Zubeen Garg concert: మనం బతికున్నప్పుడు కాదు.. చనిపోయినప్పుడు మోసే నాలుగు భుజాలు.. కార్చే నాలుగు కన్నీళ్లు వెంట వచ్చే జనాలు.. ఇవే మన బతుకు ఏమిటో నిరూపిస్తాయి.. చాలా సంవత్సరాల క్రితం వచ్చిన ఓ సినిమాలో డైలాగ్ ఇది. ఈ డైలాగ్ కు తగ్గట్టుగానే అతడి జీవితం సాగింది. ఎన్నో ఆటుపోట్లు.. ఎన్నో కష్టాలు పడి.. చివరికి దేశంలోనే సుప్రసిద్ధ సంగీత దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు జూబిన్ గార్గ్. అస్సాం రాష్ట్రంలో పుట్టి అంచలంచలుగా ఎదిగాడు గార్గ్. పుట్టిన గడ్డకు విశేషమైన పేరు తీసుకొచ్చాడు.
తేనె తాగినట్టు.. కోయిలలు ఆలపించినట్టు.. గోరింకలు లయబద్ధంగా కూసినట్టు.. గార్గ్ గొంతు ఉండేది. అస్సామీ నుంచి హిందీ వరకు అతడు ఎన్నో పాటలను ఆలపించాడు. కొన్ని సందర్భాల్లో సొంతంగా పాటలు రాసి ఆలపించాడు కూడా. అందువల్లే అతనంటే చాలామందికి విపరీతమైన అభిమానం.. గార్గ్ సొంత గడ్డ అస్సాం రాష్ట్రంలో విశేషమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. అశేషమైన అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. అందువల్లే అతడు కన్నుమూసినప్పుడు లక్షలాదిమంది వచ్చారు. గార్గ్ కు కన్నీటి నివాళి అర్పించారు. బాలీవుడ్ ప్రముఖుల నుంచి మొదలుపెడితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వరకు అందరు అతనికి నివాళులర్పించారు. సింగపూర్ ప్రాంతంలో గార్గ్ చనిపోయిన నేపథ్యంలో.. అతడి మృతి మీద అనుమానాలు ఉన్నాయని భార్య పేర్కొంది.
గార్గ్ కొద్దిరోజుల క్రితం సింగపూర్ వెళ్ళాడు. అక్కడ అతడు స్విమ్మింగ్ పూల్ లో మునిగి చనిపోయాడు. అయితే అతడు అందులో పడి చనిపోవడానికి కారణాలు వేరే ఉన్నాయని అతని భార్య పేర్కొంది. ఆమె పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది. గత నెల 19న అతడు సింగపూర్ ప్రాంతంలో మృతి చెందాడు. గార్గే లీడ్ రోల్ లో నటించి.. సంగీతం అందించిన చివరి సినిమా రోయ్ రోయ్ బినాలే.. ఈ సినిమా ఈ నెల 31న విడుదలవుతోంది. గార్గ్ నటించిన చివరి సినిమా కావడం.. అందులోనూ అతడు సంగీతం అందించిన చివరి చిత్రం కావడంతో.. ప్రేక్షకులు విపరీతమైన ఆసక్తిని పెంచుకున్నారు. అందులో భాగంగానే టికెట్ బుకింగ్ ప్రారంభించగానే.. గంట వ్యవధిలోనే 15 వేల టికెట్లను అభిమానులు కొనుగోలు చేశారు.. బుక్ మై షో లో దాదాపు 98,000 మంది ఈ చిత్రాన్ని చూసేందుకు అత్యంత ఆసక్తిగా ఉన్నామని తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఫలితంగా ఈ సినిమా 100 కోట్ల క్రాస్ కలెక్షన్స్ సాధించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇదే గనుక జరిగితే ఈ రికార్డు సృష్టించిన తొలి అస్సామీ చిత్రంగా ఇది చరిత్రలో నిలిచిపోతుంది.
ఈ సినిమాను వర్తమాన అంశాల ఆధారంగా రూపొందించినట్టు తెలుస్తోంది. ఈ సినిమాలోని పాటలకు గార్గ్ అద్భుతమైన సంగీతాన్ని అందించాడు. గార్గ్ కు అద్భుతమైన సంగీత దర్శకుడిగా పేరుంది. పైగా అస్సాం ప్రజలు అతడిని తన మానస పుత్రుడిగా పేర్కొనేవారు. అటువంటి వ్యక్తి సింగపూర్ ప్రాంతంలో చనిపోవడంతో తట్టుకోలేకపోయారు. అస్సాం ప్రజలు మొత్తం కన్నీరు పెట్టుకున్నారు. పైగా అతని అంత్యక్రియల్లో లక్షలాదిమంది పాల్గొన్నారు. అస్సాం ప్రభుత్వం అతడికి అధికారిక లాంచనాలతో అంత్యక్రియలు జరిపించింది. స్వయంగా ముఖ్యమంత్రి వచ్చి నివాళులర్పించారంటే అతని స్థాయి ఏమిటో అర్థం చేసుకోవచ్చు.