Budget Cars: ఒకప్పుడు సంపన్నులకే పరిమితమైన కారు.. ఇప్పుడు మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి కూడా నిత్యావసరంగా మారిపోయింది. ఉరుకులు పరుగుల జీవితంలో కాలంతోపాటు పరిగెత్తాలంటే కారు తప్పనిసరి అయింది. దీంతో ప్రతి ఒక్కరూ కొత్త కారు కొనాలని కలలు కంటారు. దీని కోసం ప్రజలు సంవత్సరాల తరబడి డబ్బు ఆదా చేస్తున్నారు. 2024లో కొత్త కారును కొనుగోలు చేయాలని కలలు కంటున్నవారికి గుడ్ న్యూస్. 2024లో మార్కెట్లోకి కొన్ని కంపెనీలు కొత్త కార్లు విడుదల చేయబోతున్నాయి. ఈ కార్లు మీ బడ్జెట్‌కు సరిపోతాయి. వాటి ఫీచర్లు, సాంకేతికత కూడా సరికొత్తగా ఉంటాయి. మైలేజ్ పరంగా కూడా నిరాశపరచవు. ఈ ప్రత్యేక కార్లు ఏవో, వాటిని ఎప్పుడు లాంచ్ చేస్తారో తెలుసుకుందాం.
మారుతి స్విఫ్ట్..
దేశంలో అత్యంత ఇష్టమైన హ్యాచ్‌బ్యాక్‌లలో ఒకటైన స్విఫ్ట్ కారు. పూర్తిగా కొత్త రంగులో విడుదల కానుంది. మారుతీ సుజుకీ కూడా ఇందుకోసం పూర్తి సన్నాహాలు చేసింది. కొత్త సంవత్సరం తొలి త్రైమాసికంలోనే ఈ కారును విడుదల చేయనున్నట్టు సమాచారం. కారు పూర్తిగా రీడిజైన్ చేయబడి, కొత్త ప్లాట్‌ఫారమ్‌పై నిర్మించబడింది. కారులోని ఫీచర్లు కూడా లేటెస్ట్‌గా ఉంటాయి. ఇంటీరియర్ డిజైన్‌లో మార్పు కనిపిస్తుంది. కారు ధర రూ. 6.5 లక్షల నుంచి రూ. 7 లక్షల మధ్య ఉండే అవకాశం ఉంది.
మారుతి డిజైర్..
మారుతి మరో కారు ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. కంపెనీ తన అత్యంత ప్రజాదరణ పొందిన కాంపాక్ట్ సెడాన్ డిజైర్ కొత్త మోడల్‌ను 2024 మధ్యలో విడుదల చేయనుంది. ఈ కారు డిజైన్ నుంచి ఇంటీరియర్ వరకు అన్నీ మార్చారు. ఈ కారు ప్రారంభ ధర రూ.6.5 లక్షల నుంచి రూ.7 లక్షల మధ్య ఉంటుంది.
టాటా ఆల్ట్రోజ్..
టాటా తన హ్యాచ్‌బ్యాక్ ఆల్ట్రోజ్‌ను కొత్త రూపంలో పరిచయం చేయడానికి కూడా సిద్ధమవుతోంది. ఈ కారు కూడా కొత్త సంవత్సరంలోనే విడుదల కానుంది. కారులో కనిపించే అతిపెద్ద మార్పు ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్. ఇందులో మీకు 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ లభిస్తుంది. ఈ కారు ప్రారంభ ధర రూ.8 లక్షలు ఉంటుంది.
కియా సోనెట్..
కియా సోనెట్ ఫేస్‌లిఫ్ట్ 2024, జనవరిలో విడుదల కానుంది. కంపెనీ దీనిని ఇటీవలే ప్రదర్శించింది. దాని బుకింగ్ కూడా ప్రారంభమైంది. ప్రస్తుతం, కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్ కారు ధరలకు సంబంధించి ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. కానీ ఇది రూ. 8 లక్షల నుంచి ప్రారంభం కావచ్చని అంచనా.