దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు అంతకంతకూ పెరుగుతున్నాయి. పెరిగిన ధరల వల్ల సామాన్య, మధ్యతరగతి వర్గాలకు చెందిన ప్రజలు పడుతున్న ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. పెట్రోల్ కార్లు కొనుగోలు చేసిన వాళ్లు పెరిగిన ఇంధన ధరల వల్ల తెగ టెన్షన్ పడుతున్నారు. డీజిల్ కార్లతో పోలిస్తే పెట్రోల్ కార్ల మైలేజీ తక్కువ కాగా నగరాల్లో ట్రాఫిక్ వల్ల వాహనాల మైలేజీ అంతకంతకూ తగ్గుతూ ఉండటం గమనార్హం.
ఇలాంటి సమయంలో సీ.ఎన్.జీ కార్లను కొనుగోలు చేస్తే మంచిదని చెప్పవచ్చు. సీ.ఎన్.జీ కార్లు పెట్రోల్ తో పోలిస్తే ఎక్కువ మైలేజ్ ను ఇస్తాయి. అల్టో కారు లీటర్ పెట్రోల్ కు 22 కిలో మీటర్ల మైలేజ్ ను ఇస్తే అదే కంపెనీ సీ.ఎన్. జీ కారు 31 కిలోమీటర్ల మైలేజ్ ను ఇస్తుంది. నెలకు 800 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ప్రయాణించే వారికి సీ.ఎన్.జీ కార్ల వల్ల భారీ మొత్తంలో డబ్బులు ఆదా అయ్యే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.
సీ.ఎన్.జీ వల్ల పెట్రోల్, డీజిల్ లా పర్యావరణానికి హాని జరగదు. సీ.ఎన్.జీ వాడటం వల్ల 80 శాతం వరకు కార్బన్ మోనాక్సైడ్ లాంటి ఉద్గారాలను తగ్గించవచ్చు. మిగిలిన ఉద్గారాలను సైతం సీ.ఎన్.జీ ద్వారా తగ్గించడం సాధ్యమవుతుంది. ఇందులో ఇంధన అవశేషాలు సైతం తక్కువగా ఉంటాయి. గాలి కంటే సీ.ఎన్.జీ తేలికగా ఉండటం వల్ల వాహనం వేగంగా వెళుతుంది.
అయితే సీ.ఎన్.జీ వల్ల కారు పికప్ కొంతవరకు తగ్గే అవకాశం అయితే ఉంటుంది. సీ.ఎన్.జీ స్టేషన్లు తగినన్ని లేకపోవడం కూడా సమస్యేనని చెప్పవచ్చు. సీ.ఎన్.జీ కొరకు బ్రాండెడ్ కిట్ వాడకపోయినా సమస్యలు వస్తాయి.