Viral : మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్ జిల్లాలో జరిగిన ఒక అసాధారణమైన వివాహం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక్కడ ఒక పెళ్లి కొడుకు ఊరేగింపుతో నేరుగా ఆసుపత్రికి చేరుకున్నాడు. అసలు విషయం ఏమిటంటే.. పెళ్లి రోజున అతని భార్య అనారోగ్యానికి గురైంది. దీంతో పెళ్లికొడుకు ఏమాత్రం వెనకాడకుండా తన ఊరేగింపును ఆసుపత్రికి మళ్లించాడు. అక్కడ తన భార్యను ఎత్తుకుని ఏడు ప్రదక్షిణలు చేశాడు. అనంతరం ఆమె నుదుట సింధూరం దిద్ది, మెడలో మంగళసూత్రం కట్టి పెళ్లి చేసుకున్నాడు.
Also Read : మనవడితో 50 ఏళ్ల మహిళ వివాహం.. సినిమాకు మించిన ట్విస్టులు
అక్షయ తృతీయ పర్వదినాన ఈ అరుదైన వివాహ తంతు జరిగింది. ఈ వేడుకను చూసిన వారందరూ అతగాడి గొప్ప మనసును ఎంతగానో మెచ్చుకున్నారు. బ్యోవ్రాలోని పరమసిటీ కాలనీకి చెందిన జగదీష్ సింగ్ సికర్‌వార్ మేనల్లుడు ఆదిత్య సింగ్‌కు, కుంభ్రాజ్‌కు చెందిన నందినితో వివాహం నిశ్చయమైంది. మే 1న అక్షయ తృతీయ రోజున కుంభ్రాజ్ సమీపంలోని పురుషోత్తంపుర గ్రామంలో వీరి వివాహం జరగాల్సి ఉంది. కానీ పెళ్లికి ఐదు రోజుల ముందు నందిని అకస్మాత్తుగా అనారోగ్యానికి గురైంది. ఆమెను ఏప్రిల్ 24న బ్యోవ్రా నగరంలోని పంజాబీ నర్సింగ్ హోమ్‌లో చేర్పించారు.

నందిని ఆరోగ్యం బాగా క్షీణించిందని, ఆమె విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించారు. కుటుంబ సభ్యులు అక్షయ తృతీయ శుభ ముహూర్తంలోనే వివాహం జరపాలని పట్టుబట్టడంతో, వధువు ఎక్కువసేపు కూర్చోలేదని డాక్టర్లు తెలిపారు. దీంతో కుటుంబ సభ్యులు డాక్టర్లతో చర్చించి ఆసుపత్రిలోనే వివాహం జరిపించాలని నిర్ణయించుకున్నారు. ఒకవేళ ఆ రోజు వివాహం జరగకపోతే, మరో రెండేళ్ల వరకు మంచి ముహూర్తం లేదని పెళ్లికొడుకు అయిన ఆదిత్య తెలిపాడు. బుధవారం రాత్రి ఆదిత్య తన భార్యను వివాహం చేసుకోవడానికి బ్యాండు బాజాలతో ఆసుపత్రికి చేరుకున్నాడు. అక్కడ వేద మంత్రోచ్ఛారణల మధ్య వివాహాన్ని పూర్తి చేశారు.
వివాహం సమయంలో పెళ్లికూతురు నందిని నడిచే స్థితిలో లేదు. అందుకే వరుడు ఆదిత్య ఆసుపత్రిలో అలంకరించిన కళ్యాణ మండపం మధ్యలో తన భార్యను ఎత్తుకుని ఏడు ప్రదక్షిణలు చేశాడు. ఈ సమయంలోనే వరుడు వధువు నుదుట సింధూరం దిద్ది, మెడలో మంగళసూత్రం కూడా కట్టాడు.
