ డైలాగ్స్ దర్శకుడికి నచ్చాక, నన్ను మాటల రచయితగా అంగీకరించారు. అయితే ఇన్నాళ్లూ సినిమాల్లోని మాటలను నేను పెద్దగా పట్టించుకునేవాడిని కాను, కానీ ఒక సినిమాకి మాటలు రాయడంలో ఉన్న కష్టం ఏమిటో నాకు ఈ మధ్యే తెలిసొచ్చింది. అందుకే ఇక నుండి నా నుండి సినిమా మాటలను తరుచూ వింటారు, ప్రస్తుతం మరో రెండు సినిమాలకు మాటలు రాస్తున్నా’ అంటూ వనమాలి చెప్పుకొచ్చాడు. మొత్తానికి తెలుగు సినిమాల్లో మాటల రచయిత ఎంత కొరత ఉందో వనమాలి వెనుక జరిగిన కథ వింటే అర్ధం అవుతుంది.