Electric Car: భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో ఎలక్ట్రిక్ వాహనాలకు రోజురోజుకు డిమాండ్ విపరీతంగా పెరుగుతోంది. ప్రజలు చాలా వేగంగా ఈవీలను కొనుగోలు చేస్తున్నారు. అయితే, భారతదేశంలో మొట్టమొదటి ఎలక్ట్రిక్ కారు ఏది? అది ఎప్పుడు విడుదలైందో తెలుసుకుందాం. ప్రస్తుతం మార్కెట్‌లో టాటా ఎలక్ట్రిక్ కార్లు బాగా అమ్ముడవుతున్నాయి. ముఖ్యంగా టాటా నెక్సాన్ అత్యంత ప్రజాదరణ పొందిన ఎలక్ట్రిక్ ఎస్‌యూవీగా నిలిచింది. మెర్సిడెస్-బెంజ్, బీఎండబ్ల్యూ, ఆడి వంటి లగ్జరీ కార్ల తయారీ సంస్థలు కూడా ఎలక్ట్రిక్ కార్లను మార్కెట్‌లోకి తీసుకువచ్చాయి. కానీ, భారతదేశపు మొట్టమొదటి ఎలక్ట్రిక్ కారు కథ చాలా మందికి తెలియదు. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Also Read: ఫిష్ వెంకట్ మరణానికి కారణం టాలీవుడ్ ఇండస్ట్రీ యేనా..? ఎందుకు పట్టించుకోలేదు!
భారతదేశంలో తయారైన మొట్టమొదటి ఎలక్ట్రిక్ కారు పేరు లవ్‌బర్డ్. దీనిని 1993లో ఎడ్డీ ఎలక్ట్రిక్ కంపెనీ తయారు చేసింది. దీనిని మొట్టమొదట ఢిల్లీలో జరిగిన ఆటో ఎక్స్‌పోలో ప్రజలకు పరిచయం చేశారు. విడుదలైన వెంటనే ఈ కారు కొన్ని అవార్డులను కూడా గెలుచుకుంది. లవ్‌బర్డ్‌కు అంతా బాగానే నడుస్తోంది అనుకుంటున్న సమయంలో..ప్రభుత్వం కూడా దీనిని వినియోగదారులకు విక్రయించడానికి అనుమతి ఇచ్చింది. అయితే, ఆ తర్వాత పరిస్థితి మారిపోయింది. ఆ సమయంలో చాలా వాహన తయారీ సంస్థల మాదిరిగానే, లవ్‌బర్డ్ అమ్మకాలు కూడా చాలా తక్కువగా ఉన్నాయి. కొంతకాలం తర్వాత కంపెనీ దీని ఉత్పత్తిని నిలిపివేయాల్సి వచ్చింది.
లవ్‌బర్డ్‌ను ఎడ్డీ కరెంట్ కంట్రోల్స్ (ఇండియా) కంపెనీ జపాన్‌లోని టోక్యోకు చెందిన యాస్కావా ఎలక్ట్రిక్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ సహాయంతో తయారు చేసింది. దీనిని కేరళలోని చలకుడి మరియు తమిళనాడులోని కోయంబత్తూర్‌లో తయారు చేశారు. లవ్‌బర్డ్ రెండు సీట్ల ఎలక్ట్రిక్ కారు, ఇది డీసీ ఎలక్ట్రిక్ మోటారును ఉపయోగించేది. ఈ మోటారుకు రీఛార్జిబుల్ బ్యాటరీ ప్యాక్ నుంచి పవర్ లభించేది, ఈ బ్యాటరీ ప్యాక్ పోర్టబుల్ కూడా. కారు బ్యాటరీ పూర్తిగా ఛార్జ్ కావడానికి దాదాపు 8 గంటలు పట్టేది. 15 డిగ్రీల కంటే ఎక్కువ వాలు ఉన్న ప్రదేశాల్లో పైకి ఎక్కడానికి దీనికి కొద్దిగా ఇబ్బంది అయ్యేది. ఆ సమయంలో ఇది పెద్ద సమస్య కాదు.. ఎందుకంటే నగరాల్లో ఎక్కువ ఫ్లైఓవర్లు లేవు.
లవ్‌బర్డ్ తర్వాత 2001లో మహీంద్రా అండ్ మహీంద్రా రేవా పేరుతో ఒక ఎలక్ట్రిక్ కారును విడుదల చేసింది. ఇది లవ్‌బర్డ్ కంటే బాగా పాపులర్ అయ్యింది. భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్లను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించింది. రేవాను 1994లో బెంగళూరుకు చెందిన మైని గ్రూప్, అమెరికాకు చెందిన AEV LLC కలిసి RECC కంపెనీని స్థాపించి తయారు చేశారు. ఈ కంపెనీ టార్గెట్ తక్కువ ధరకు ఎలక్ట్రిక్ కారును తయారు చేయడం, ఇది పర్యావరణానికి ఎటువంటి హాని చేయదు. ఈ కారులో ఇద్దరు కూర్చునేందుకు మాత్రమే చోటు ఉండేది.
2004లో దీనిని G-Wiz పేరుతో లండన్‌లో రిలీజ్ చేశారు. ఆ తర్వాత 2010లో మహీంద్రా ఈ కంపెనీని కొనుగోలు చేసింది. అప్పుడు RECC పేరును మహీంద్రా ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్ గా మార్చారు. ఆ తర్వాత ఆ కారును 26 దేశాల్లో విడుదల చేశారు. ఈ కారు ఒక్కసారి ఛార్జ్ చేస్తే 80 కి.మీ. వరకు ప్రయాణించగలిగేది. అప్పటి నుండి మార్కెట్‌లో ఒకదాని తర్వాత ఒకటిగా ఎలక్ట్రిక్ కార్లు వస్తూనే ఉన్నాయి.