Raghavendra Rao success story: కష్టాన్ని నమ్ముకున్నవాడు ఎప్పుడూ చెడిపోడు. ఇబ్బందులు ఎదుర్కొన్న వాడు ఎప్పటికీ వెనుక వరుసలో ఉండడు.. కర్మ ఫలాన్ని అంచనావేసి.. శక్తి సామర్థ్యాన్ని నమ్మి ముందడుగు వేసే వాడు.. ఎప్పటికీ ముందు వరుసలోనే ఉంటాడు. ఈ ఉపోద్ఘాతం మొత్తం ఇతడికి నూటికి నూరు శాతం సరిపోతుంది. ఎందుకంటే అతడు సాధించిన విజయం అటువంటిది కాబట్టి..
జలవిలయం
అది కృష్ణాజిల్లా.. దివిసీమ నాగాయలంక మండలంలోని సముద్రపు ఒడ్డున ఉన్న ఓ గ్రామం.. 1977లో కురిసిన వర్షం ఆ గ్రామం రూపురేఖలను పూర్తిగా మార్చేసింది. ఆకాశానికి చిల్లుపడ్డట్టుగా జడివాన కురిసింది. సునామీ ముంచెత్తినట్టు సముద్రం ఎగిసింది. చూస్తుండగానే జలవిలయం సర్వనాశనం చేసేసింది. కట్టుబట్ట కూడా మిగలలేదు. నా అనే ఆనవాళ్లు కనిపించలేదు. ఉండడానికి చోటు లేదు. తాగడానికి నీరు లేదు. ఇలాంటి సమయంలో హెలికాప్టర్ నుంచి వచ్చిన ఆహార పొట్లాలే కడుపు నింపాయి. ఆ ఆహార పొట్లాల కోసం యుద్ధం చేయాల్సి వచ్చింది. ఆ వర్షం వల్ల ఆ కుటుంబం సర్వం కోల్పోయింది. చూస్తుండగానే పూరి గుడిసె నేలమట్టమైంది. పశువులు కొట్టుకుపోయాయి. గడ్డివాములు నీటిలోనే కృంగిపోయాయి.. ఇన్ని జరుగుతుంటే వారంతా కూడా చూస్తూ ఉండిపోయారు.
పాలేరుగా పనిచేసి..
వాస్తవానికి ఆ కుటుంబానికి ఏదీ సులభంగా రాలేదు. ఆ ఇంటి పెద్ద పేరు బొండాడ పిచ్చయ్య. పేద కుటుంబం కావడంతో తనకు పది సంవత్సరాల వయసులోనే పాలేరుగా పని చేయడం మొదలు పెట్టాడు. ఆ ఊరికి చెందిన మోతుబరి వద్ద పాలేరుగా పనిచేస్తూ ఉండేవాడు. పొద్దంతా కష్టపడితే రెండు పూటలు మాత్రమే భోజనం పెట్టేవారు. వేతనంగా ఏడాదికి ఒక పశువు లేదా మేకను ఇచ్చేవారు. ఆ పశువులను పిచ్చయ్య జాగ్రత్తగా కాపాడుకునేవాడు. అలా అలా ఆ పశు సంతతిని అభివృద్ధి చేసుకున్నాడు. వాటిని విక్రయించి ఎకరం పొలం కొనుగోలు చేశాడు. ఇంతలోనే పిచ్చయ్యకు వివాహం జరిగింది. భార్యాభర్తలు ఇద్దరు కష్టపడి ఎకరం పొలాన్ని నాలుగు ఎకరాల వరకు చేశారు. ఒక పూరి గుడిసె నిర్మించుకున్నారు. వారికి సంతానంగా నలుగురు పిల్లలు కలిగారు.
జీవితంలో ఎదుగుతున్న దశలో..
జీవితంలో ఎదుగుతున్న దశలో ఒక్కసారిగా జడివాన కురవడంతో సర్వం కోల్పోయారు.. జడివాన వల్ల ఎటు చూసినా నీరే ఉండడంతో ప్రభుత్వం దాదాపు రెండు వారాలపాటు హెలికాప్టర్ ద్వారా ఆహార పొట్లాలను పంపిణీ చేసింది. ఆ రెండు వారాలు కూడా పిచ్చయ్య కుటుంబానికి ఆహార పొట్లాలే ఆకలి తీర్చాయి. హెలికాప్టర్ ద్వారా విసిరేసిన పాత బట్టలే వారి ఒంటిని రక్షించాయి. ఇంత స్థాయిలో నష్టం జరిగినప్పటికీ పిచ్చయ్య దంపతులు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు.
రెక్కలు ముక్కలు చేసుకున్నారు..
