ఇంగ్లండ్ తో ఫైనల్ కు టీమిండియా రెడీ అవుతోంది. తొలి మ్యాచ్ గెలిచి.. రెండో మ్యాచ్ లో ఓడిన ఇండియా ఇప్పుడు కీలకమైన మూడో మ్యాచ్ ఫైనల్ కు సిద్ధమవుతోంది. ఈ మ్యాచ్ తో ఇంగ్లండ్ తో సిరీస్ ఇక పరిసమాప్తమవుతుంది.
టెస్టుల్లో కొట్టేసి.. టీ20లో చిత్తుచేసి వన్డేల్లో కూడా గెలిచి వైట్ వాష్ చేయాలని ఇండియా భావిస్తుండగా.. రెండో వన్డేలో భీకరంగా రెచ్చిపోయిన ఇంగ్లండ్ జట్టు ఈసారి వదలకూడదని పట్టుదలగా ఉంది. ఎలాగైనా సరే రెండు జట్లు చివరి మ్యాచ్ లో గెలిచి సిరీస్ గెలవాలని ఆశిస్తున్నాయి.
గత రెండో మ్యాచ్ లో బౌలింగ్ విభాగంలో భారత్ తేలిపోయింది. దీంతో ఈసారి భారీ మార్పులు ఖాయంగా కనిపిస్తున్నాయి. తన ప్రణాళికల్లో మార్పులు చేయాలనుకుంటోంది. బౌలింగ్ లో రవీంద్ర జడేజా లేని లోటు స్పష్టమైంది. స్పిన్నర్లు కుల్ దీప్, కృణాల్ లు భారీగా పరుగులు ఇచ్చారు. ఏకంగా 20 సిక్స్ లు కొట్టారు. కుల్ దీప్ ను ఉతికి ఆరేశారు. చివరి మ్యాచ్ లో వీళ్లిద్దరి స్థానంలో చాహల్, సుందర్ లను తీసుకునే అవకాశం కనిపిస్తోంది.
ఇక చివర్లో రెచ్చిపోతున్న భారత్ మొదటి నుంచి పరుగుల మోత మోగించాల్సి ఉంది. ఇంగ్లండ్ అదే పని చేసి ఈజీగా గెలిచింది. కోహ్లీ భారీ ఇన్నింగ్స్ ఆడాల్సి ఉంది. ఈ మ్యాచ్ లో నటరాజన్ ను ఆడించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
ఇక ఇంగ్లండ్ జట్టు భారీ లక్ష్యాన్ని ఛేదించి ఫుల్ జోష్ తో ఉంది. స్టోక్స్ ఫామ్ లోకి రావడం ఆ జట్టుకు బలాన్ని ఇచ్చింది. మార్క్ వుడ్ ఫిట్ నెస్ సాధిస్తే టామ్ కరన్ స్థానంలో జట్టులోకి రావచ్చు.
మొత్తంగా ఈ 1.30కు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చివరి ఫైట్ ఎవరిది అవుతుందనేది ఆసక్తి రేపుతోంది.