
‘ఎన్టీఆర్’ తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఓ మాట చెప్పారు. ఎప్పటికైనా భారతీయ సాంస్కృతిక వైభవాన్ని, సాంప్రదాయ పద్దతులను ప్రపంచానికి చాటి చెప్పే కంటెంట్‌ని సృష్టించాలనే ఆలోచన నాకు ఎప్పటినుండో ఉందని’. ఈ మాట వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశ్యం మహాభారతం సినిమానే అని ఎన్టీఆర్ సన్నిహితుల నుండి అందుతోన్న టాక్. సీనియర్ ఎన్టీఆర్ తెలుగు వాళ్లకు ఎలా అయితే, దేశ వ్యాప్తంగా గుర్తింపు తీసుకువచ్చారో..
అచ్చం అలాగే భారతీయ పురాణ ఇతిహాసాలను ప్రపంచానికి ఒక తెలుగువాడిగా చాటి చెప్పాలని ఎన్టీఆర్ చిరకాల కోరిక అని తెలుస్తోంది. గత కొన్ని సంవత్సరాలుగా తారక్ మైండ్ సెట్ పూర్తిగా మారిందట. అయితే, తాజాగా తారక్ గురించి మరో ఇంట్రెస్టింగ్ అప్ డేట్ తెలిసింది. మహాభారతానికి సంబంధించిన నలుగురి ప్రముఖుల రచనలను తారక్ చదువుతున్నారట.
రానున్న నాలుగైదు సంవత్సరాలలో మహాభారతం సిరీస్ ను తెరకెక్కించాలని రాజమౌళి భావిస్తోన్నాడు. అయితే, ఆ సిరీస్ లో ఎన్టీఆర్ రెండు పాత్రల్లో కనిపించే అవకాశం ఉందట. ఒకటి కృష్ణుడు అయితే, మరొకటి కర్ణుడి పాత్ర అట. ఈ రెండు పాత్రల్లోని హెవీ ఎమోషన్ పండాలంటే తారక్ లాంటి ఈ తరం మహానటుడే పండించగలడు. మరి మహాభారతం ఏ సంవత్సరంలో మొదలవుతుందో చూడాలి.
ఇక ఎన్టీఆర్ తన సినిమాల క్రమాన్ని కూడా చెప్పుకొచ్చాడు. ‘ఆర్.ఆర్.ఆర్’ తర్వాత దర్శకుడు కొరటాల శివతో ఒక పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా పూర్తయ్యాక ‘కె.జి.ఎఫ్’ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో మరో భారీ యాక్షన్ డ్రామాగా మరో పాన్ ఇండియా సినిమా చేస్తాడు. అలాగే ఇతర విషయాల పై తారక్ మాట్లాడుతూ.. ‘నేను విధిని బలంగా నమ్ముతాను. ఇక నటన విషయానికి వస్తే… నటుడిగా కథలో మాత్రమే నేను భాగం కావాలని కోరుకుంటాను. ఇక నేను దర్శకత్వం చేయాలనే ఆలోచన నాకు అసలు లేదు’ అని చెప్పుకొచ్చాడు.