Toll Plaza : ఢిల్లీ-మీరట్ ఎక్స్‌ప్రెస్‌వే దేశంలోనే మొట్టమొదటి ఎక్స్‌ప్రెస్‌వే లేదా హైవేగా మారబోతోంది. ఇక్కడ కొత్త అడ్వాన్స్‌డ్ టోల్ కలెక్టింగ్ సిస్టమ్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఈ కొత్త సిస్టమ్ ద్వారా ఇకపై కార్లు, ట్రక్కులు లేదా ఏ వాహనాన్ని టోల్‌పై ఆపాల్సిన అవసరం ఉండదు. ప్రయాణంలో టోల్‌పై ఆగకుండానే వాహనాన్ని తీసుకెళ్లవచ్చు. టోల్ ఆటోమేటిక్‌గా కట్ అవుతుంది. ఈ కొత్త సిస్టమ్ త్వరలోనే ఎక్స్‌ప్రెస్‌వేపై ప్రారంభం కానుంది. ఆ తర్వాత నెమ్మదిగా దేశంలోని అన్ని టోల్‌ప్లాజాల వద్ద ఏర్పాటు చేస్తారు. టోల్‌ప్లాజాల వద్ద ఉండే పొడవైన క్యూలను తగ్గించడం, టోల్ వసూళ్లను పెంచడం ఈ కొత్త సిస్టమ్ ముఖ్య ఉద్దేశ్యం.
Also Read : స్పామ్ మెసేజ్ లతో విసిగిపోయారా? ఈ ఒక్క సెట్టింగ్‌తో వాటికి చెక్ పెట్టండి!
ఢిల్లీ-మీరట్ ఎక్స్‌ప్రెస్‌వేపై ఏర్పాటు చేస్తున్న కొత్త సిస్టమ్‌ను ANPR అని పిలుస్తారు. దీని పూర్తి పేరు ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్. పేరులో ఉన్నట్లుగానే ఇది నంబర్ ప్లేట్ ద్వారా టోల్ వసూలు చేస్తుంది. కొత్త సిస్టమ్ కింద టోల్‌ప్లాజాకు ఇరువైపులా హై రిజల్యూషన్ కెమెరాలు ఏర్పాటు చేస్తారు. ఈ కెమెరాలు వెళ్లే వాహనాల నంబర్ ప్లేట్‌లను క్యాప్చర్ చేస్తాయి. ఆ తర్వాత టోల్ నేరుగా ఫాస్ట్‌ట్యాగ్ ఖాతా నుండి కట్ అవుతుంది. అంటే ఇకపై టోల్‌పై ఫాస్ట్‌ట్యాగ్‌ను చూపించాల్సిన అవసరం లేదు. అయితే ఈ సిస్టమ్ ఫాస్ట్‌ట్యాగ్ ఖాతాకు అనుసంధానించబడి ఉంటుంది. కాబట్టి ఫాస్ట్‌ట్యాగ్, ANPR రెండూ కలిసి పనిచేస్తాయి. దీని అతిపెద్ద ప్రయోజనం ఏమిటంటే ఇకపై టోల్‌ప్లాజాల వద్ద వాహనాలు ఆగాల్సిన అవసరం ఉండదు.
ఈ ANPR కొత్త సిస్టమ్ కారణంగా టోల్‌ప్లాజాల వద్ద వెయిటింగ్ టైమ్ తగ్గుతుందని భావిస్తున్నారు. కానీ ప్రస్తుతం దేశంలో టోల్ వసూలు కోసం GPS టెక్నాలజీని ఉపయోగించడం లేదని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. GPS ఆధారిత టోల్ వసూలు భద్రత పై సందేహాల కారణంగా ఆ నమూనాను తాత్కాలికంగా నిలిపివేశారు. ఇటీవల ఒక నిపుణుల కమిటీ GPSతో వచ్చే సమస్యల గురించి పలు అంశాలను లేవనెత్తింది. దీనివల్ల మంత్రిత్వ శాఖ ప్రత్యామ్నాయ పరిష్కారాలను అన్వేషించాల్సి ఉంటుంది.
ANPR టోల్ కలెక్టింగ్ సిస్టమ్ పైలట్ ప్రాజెక్ట్ ఇప్పటికే విజయవంతమైంది. దీని కారణంగా రహదారి రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ అధికారులు అన్ని ఎక్స్‌ప్రెస్‌వేలు, జాతీయ రహదారులపై ఇదే విధమైన సిస్టమ్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. డ్రైవర్ల కోసం వెయిటింగ్ సమయాన్ని తగ్గించే లక్ష్యంతో టోల్ బారికేడ్లను పూర్తిగా తొలగించే దిశగా మంత్రిత్వ శాఖ పనిచేస్తోంది.