ఇద్దరమ్మాయిలు, ఇద్దరబ్బాయిలను కష్టపడి పెంచారు. పిచ్చయ్య దంపతులు రెక్కలు ముక్కలు చేసుకొని పిల్లలను చదివించారు. వారి సంతానంలో చిన్నవాడు బొండాడ రాఘవేంద్ర.. చిన్నప్పటి నుంచి రాఘవేంద్ర చదువులో చురుకు. పదవ తరగతిలో మండలంలోని ఫస్ట్ ర్యాంకు వచ్చాడు. ఇంటర్లో ఎంసెట్ రాసి మచిలీపట్నంలోని ఎస్వీ హెచ్ కాలేజీలో ఇంజనీరింగ్ లో చేరాడు. ఇంజనీరింగ్లో తొలి ఏడాది ట్యూషన్ ఫీజు పదివేల దాకా ఉండేది. ఆ డబ్బు కోసమే పిచ్చయ్య దంపతులు అప్పు చేయాల్సిన పరిస్థితి.. ఇక మిగతా ఫీజులు చాలా ఇబ్బంది పడుతుంటే.. తట్టుకోలేక కుమారుడు రాఘవేంద్రను చదువు మానేసి ఇంటికి వచ్చేయమని అనేవారు పిచ్చయ్య. అయితే ఈ దశలో రాఘవేంద్ర తల్లి మాత్రం ధైర్యం చెప్పేది. ఎలాగోలా అతనికి కావలసిన డబ్బులు సమకూర్చేది. ఇక మిగతా సంవత్సరాలకు సంబంధించిన ట్యూషన్ ఫీజు మొత్తాన్ని రాఘవేంద్ర వాయిదాల పద్ధతిలోనే కట్టాడు..
చిన్నప్పటినుంచి నాయకత్వ లక్షణాలు
రాఘవేంద్రకు చిన్నప్పటి నుంచి నాయకత్వ లక్షణాలు అధికంగా ఉండడంతో తను చదువుతున్న డిపార్ట్మెంట్లో స్టూడెంట్ లీడర్ గా ఎదిగాడు. 1997లో రాఘవేంద్ర ఇంజనీరింగ్ పూర్తయింది. ఆ తర్వాత విశాఖపట్నం వెళ్లాడు. ఆ సమయంలో రాఘవేంద్ర సోదరుడు పీ హెచ్ డీ చేస్తుండేవాడు. అయినప్పటికీ ఇద్దరు ఆర్థికంగా చాలా ఇబ్బంది పడేవారు. ఒకానొక సందర్భంలో తినడానికి తిండి కూడా ఉండేది కాదు. పొట్ట నింపుకోవడం కోసం రాఘవేంద్ర ఓ ట్యుటోరియల్ లో ఆన్సర్ పేపర్లు ఉద్యోగానికి కుదిరాడు. ఆ రోజుల్లో నెలకు అతనికి 200 దాకా ఇచ్చేవారు. కొంతకాలానికి ప్రఖ్యాత ఎల్ అండ్ టీ సంస్థలు రాఘవేంద్రకు ఉద్యోగం వచ్చింది. ఆ ఉద్యోగం ప్రకారం రాఘవేంద్ర కర్ణాటక వెళ్లాడు. ఎల్ అండ్ టి సంస్థ కైగా న్యూక్లియర్ ప్లాంట్ లో సిమెంట్ ప్లాంట్ ఏర్పాటు చేసింది. ఆ ప్లాంట్ కు సంబంధించిన గోదాం ను చూసుకోవడం రాఘవేంద్ర విధి.
నిత్యం అనారోగ్యం ఇబ్బంది పెట్టేది..
పేరుకు ఎల్ అండ్ టీ సంస్థలో ఉద్యోగమైనప్పటికీ.. అక్కడ ఉన్న వాతావరణ పరిస్థితుల వల్ల రాఘవేంద్రను నిత్యం అనారోగ్యం ఇబ్బంది పెట్టేది. ఆరోజుల్లో అతడికి నెలకు 2000 వరకు జీతం ఇచ్చేవారు. ఇంట్లో ఆర్థిక పరిస్థితులు బాగోలేవు కాబట్టి అవన్నీ కూడా రాఘవేంద్ర భరించేవాడు. ఆ తర్వాత ఆస్టర్ టెలికామ్ అనే సంస్థలో రాఘవేంద్ర చేరాడు. సెల్ఫోర్స్ (వోడాఫోన్ మాతృ సంస్థ) కంపెనీ కోసం టెలికాం టవర్లను నిర్మించే పనిని రాఘవేంద్ర పర్యవేక్షించేవారు.
ఉద్యోగానికి రాజీనామా..
