
కరోనా అల్లకల్లోలంలో సినీ పరిశ్రమ మళ్ళీ చిక్కి నలిగిపోనుందా ? చచ్చిబతికిన సినిమా ప్రపంచం మళ్ళీ చావుబతుకుల మధ్యలోకి వెళ్ళపోనుందా ? పరిస్థితులు చూస్తే.. అలాగే అనిపిస్తోంది. ఏది ఏమైనా సినీ ఇండస్ట్రీలు అందరికీ సినిమాలు చూపిస్తే.. కరోనా మాత్రం సినీ పరిశ్రమలకే ఒక్కోసారి ఒక్కోరకంగా సినిమా చూపిస్తోంది. సెకెండ్ వేతో సినిమా వాళ్లకు మళ్ళీ పీడకలను మిగిల్చేలా కనిపిస్తోంది. గత ఏడాది సినిమాల పరిస్థితి.. మొదటి బాల్ సిక్స్.. మిగిలిన బాల్స్ అన్ని డకౌట్స్ అన్నట్లు అయింది. ఈ ఏడాది పరిస్థితి కూడా సేమ్ అలాగే అయ్యేలా ఉంది.
ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకూ కరోనా కేసులు మళ్ళీ భారీగా పెరుగుతున్నాయి. అయితే గతంతో పోల్చితే ఆందోళన చెందాల్సిన పరిస్థితి లేదని ప్రభుత్వాలు చెబుతున్నాయి. పైగా ముందు జాగ్రత్త చర్యగా తెలంగాణ ప్రభుత్వం తాత్కాలికంగా విద్యాసంస్థలను కూడా మూసివేసింది. స్కూల్స్, కాలేజ్ ల్లో ఇక నుండి కేవలం ఆన్ లైన్ క్లాస్ లు మాత్రమే ఉంటాయని ఇప్పటికే స్పష్టం చేసింది. ఇక మిగిలిన అఫీస్ ల వర్క్ కూడా ఇంటి దగ్గర నుండే ఉంటుంది. కానీ, సినిమాల పరిస్థితి అది కాదే. కరోనా సెకెండ్ వే ఒకవేళ పెరిగితే.. థియేటర్ ల ఆక్యుపెన్సీ విషయంలో ప్రభుత్వం చర్యలు తీసుకోక తప్పదు.
అప్పుడు సినిమాలు ఇక రిలీజ్ అవుతాయా ? కచ్చితంగా థియేటర్ లలో ఆక్యుపెన్సీ విషయంలో ఇప్పటికే ప్రభుత్వం కఠిన నిర్ణయం ఏదైనా తీసుకుంటుందా అనే భయంలో టాలీవుడ్ నిర్మాతలు, హీరోలు ఉన్నారు. నిజానికి కరోనా నుండి దేశంలో ఒక్క తెలుగు సినీ పరిశ్రమే త్వరగా కోలుకొని, గాడిలో పడింది. ‘క్రాక్’తో మొదలైన కలెక్షన్ల జోరు ‘జాతిరత్నాలు’ వరకూ సాగుతూ.. రాబోయే సినిమాల పై కూడా నమ్మకాన్ని పెంచింది. మరి ఈ వీకెండ్ నితిన్ నటించిన ‘రంగ్ దే’, రానా నటించిన ‘అరణ్య’ చిత్రాలు రిలీజ్ అవుతున్నాయి. వాటి కలెక్షన్స్ పై కరోనా సెకెండ్ వే భయం ఎలాంటి ప్రభావం చూపిస్తోందో చూడాలి.