కరోనా మొదటి సీజన్లో పరిస్థితి వేరే. అన్నీ బంద్ చేయాలని ప్రభుత్వమే బలవంతంగా మూయించిన పరిస్థితి. సినిమా థియేటర్లు, షూటింగులు కూడా అంతే. ప్రభుత్వం లాక్ డౌన్ విధించే వరకూ నడిచాయి. కానీ.. ఇప్పుడు వేరే. ప్రభుత్వం ఆదేశించకుండానే థియేటర్లు బంద్ చేశారు. షూటింగుల పరిస్థితి కూడా అంతే. సర్కారు నిర్ణయాలేవీ లేకుండానే.. రాకుండనే ప్యాకప్ చెప్పేస్తున్నాయి.
తెలుగు సినిమా ఇండస్ట్రీలో సెకండ్ వేవ్ కారణంగా ఆగిపోయిన మొదటి సినిమా షూటింగ్ ఆచార్య. ఆ సినిమాలో కీ రోల్ ప్లే చేస్తున్న సోనూ సూద్ కొవిడ్ బారిన పడడం.. ఆ సమయంలోనే కొవిడ్ ఉధృతి పెరగడంతో షూటింగ్ కు రెడ్ సిగ్నల్ చూపించారు చిరు.
ఆ తర్వాత మహేష్ ‘సర్కారువారి పాట’ ఆగిపోయింది. యూనిట్లో కొందరితోపాటు మహేష్ పర్సనల్ స్టైలిస్ట్ కూడా కొవిడ్ బారిన పడడంతో.. ప్రిన్స్ క్వారంటైన్లోకి వెళ్లినట్టు కూడా వార్తలు వచ్చాయి. ఈ విధంగా.. సినిమా షూటింగులన్నీ ఒక్కొక్కటిగా నిలిచిపోయాయి.
రన్నింగ్ లో ఉన్న షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంటున్న చిత్రాలు.. ఆ తర్వాత ప్యాకప్ చెప్పేయడం మొదలు పెట్టాయి. అయితే.. నాగచైతన్య హీరోగా దిల్ రాజు నిర్మిస్తున్న ‘థాంక్యూ’ సినిమా మాత్రం షెడ్యూల్ మధ్యలోనే నిలిచిపోవడం గమనార్హం. విక్రమ్ కుమార్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం షూట్ ఇటలీలో జరుగుతోంది.
ఈ షెడ్యూల్ లో ప్రకాష్ రాజ్ పాల్గొనాల్సి ఉంది. అయితే.. ఆయన ఇండియా నుంచి బయల్దేరడం ఒకరోజు ఆలస్యమైందట. ఈలోగానే భారత్ నుంచి వచ్చే విమానాలపై ఇటలీ సర్కారు ఆంక్షలు విధించింది. దీంతో.. థాంక్యూ షూటింగ్ నిలిచిపోయినట్టు తెలుస్తోంది. దీంతో.. పుష్ప చిత్రం కూడా నిలిచిపోయినట్టు తెలుస్తోంది.
ప్రస్తుతం.. రెండు మూడు సినిమాలు మాత్రమే షూటింగ్ జరుపుకుంటున్నాయి. అవి కూడా ప్రజెంట్ షెడ్యూల్ ఫినిష్ కాగానే.. ప్యాకప్ చెప్పేస్తాయి. ఇక, తిరిగి షూటింగులు ఎప్పుడు మొదలవుతాయో ఎవ్వరూ చెప్పలేని పరిస్థితి. దీంతో.. సినిమాల విడుదలపై తీవ్ర ప్రభావం పడనుంది.