MG Windsor EV: MG creates sensation with Rs. 10 lakh car.. Record sales in 8 months!
సరిగ్గా 8 నెలల క్రితం భారతీయ మార్కెట్‌లో రిలీజ్ అయిన ఎంజీ విండ్ సర్ ఈవీ ఎలక్ట్రిక్ కారు కంపెనీకి కల్పవృక్షంలా మారింది. ఈ కారు విడుదలైనప్పటి నుంచి కంపెనీ అమ్మకాలు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. ఎంజీ మోటారు ఇండియా తెలిపిన వివరాల ప్రకారం.. ఏప్రిల్ 2025 నెలలో కంపెనీ ఏకంగా 5,829 కార్లను విక్రయించింది. ఇది గతేడాది ఏప్రిల్ 2024లో విక్రయించిన 4,725 యూనిట్ల కంటే 23 శాతం ఎక్కువ.
సెప్టెంబర్ 2024లో విడుదలైన ఎంజీ విండ్ సర్ ఈవీకి వినియోగదారుల నుంచి లభిస్తున్న భారీ డిమాండ్ కారణంగానే ఈ అమ్మకాలు పెరిగాయని కంపెనీ పేర్కొంది. విడుదలైన నాటి నుంచి ఇప్పటివరకు విండ్‌సర్ ఈవీ 20,000 యూనిట్లకు పైగా అమ్ముడయ్యాయని ఎంజీ మోటార్స్ తెలిపింది. ఎంజీ విండ్ సర్ ఈవీ, ఎంజీ మోటార్ ఇండియా సరికొత్త మోడల్. విండ్‌సర్ ఈవీతో పాటు, ఎంజీ హెక్టర్, హెక్టర్ ప్లస్, ఎంజీ జెడ్ఎస్ ఈవీ, ఎంజీ ఆస్టర్, ఎంజీ కామెట్ ఈవీ, గ్లోస్టర్ వంటి అనేక పాపులర్ కార్ల విక్రయిస్తుంది.
ఎంజీ విండ్సర్ ఈవీ ప్రారంభ ధర భారతదేశంలో రూ.9.99 లక్షలు (ఎక్స్-షోరూమ్). అయితే, ఈ ధరలో బ్యాటరీ ప్యాక్ ఉండదు. కస్టమర్లు బ్యాటరీని ప్రత్యేకంగా సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ ద్వారా కొనుగోలు చేయాల్సి ఉంటుంది. దీని ధర కిలోమీటర్‌కు రూ.3.5 వస్తుంది. కారు టాప్ మోడల్ ఆన్-రోడ్ ధర రూ.17 లక్షల వరకు ఉంటుంది.
ఎంజీ మోటార్స్ తర్వలో ఎంజీ సైబర్‌స్టర్, M9 ఎలక్ట్రిక్ ఎంపీవీ, మాజిస్టర్‌లను కూడా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. అంతేకాకుండా, విండ్‌సర్ ఈవీలో పెద్ద బ్యాటరీ ప్యాక్‌తో కూడిన వెర్షన్‌ను కూడా ఈ నెలలోనే విడుదల చేయనుంది. విండ్‌సర్ ఈవీ కొత్త వెర్షన్‌లో 50.6కిలో వాట్స్ యూనిట్ పెద్ద బ్యాటరీ ప్యాక్ ఉంటుందని భావిస్తున్నారు. ఇది ప్రస్తుత మోడల్‌తో పోలిస్తే ఎలక్ట్రిక్ కారు రేంజ్ పెంచుతుంది. ఎంజీ విండ్ సర్ ఈవీ అప్‌డేటెడ్ వెర్షన్ ఎలక్ట్రిక్ కారు కొలతలలో ఎటువంటి మార్పులు లేకుండా వస్తుంది. అయితే, ఇది కొత్త అల్లాయ్ వీల్ డిజైన్‌తో రావచ్చు.
విండ్‌సర్ ఈవీ లాంగ్ రేంజ్ వెర్షన్‌కు పవర్ ఇచ్చేందుకు 50.6 kWh బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఇది ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 460 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుంది. ఇది MG ZS EVకి సమానం. ఇందులో ప్రస్తుత మోడల్‌లో ఉన్న PMS మోటారే ఉంటుందా లేదా అనేది క్లియర్ గా తెలియదు. ప్రస్తుత కాన్ఫిగరేషన్‌లో ఎంజీ విండ్ సర్ ఈవీలో ఉన్న ఫ్రంట్ వీల్ డ్రైవ్ మోటర్ గరిష్టంగా 131.3 bhpపవర్, 200 Nm గరిష్ట టార్క్‌ను అందిస్తుంది. ఈ SUV గరిష్ట వేగం గంటకు 175 కిలోమీటర్లు అని కంపెనీ పేర్కొంది. ఇది సాధారణ ఛార్జర్‌తో 20-100 శాతం ఛార్జ్ చేయడానికి ఏడు గంటలు పడుతుంది. డీసీ ఫాస్ట్ ఛార్జర్‌తో 30 నిమిషాల్లో 30 శాతం నుంచి 80 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చు.