ఆయన గుండెల్లో ‘‘గంటా’’ మోగిస్తున్న సాయిరెడ్డి ట్విట్..

విశాఖ స్టీల్ ప్లాంటు ఉద్యమం తీవ్రమవుతోంది. ఉద్యమ సెగలు తమకు ఎక్కడ తాకుతాయేమోననే భయంతో అధికార వైసీపీ, విపక్ష టీడీపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి. ముఖ్యంగా స్టీల్ ప్లాంటు ఉద్యమంలో చాంపియన్లుగా చెప్పుకంటూ మైలేజ్ తెచ్చుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే స్టీల్ ప్లాంటు ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా రాజీనామా చేసిన గంటా శ్రీనివాస్ ను తమ పార్టీలో చేర్చుకునేందుకు ప్రయత్నించిన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి.. ఆ ప్రయత్నం బెడిసికొట్టే సరికి గంటాపై విమర్శలు గుప్పిస్తున్నారు. […]

Written By: Srinivas, Updated On : March 25, 2021 2:10 pm
Follow us on


విశాఖ స్టీల్ ప్లాంటు ఉద్యమం తీవ్రమవుతోంది. ఉద్యమ సెగలు తమకు ఎక్కడ తాకుతాయేమోననే భయంతో అధికార వైసీపీ, విపక్ష టీడీపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి. ముఖ్యంగా స్టీల్ ప్లాంటు ఉద్యమంలో చాంపియన్లుగా చెప్పుకంటూ మైలేజ్ తెచ్చుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే స్టీల్ ప్లాంటు ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా రాజీనామా చేసిన గంటా శ్రీనివాస్ ను తమ పార్టీలో చేర్చుకునేందుకు ప్రయత్నించిన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి.. ఆ ప్రయత్నం బెడిసికొట్టే సరికి గంటాపై విమర్శలు గుప్పిస్తున్నారు. దీంతో గంటా సైతం కౌంటర్ ఎటాక్ కు సిద్ధం అయ్యారు.

వైజాగ్ స్టీల్ ప్రయివేటీకరణ కోసం కేంద్రం వేగంగా పావులు కదుపుతోంది. ఈ నేపథ్యంలో దాన్ని అడ్డుకునేందుకు కలిసికట్టుగా పోరాడాల్సింది పోయి ఏపీ రాజకీయ పార్టీలు ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు వ్యవహరిస్తున్నాయి. విశాఖ స్టీల్ ను కాపాడుకునేందుకు కార్మికులు చేస్తున్న ఉద్యమాన్ని హైజాగ్ చేసేందుకు ఇప్పటికే తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న పార్టీలు.. ఇప్పుడు ప్రత్యర్థులపై మాటల యుద్ధానికి దిగుతున్నాయి. ఇందులో భాగంగా స్టీల్ ప్లాంటు కోసం తొలిరాజీనామా సమర్పించిన గంటా శ్రీనివాస్ ను లక్ష్యంగా చేసుకుని ఉత్తుత్తి రాజీనామాలంటూ.. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన ట్విట్ ఇప్పుడు కలకలం రేపుతోంది.

విశాఖ స్టీల్ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన గంటా శ్రీనివాస్ ను వైసీపీలోకి తీసుకొచ్చేందుకు చేసిన ప్రయత్నాలు విఫలం అవ్వడంతో విజయసాయిరెడ్డి తరువాత ఆయనపై పెట్టిన ట్విట్లు సంచలనం రేపుతున్నాయి. వైజాగ్ స్టీల్ ప్లాంటు ఉద్యమానికి కొందరు ‘‘గంటల’’ కట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఉత్తుత్తి రాజీనామాలతో గంట మోగిస్తున్నారు. ఆ గంటలో రణగొణ ధ్వనులు తప్పా చిత్తశుద్ది లేదు. ఆ గంట శబ్దాల వెనుకున్న ప్రయోజనాలు అసలు ఉద్యమకారులకు తెలియదా..? ఈ గంటే విశాఖలో భూ గంట మోగించలేదా..? అంటూ విజయసాయిరెడ్డి చేసిన ట్విట్ పై గంటా మనస్తాపం చెందినట్లు తెలుస్తోంది.

ఇప్పటికే స్టీల్ ప్లాంటుకోసం తాను చేసిన రాజీనామా అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం కు చేరింది. అయినా ఆయన దానిపై ఎలాంటి నిర్ణయం తసుకోలేదు. ఒకవేళ గంటా రాజీనామాను ఆమోదిస్తే.. స్టీల్ ప్లాంటు ఉద్యమంలో ఆయన హీరోగా నిలుస్తారు. తరువాత వైసీపీ ఎమ్మెల్యేలపై ఒత్తిడి పెరుగుతుంది. అంతిమంగా ఉప ఎన్నికలు ఖరారు అవుతాయి. ఈ నేపథ్యంలో స్పీకర్ తమ్మినేని ఆచితూచి వ్యవహరిస్తున్నారు. అయితే ఈ వ్యవహారాన్ని అడ్డుపెట్టుకుని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తన రాజీనామను వేళాకోలం చేయడంతో ఇప్పుడు దీనిపై తాడోపేడో తేల్చుకునేందుకు గంటా శ్రీనివాస్ సిద్ధం అయ్యారు.