Numeros Diplos : బెంగళూరుకు చెందిన ప్రముఖ ద్వి చక్రవాహన సంస్థ న్యూమరస్ మోటార్స్ తమ డిప్లోస్ మ్యాక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను మహారాష్ట్రలోని పూణేలో విడుదల చేసింది. ఈ స్కూటర్‌ను మొదటిసారిగా భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025లో ప్రదర్శించారు. ఇప్పుడు దశలవారీగా వివిధ మార్కెట్లలో అందుబాటులోకి తెస్తున్నారు. న్యూమరస్ సంస్థ తన కస్టమర్లను దృష్టిలో ఉంచుకుని తయారు చేసిన మొదటి స్కూటర్ ఇదే. దీని ధర రూ.1.13 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించారు.
Also Read : కొత్త బైక్ ఫీచర్లు అదరహో.. చూస్తే విడిచిపెట్టరు..
పవర్ఫుల్ బ్యాటరీ, అద్భుతమైన రేంజ్
న్యూమరస్ డిప్లోస్ మ్యాక్స్ హబ్-మౌంటెడ్ పీఎంఎస్ మోటార్‌తో పనిచేస్తుంది. ఇది 2.67 కిలోవాట్ల(3.5 బీహెచ్‌పీ) పవర్, 138 ఎన్ఎమ్ పీక్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ స్కూటర్ గరిష్టంగా గంటకు 63 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఇందులో 1.85 కిలోవాట్ అవర్ కెపాసిటీ కలిగిన రెండు లిథియం-అయాన్ బ్యాటరీలు ఉన్నాయి. ఇవి ఎకో మోడ్‌లో 140 కిలోమీటర్ల వరకు రేంజ్‌ను అందిస్తాయని కంపెనీ పేర్కొంది. దీనిని 1.2 కిలోవాట్ల ఛార్జర్‌తో 4 గంటల్లో పూర్తిగా ఛార్జ్ చేసుకోవచ్చు.
డిజైన్, ఫీచర్లు
న్యూమరస్ డిప్లోస్ మ్యాక్స్‌ను సింపుల్ అండ్ స్ట్రాంగ్ డిజైన్‌తో రూపొందించారు. ఇందులో రౌండ్ ఎల్‌ఈడీ హెడ్‌లైట్, స్ప్లిట్ సీట్లు, అండర్‌సీట్ స్టోరేజ్ లభిస్తాయి. ఈ స్కూటర్‌లో డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్ ఉంది. ఇందులో రైడింగ్ మోడ్‌లు, జియోఫెన్సింగ్, వెహికల్ ట్రాకింగ్ , థెఫ్ట్ అలర్ట్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి. దీంతో పాటు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్‌లు, రియర్ ట్విన్ షాక్‌లు ఉన్నాయి. ఇది అన్ని రకాల రోడ్లపై మంచి రైడింగ్ ఎక్స్ పీరియన్స్ అందిస్తుంది. దీని గ్రౌండ్ క్లియరెన్స్ 150 మిమీగా ఉంది . మెరుగైన బ్రేకింగ్ కోసం డిస్క్ బ్రేక్‌లను ఉపయోగించారు.
మార్కెట్లో పోటీ
డిప్లోస్ మ్యాక్స్ నేరుగా ఏథర్ రిజ్టా, ఓలా ఎస్1 ఎక్స్, టీవీఎస్ ఐక్యూబ్, బజాజ్ చేతక్ వంటి ఎలక్ట్రిక్ స్కూటర్లకు పోటీ ఇస్తుంది. ప్రస్తుతం న్యూమరస్ మోటార్స్ కర్ణాటక, తమిళనాడు, కేరళలోని 14 నగరాల్లో మాత్రమే ఉంది. వచ్చే ఆర్థిక సంవత్సరం నాటికి 50 నగరాల్లో 100 కంటే ఎక్కువ డీలర్‌షిప్‌లను తెరవాలని కంపెనీ యోచిస్తోంది. పూణేలో ప్రారంభించిన తర్వాత ఈ ఏడాది మహారాష్ట్రలో మరో 20 డీలర్‌షిప్‌లను తెరవాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.
Also Read : ఒక్కసారి ఛార్జి చేస్తే 579కి.మీ.. ఫిబ్రవరి 5న తొలి ఎలక్ట్రిక్ బైక్‌ను ఆవిష్కరించనున్న ఓలా