ఇన్నాళ్లు మడికట్టుకొని కూర్చున్న కేంద్రం భారత్ లో తయారు చేసిన కోవీషిల్డ్, కోవాగ్జిన్ టీకాలనే భారతీయులకు పంచాలని.. వేరే ఏ టీకాలకు దేశంలో అనుమతి ఇవ్వలేదు. అమెరికాలో ఇప్పటికే ఆమోదం పొందిన ఫైజర్, మోడెర్నా లాంటి ప్రఖ్యాత వ్యాక్సిన్ లకు కూడా దేశంలో అనుమతివ్వలేదు. ఇక్కడ ట్రయల్స్ నిర్వహించాలని మెలికపెట్టాయి. కానీ ఇప్పుడు సెకండ్ వేవ్ తో అందరి ప్రాణాలకు ఎసరు వచ్చింది. దీంతోపాటు భారతీయ వ్యాక్సిన్ ఉత్పత్తిదారులు ధరలను ఇష్టానుసారంగా పెంచి సరిపడా టీకాలు ఉత్పత్తి చేయలేకపోతున్నాయి. అందరికీ అందించలేకపోతున్నాయి.
ఇప్పుడు దేశంలో కరోనా సెకండ్ వేవ్ ధాటికి దేశం అల్లకల్లోలంగా మారింది. 18-45 ఏళ్ల వారికి టీకా వేయడానికి కేంద్రంలోని బీజేపీ సర్కార్ మే 1న ప్రారంభించినా టీకాల కొరతతో అది సాధ్యపడడం లేదు. పైగా సెకండ్ వేవ్ తో ఇప్పుడు పెద్ద సంఖ్యలో రోగులు ఆస్పత్రులపాలై.. ఆక్సిజన్ కొరతతో చనిపోతున్న పరిస్థితులు దాపురించాయి. ఈ క్రమంలోనే కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది.
అమెరికా ఎఫ్.డీ.ఏ, ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతి పొందిన ఏ టీకానైనా దిగుమతి చేసుకోవచ్చని కేంద్రం ప్రకటన చేసింది. వీటికి ఒకటి, రెండు రోజుల్లోనే అనుమతి ఇస్తామని తెలిపింది. వ్యాక్సిన్ ల దిగుమతి కోసం ఇప్పటివరకు ఎలాంటి దరఖాస్తులు పెండింగ్ లో లేవని కేంద్ర స్పష్టం చేసింది.
విదేశాల్లో పంపిణీ అవుతున్న టీకాల దిగుమతికి ఒకటి రెండు రోజుల్లోనే కేంద్రం అనుమతి మంజూరు చేస్తుందని నీతిఅయోగ్ (హెల్త్) సభ్యుడు డాక్టర్ వీకే పాల్ తెలిపారు. టీకాల దిగుమతి కోసం ఎలాంటి దరఖాస్తులు పెండింగ్ లో లేవు. ఫైజర్, మోడెర్నా టీకా సంస్థలు ఎంఈఏను సంప్రదించాయి. జాన్సన్ అండ్ జాన్సన్ సైతం భారత్ లో టీకా ఉత్పత్తికి సిద్ధంగా ఉంది. ఇక కేంద్రం-భారత్ బయోటిక్ కలిసి అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ తయారీని ఇతర సంస్థలకు అప్పగించి భారీగా ఉత్పత్తి చేసేందుకు కేంద్రం సిద్ధమైంది.
ఇక ఇవేకాదు.. రష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్ వి టీకా వినియోగానికి భారత్ ఆమోదం తెలిపింది. వచ్చే వారం నుంచి రష్యా టీకాలు భారతీయ మార్కెట్ లో అందుబాటులోకి వస్తాయని వెల్లడించింది. రెడ్డీస్ ల్యాబ్ సంస్థ భారత్ లో ఈ టీకాల పంపిణీ చేపట్టనుంది.
ప్రపంచవ్యాప్తంగా ఆమోదం పొందిన అన్ని వ్యాక్సిన్లను భారత్ లో అనుమతివ్వడం కేంద్రం తీసుకున్న గొప్ప నిర్ణయంగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తద్వారా టీకాల డిమాండ్ కు తగ్గట్టుగా సరఫరా అయ్యి భారత్ లోని అందరికీ వేగంగా వ్యాక్సిన్లు లభించనున్నాయి. టీకాల కొరతతో అల్లాడుతున్న దేశ ప్రజలకు ఊరటనిచ్చేలా అన్ని వ్యాక్సిన్లకు ఆమోదించిన మోడీ సర్కార్ ఇప్పటికైనా సరైన నిర్ణయం తీసుకుందని అందరినుంచి ప్రశంసలు కురుస్తున్నాయి. ఇప్పటికైనా రాబోయే ఆరు నెలల్లోనే దేశ ప్రజలందరికీ టీకాలు వేస్తే ఈ కరోనాను తరిమి కొట్టవచ్చని.. మూడో వేవ్ ను అడ్డుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.