
దేశంలో ఉద్యోగాలు, వ్యాపారాలు చేసేవాళ్లు ఆర్థికంగా బలపడుతుంటే రైతులకు మాత్రం సంవత్సరానికి నష్టాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. రైతులను ఆర్థికంగా ఆదుకోవాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన స్కీమ్ ను అమలు చేస్తోంది. రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లోట్ రైతుల కోసం కిసాన్ మిత్రా ఉర్జా యోజన పేరుతో ఒక స్కీమ్ ను అమలు చేయడానికి సిద్ధమయ్యారు.
ఈ స్కీమ్ ద్వారా రైతులకు నెలకు 1,000 రూపాయల చొప్పున ప్రభుత్వం చెల్లించనుంది. ఈ స్కీమ్ అమలు ద్వారా ప్రభుత్వంపై 1,450 కోట్ల రూపాయల భారం పెరగనుందని తెలుస్తోంది. చిన్న, మధ్యతరగతి రైతులకు దాదాపు ఉచిత విద్యుత్ అందుతుందని రైతులకు విద్యుత్ ఖర్చు కోసం గరిష్టంగా 12,000 రూపాయల గ్రాంట్ ఇస్తామని అశోక్ గెహ్లట్ వెల్లడించడం గమనార్హం. రైతులకు ఆర్థిక సహాయం అందించాలనే ఉద్దేశంతో ఈ స్కీమ్ ను అమలు చేస్తున్నామని అశోక్ గెహ్లాట్ చెప్పుకొచ్చారు.
అన్నదాతలపై కరోనా ప్రభావం పడటంతో వాళ్లను ఆదుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని అశోక్ గెహ్లాట్ చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో యూనిట్ కు వ్యవసాయ విద్యుత్ రేటు 5.55 రూపాయలుగా ఉందని అయితే రైతులకు మాత్రం 90 పైసలకే విద్యుత్ ను అందిస్తున్నామని అశోక్ గెహ్లాట్ అన్నారు. రైతులకు ప్రయోజనం చేకూరాలనే ఉద్దేశంతో ఎంత ఖర్చును అయినా భరిస్తామని ఆయన వెల్లడించారు.
రాజస్థాన్ రాష్ట్రంలో కొత్తగా సబ్ స్టేషన్లు, లైన్లు, గ్రిడ్లను అభివృద్ధి చేయడం ద్వారా నెట్ వర్క్ మరింత బలోపేతం అవుతుందని సీఎం అశోక్ గెహ్లాట్ వెల్లడించారు. రాజస్థాన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని రైతులు ప్రశంసిస్తున్నారు.