అందరూ జీవించేస్తున్నారు, ఒక్క ఎన్టీఆర్ తప్ప !

తెలుగు చిత్రసీమలో ధ్రువతారలా నిలిచిపోయే ఏకైక సినిమా ‘మాయాబజార్’. అయితే ఈ సినిమా రూపకల్పన వెనుక అనేక ఆసక్తికర సంఘటనలు చోటు చేసుకున్నాయి. విజయావారు మాయాబజార్ కోసం మొదట అనుకున్న కృష్ణుడు ఎన్టీఆర్ కాదు, ‘సిఎస్ఆర్’. కానీ, ‘సిఎస్ఆర్’ను శకునిగా అనుకుని, కృష్ణుడుగా ఎన్టీఆర్ ను అనుకున్నారు దర్శకుడు కె.వి.రెడ్డి. అయితే, కృష్ణుడు వేషం నేను కట్టేది లేదంటూ ఎన్టీఆర్ భీష్మించుకుని కూర్చున్నాడు. ఎందరు ఎన్ని చెప్పినా ఎన్టీఆర్ మాత్రం వినడం లేదు. కారణం అంతకు ముందు […]

Written By: admin, Updated On : May 1, 2021 6:58 pm
Follow us on

తెలుగు చిత్రసీమలో ధ్రువతారలా నిలిచిపోయే ఏకైక సినిమా ‘మాయాబజార్’. అయితే ఈ సినిమా రూపకల్పన వెనుక అనేక ఆసక్తికర సంఘటనలు చోటు చేసుకున్నాయి. విజయావారు మాయాబజార్ కోసం మొదట అనుకున్న కృష్ణుడు ఎన్టీఆర్ కాదు, ‘సిఎస్ఆర్’. కానీ, ‘సిఎస్ఆర్’ను శకునిగా అనుకుని, కృష్ణుడుగా ఎన్టీఆర్ ను అనుకున్నారు దర్శకుడు కె.వి.రెడ్డి.

అయితే, కృష్ణుడు వేషం నేను కట్టేది లేదంటూ ఎన్టీఆర్ భీష్మించుకుని కూర్చున్నాడు. ఎందరు ఎన్ని చెప్పినా ఎన్టీఆర్ మాత్రం వినడం లేదు. కారణం అంతకు ముందు ఎన్టీఆర్ ‘సొంతవూరు’ అనే చిత్రంలో కృష్ణుడు వేషం వేస్తే.. అది నచ్చక ప్రేక్షకులు ఏకంగా తెరలు చింపి పడేశారు. అందుకే ఈ దేవుడు వేషాలు మనకెందుకొచ్చిన గొడవ అనుకుని, ఎన్టీఆర్ కృష్ణుడు వేషానికి దూరంగా ఉందామనుకుని నిర్ణయించేసుకున్నారు.

ఈ విషయం కె.వి.రెడ్డికి అర్ధమైంది. కట్ చేస్తే.. ఎన్టీఆర్ ను తన ఇంటికి పిలిపించుకుని.. ‘రామారావ్ నీకు తెలియడం లేదు. ఆ చక్రపాణి నీకు కృష్ణుడు వేషం ఇవ్వొద్దు అంటూ గొడవ పడుతున్నాడు. నేనే పట్టుబట్టి నీతో ఆ వేషం వేయించాలి అనుకుంటున్నాను. ఎందుకో తెలుసా ? నీ కళ్ళల్లో నాకు కృష్ణుడు కనిపించాడు. నువ్వు ఆందోళన పడకు, నీ భయం నాకు అర్ధమైంది. అందుకే నీ గెటప్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాము’ అంటూ ఎన్టీఆర్ ను ఒప్పించారు కె.వి రెడ్డి.

మళ్ళీ కట్ చేస్తే.. సినిమా మొదలైపోయింది. మహామహా నటులందరూ తమ పాత్రల్లో జీవించేస్తున్నారు, ఒక్క ఎన్టీఆర్ తప్ప. డైలాగులు చెప్తూ చేతులు విసిరే అలవాటున్న ఎన్టీఆర్ చాల ఇబ్బందిగా నటిస్తున్నాడు. ఎన్ని సార్లు చెప్పినా చేతులు ఊపుతూనే డైలాగ్స్ చెబుతున్నాడు. దీంతో పింగళిగారు ‘ఇలా కాదుగానీ ఈ కృష్ణుడి చేతిలో కంటిన్యూగా వేణువు పెట్టేయండన్నారు. అదే చేశారు. చివరకూ అదోక స్టైల్ అయింది.

మరోపక్క కె.వి రెడ్డి మరో ఆలోచన చేశాడు. స్టూడియో సిబ్బందిని సమావేశపరచి, ఎన్టీఆర్ శ్రీ కృష్ణుడి గెటప్ లో రాగానే అందరూ దణ్ణం పెట్టండి అని చెప్పారు. ఎన్టీఆర్ శ్రీ కృష్ణుడిగా మేకప్ రూం నుంచీ రాగానే అందరూ దణ్ణం పెడుతూనే ఉన్నారు. దీంతో ఎన్టీఆర్ కూడా తాను నిజంగానే శ్రీ కృష్ణుడిలా ఉన్నాననుకున్నారు. వెండి తెర పై సినిమా చూసి, ఆబాలగోపాలం కూడా అదే అనుకున్నారు.