Bank Loans: హోమ్ లోన్, పర్సనల్ లోన్ లేదా కార్ లోన్ తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారా ? అయితే మీకో గుడ్ న్యూస్. త్వరలో బ్యాంకుల నుండి లోన్లు తీసుకోవడం మరింత సులభంగా, చౌకగా మారే అవకాశం ఉంది. భారతీయ రిజర్వ్ బ్యాంక్ అక్టోబర్ నెలలో మరోసారి రెపో రేటును తగ్గించవచ్చని అంచనాలు వినిపిస్తున్నాయి. దీనివల్ల సామాన్యుల జేబుకు లబ్ధి చేకూరుతుంది. ఈ తగ్గింపు ఎంత ఉండవచ్చు? దీని వెనుక ఉన్న కారణాలు ఏమిటో వివరంగా తెలుసుకుందాం. రెపో రేటు అంటే రిజర్వ్ బ్యాంక్ వాణిజ్య బ్యాంకులకు ఇచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీ రేటు. ఈ రెపో రేటు తగ్గితే బ్యాంకుల లోన్ల ఖర్చులు తగ్గుతాయి. ఫలితంగా, బ్యాంకులు తమ వినియోగదారులకు ఇచ్చే హోమ్ లోన్, వెహికల్ లోన్, పర్సనల్ లోన్ వంటి వాటిపై వడ్డీ రేట్లను తగ్గిస్తాయి. దీనివల్ల, రుణాలు తీసుకునే వారికి నెలవారీ ఈఎంఐలు తగ్గుతాయి. తక్కువ ఖర్చుతో ఎక్కువ మొత్తంలో రుణాలు పొందే అవకాశం లభిస్తుంది.
Also Read: ఫిష్ వెంకట్ మరణానికి కారణం టాలీవుడ్ ఇండస్ట్రీ యేనా..? ఎందుకు పట్టించుకోలేదు!
గ్లోబల్ బ్రోకరేజ్ సంస్థ మోర్గాన్ స్టాన్లీ అంచనా ప్రకారం.. అక్టోబర్‌లో ఆర్‌బీఐ రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించవచ్చు. అయితే, ఆగస్టులో జరిగే తదుపరి సమావేశంలో మాత్రం వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచే అవకాశం ఉందని భావిస్తున్నారు. ద్రవ్యోల్బణం మరింత తగ్గితే, రెపో రేటు తగ్గింపు అవకాశాలు మరింత పెరుగుతాయి. గ్లోబల్ బ్రోకరేజ్ సంస్థ నివేదిక ప్రకారం.. ఈ సంవత్సరం ఫిబ్రవరి నెల నుండి దేశంలో ద్రవ్యోల్బణం నిరంతరం 4% కంటే తక్కువగా నమోదవుతోంది. ముఖ్యంగా, జూన్ నెలలో ఇది మరింత తగ్గింది. ఇది గత కొన్ని సంవత్సరాలతో పోలిస్తే చాలా తక్కువ.
ఆహార పదార్థాల ధరలు, ముఖ్యంగా గోధుమలు, పప్పుధాన్యాల ధరలు గత సంవత్సరంతో పోలిస్తే 1.1శాతం తగ్గాయి. ధరలు తగ్గడానికి కొన్ని ముఖ్య కారణాలు ఉన్నాయి. మంచి పంటలు పడటం, వాతావరణం బాగుండటం, ప్రభుత్వం నిల్వలపై (స్టాక్‌లపై) కొన్ని పరిమితులు పెట్టడం, కూరగాయలు తక్కువ ధరలకే దొరకడం. ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగితే, అక్టోబర్‌లో ఆర్బీఐ వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం ఉంది అని నిపుణులు అంటున్నారు. అయితే, ఆర్థిక వృద్ధి గురించి మరిన్ని స్పష్టమైన సంకేతాల కోసం ఆర్బీఐ వేచి చూస్తుంది.
హెచ్‌ఎస్‌బీసీ అనే మరో ఆర్థిక సంస్థ కూడా రెపో రేటుపై తన అభిప్రాయాన్ని చెప్పింది. ఆగస్టు, అక్టోబర్‌లో 2025లో జరిగే ద్రవ్య విధాన కమిటీ సమావేశాల్లో రెపో రేటులో ఎలాంటి మార్పూ ఉండకపోవచ్చు అని హెచ్‌ఎస్‌బీసీ అంచనా వేస్తోంది. ప్రస్తుతం రెపో రేటు 5.50% వద్ద స్థిరంగా ఉంది. అయితే, ఆ తర్వాత రెపో రేటులో కోతలు ఉంటాయని, 2025 చివరి నాటికి ఇది 5.25%కి చేరుకోవచ్చని హెచ్‌ఎస్‌బీసీ చెబుతోంది. ఈ అంచనాలు ఆర్బీఐ తీసుకునే నిర్ణయాలు, అప్పటి ఆర్థిక పరిస్థితులపై ఆధారపడి ఉంటాయి. మొత్తంగా చూస్తే లోన్లు తీసుకునే వారికి త్వరలో మంచి రోజులు వస్తాయని ఆశించవచ్చు.