చిన్నప్పటినుంచి కష్టపడి పనిచేసే తత్వం అధికంగా ఉన్న రాఘవేంద్ర.. టవర్ల నిర్మాణంలో కూడా అదే దూకుడు చూపించేవారు. దీంతో నిర్దేశించిన గడువు కంటే ముందుగానే టవర్ల నిర్మాణం పూర్తిచేసేవాడు. దీంతో కంపెనీలో అతనికి మంచి పేరు వచ్చింది. చూస్తుండగానే వర్టికల్ హెడ్, సి ఓ ఓ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ స్థాయికి ఎదిగాడు. వేగంగా 16 దేశాలకు సంబంధించిన కార్యకలాపాలను పర్యవేక్షించే స్థాయికి ఎదిగాడు. ఇదే క్రమంలో సొంతంగా సంస్థను ఏర్పాటు చేసుకునే ఆలోచనకు కూడా వచ్చాడు. ఇందులో భాగంగానే 2011లో తన ఉద్యోగానికి రాజీనామా చేశాడు.
800 కోట్లకు చేరుకుంది..
ఆ తర్వాత సొంతంగా సంస్థను ఏర్పాటు చేసుకున్నప్పటికీ.. ఆయన అనుకున్న స్థాయిలో పెట్టుబడులు లభించలేదు. ఏ వ్యాధి పాటు ఎంతో ప్రయాసపడ్డాడు. పాత ఉద్యోగంతో కొనుగోలు చేసిన ఆస్తులు మొత్తం అమ్ముకున్నాడు. అవి ఒక కోటి రూపాయలు దాకా వచ్చాయి. కోటి రూపాయలతో పెట్టుబడి పెట్టి టెలిఫోన్ టవర్లను నిర్మించేవాడు. తద్వారా ఎనిమిది నెలల్లో ఏడు కోట్ల వరకు ఆదాయం వచ్చింది.. ఎయిర్టెల్, ఆదాని, గ్రీన్ కో, రిలయన్స్ ఒంటి సంస్థలు వర్క్ ఆర్డర్లు ఇవ్వడం మొదలుపెట్టాయి. దీంతో కంపెనీ ఆదాయం 800 కోట్లకు చేరుకుంది.
సంపన్నుల జాబితాలోకి..
ప్రభుత్వ రంగ సంస్థ బిఎస్ఎన్ఎల్ ఏకంగా 1500 కోట్ల వర్క్ ఆర్డర్ ఇవ్వడంతో రాఘవేంద్ర కంపెనీ దిశ ఒక్కసారిగా మారిపోయింది. ఆ తర్వాత తను వ్యాపారాన్ని సోలార్ విద్యుత్ మీదకు మళ్లించాడు. సింగరేణి, బెల్, ఎన్ టి పి సి వంటి సంస్థలకు రాఘవేంద్ర కంపెనీ పని చేస్తోంది. గత ఏడాది పబ్లిక్ ఇష్యూ కు వెళ్ళింది రాఘవేంద్ర కంపెనీ. అనుకుంటే దాన్ని కట్టే 112 రెట్ల ఎక్కువగా సబ్స్క్రైబ్ అయింది. ప్రస్తుతం ఈ కంపెనీ మార్కెట్ విలువ ఏకంగా 7500 కోట్లకు చేరుకుంది. అంతేకాదు హూ రూన్ సంపన్నుల జాబితాలో రాఘవేంద్రకు చోటు కూడా లభించింది.
స్వగ్రామానికి చేయూత..
స్వగ్రామంలో కరెంటు కోతలు అధికంగా ఉండడంతో.. రాఘవేంద్ర తన కంపెనీ ద్వారా సోలార్ వీధి దీపాలను ఏర్పాటు చేశారు. చుట్టుపక్కల ఉన్న ఆసుపత్రులకు ఆక్సిజన్ సిలిండర్లు అందించారు. ప్రతి ఏడాది 300 మంది దాకా విద్యార్థులకు పదో తరగతి తర్వాత లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సహాయం చేస్తున్నారు. ధార్మిక కార్యక్రమాలకు లెక్కేలేదు. తను పుట్టిన ఊరుని మర్చిపోకుండా రాఘవేంద్ర అభివృద్ధి చేస్తున్నారు.. తాగునీటి నుంచి మొదలు పెడితే పారిశుధ్యం వరకు అన్ని విషయాల్లోనూ తన కంపెనీ ద్వారా విశేషమైన సేవలు అందిస్తున్నారు. అన్నట్టు రాఘవేంద్ర తన ఇంటి పేరుతోనే కంపెనీని స్థాపించారు. ఆయన కంపెనీలో ప్రస్తుతం వేల మంది పనిచేస్తున్నారు. ఒకప్పుడు హెలికాప్టర్ ద్వారా వచ్చిన ఆహార పొట్లాలలో పులిహోర తిని కడుపు నింపుకున్న ఆ బాలుడు.. నేడు వేలాదిమందికి కడుపు నింపుతున్నాడు.