Maruti : దేశంలోనే అతిపెద్ద ఆటోమొబైల్ సంస్థ మారుతికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కార్ల అమ్మకాల్లో అగ్రస్థానంలో ఉన్నప్పటికీ కంపెనీ లాభాలు క్షీణించాయి. గత ఏడాది మార్చిలో రూ.3,952 కోట్లుగా ఉన్న పన్ను అనంతర లాభం (PAT) ఈ ఏడాది రూ.3,911 కోట్లకు తగ్గింది. అంటే ఏడాది వ్యవధిలో కంపెనీ లాభం 1 శాతం తగ్గింది. అయితే అంతకు ముందు త్రైమాసికంతో పోలిస్తే మాత్రం PAT పెరిగింది.
Also Read : లీటరుకు ఏకంగా 34 కిమీ మైలేజ్.. రోజూ ప్రయాణించడానికి బెస్ట్ కార్లు ఇవే !
కంపెనీ ఆదాయం పెరిగినా..
ఒకవైపు ఏడాదిలో కంపెనీ లాభం 1 శాతం తగ్గినా, మరోవైపు కంపెనీ ఆదాయం మాత్రం పెరిగింది. మారుతి స్టాక్ మార్కెట్‌లో తన ఫైలింగ్‌ను సమర్పించింది. అందులో Q4FY25లో మొత్తం ఆదాయం రూ.40,920 కోట్లుగా ఉందని తెలిపింది. ఇది గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.38,471 కోట్ల కంటే 6.4శాతం ఎక్కువ. ఇందులో ఉత్పత్తుల అమ్మకాల ద్వారా వచ్చిన ఆదాయం రూ.38,842 కోట్లు కాగా, ఇతరత్రా ఆదాయాల ఆధారంగా కంపెనీ రూ.2,078 కోట్లు ఆర్జించింది.
లాభాల్లోనూ క్షీణత
మారుతి సుజుకి శుక్రవారం స్టాక్ మార్కెట్‌లో ఫైలింగ్ చేసింది. కంపెనీ ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసిక ఫలితాలను విడుదల చేసింది. ఇందులో పన్ను రహిత లాభంతో పాటు లాభాల్లో కూడా ఏడాది ప్రాతిపదికన క్షీణత నమోదైంది. మారుతి లాభం గత ఏడాదితో పోలిస్తే 4.3శాతం తగ్గి రూ.3,711 కోట్లకు చేరుకుంది. 2024 ఇదే త్రైమాసికంలో ఈ లాభం రూ.3,878 కోట్లుగా ఉంది.
కంపెనీ షేర్లలో పతనం
మారుతి సుజుకి ఇండియా లాభాల్లో తగ్గుదల ప్రభావం దాని షేర్లపై కనిపించింది. మారుతి షేర్లు 2 శాతానికి పైగా పడిపోయాయి. కంపెనీ షేర్లు ఈరోజు రూ.11866.35 వద్ద ప్రారంభమయ్యాయి. ట్రేడింగ్ సమయంలో రూ.12047 గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. కానీ మార్కెట్ ముగిసే సమయానికి షేర్లు దాదాపు రూ.250 వరకు పడిపోయాయి.