Kodali Nani new Look : వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు 2019 నుంచి 24 వరకు కొడాలి నాని ప్రధానంగా వార్తల్లో ఉండేవారు. టిడిపిని విమర్శించడంలో.. జనసేనను తూర్పార పట్టడంలో ఆయన ముందుండేవారు. ఒక దశలో కొడాలి నాని విలేకరుల ముందుకు వస్తే చాలు ఏదో ఒక సంచలన విషయాన్ని బయటపెట్టేవారు. చివరికి రజనీకాంత్ ను కూడా విమర్శించడానికి కొడాలి నాని వెనుకాడ లేదు.
కొడాలి నాని గుడివాడ నియోజకవర్గంలో వరుసగా గెలిచి.. తన సొంత రాజ్యంగా మార్చుకున్నారు. అటువంటి కొడాలి నాని 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. అప్పటినుంచి ఆయన పెద్దగా కనిపించడం లేదు. కొద్దిరోజులపాటు ఆయన హైదరాబాదులో ఉన్నారు. ఆ తర్వాత కొడాలి నాని మీద కూటమి ప్రభుత్వం అనేక కేసులు పెట్టింది. కొడాలి నాని ఆధీనంలో ఉన్న ప్రభుత్వ ఆస్తులను స్వాధీనం చేసుకుంది. కొడాలి నాని దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్న నేపథ్యంలో శస్త్ర చికిత్స చేయించుకున్నారు. దీంతో కొద్దిరోజులు ఆయన ఆసుపత్రికి పరిమితమయ్యారు. ఆ తర్వాత వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందారు. ఆమధ్య జగన్ విజయవాడ వచ్చినప్పుడు.. కొడాలి నాని మళ్లీ బాహ్య ప్రపంచంలోకి వచ్చారు. మీడియా అడిగిన ప్రశ్నలకు తనదైన శైలిలో సమాధానం చెప్పారు.
కొడాలి నాని అంటేనే బవిరి గడ్డం.. జుట్టుతో కనిపిస్తారు. బ్లూ జీన్స్.. వైట్ షర్ట్ ధరించి ఒక మాస్ లుక్ లో దర్శనమిస్తుంటారు. అటువంటి కొడాలి నాని పేర్ని నానితో కలిసి తిరుమల తిరుపతి వచ్చారు. ఈ క్రమంలో కొడాలి నాని స్వామివారికి తన తలనీలాలు సమర్పించారు. ఆ తర్వాత తెల్ల రంగు చొక్కా.. తెల్ల రంగు పంచ కట్టుకొని నానితో కలిసి స్వామి వారి దర్శనానికి వెళ్లారు. దర్శనం అనంతరం ఆయనతో కలిసి బయటికి వచ్చారు. కొడాలి నాని తలనీలాలను స్వామివారికి సమర్పించడంతో.. ఆయన గుర్తుపట్టలేనంతగా మారిపోయారు.
శస్త్ర చికిత్స చేయించుకున్న తర్వాత కొడాలి నాని చాలా వరకు బరువు తగ్గారు. గతంలోని ఆయన బరువు తక్కువగా ఉండేవారు. శస్త్ర చికిత్స చేయించుకున్న తర్వాత ఇంకా బరువు తగ్గారు. వాస్తవానికి కొద్ది రోజులపాటు ఆయన ఆసుపత్రిలోనే ఉన్నారు. తన నివాసానికి వచ్చినప్పటికీ కార్యకర్తలను పెద్దగా కలవలేదు. తనకు ఆరోగ్యం సహకరించడం లేదని.. అందువల్లే కార్యకర్తలు ఇంటికి రావద్దని సూచించారు కూడా. ఇక ఆమధ్య గుడివాడలో కూటమి నాయకులకు, నాని అనుచరులకు గొడవలు జరిగాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే చంద్రబాబు బూట్లు తుడుస్తానని నాని సంచలన ప్రకటన చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని.. కొడాలి నాని చంద్రబాబు బూట్లు తుడవాలని కూటమి నాయకులు గుడివాడలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఆ ఫ్లెక్సీలు రాజకీయంగా సంచలనం సృష్టించాయి. కొడాలి నాని ప్రస్తుతం తలనీలాలు సమర్పించి సరి కొత్తగా కనిపిస్తున్నారు. ఇప్పటికైనా ఆయన గుడివాడలో మళ్లీ పాత విధానంలో కనిపిస్తారా? 2029 వరకు టచ్ మీ నాట్ అన్నట్టుగా వ్యవహరిస్తారా? ఈ ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి.