Gold scam : బంగారం, భూములు.. వీటికి ఎప్పటికీ విలువ తగ్గదు. ఇటీవల కాలంలో బంగారానికి డిమాండ్ విపరీతంగా పెరిగింది. గడచిన మూడు సంవత్సరాలుగా బంగారం ధర ఆకాశంలో విహరిస్తోంది. రియల్ ఎస్టేట్ ఢమాల్ అయినప్పటికీ.. బంగారం ధర మాత్రం తగ్గడం లేదు. ఇటీవల కాలంలో లక్ష దాటిపోయింది. కొద్దిరోజులుగా తగ్గుముఖం పడుతున్నప్పటికీ.. మళ్లీ పెరిగే అవకాశం లేకపోలేదు. బంగారం అనేది అత్యంత విలువైన వస్తువు. దీని మీద పెట్టుబడి పెడితే మంచి లాభాలను అందిస్తుంది. అయితే న్యాయపరంగా బంగారం తీసుకుంటే ప్రభుత్వానికి అనేక రకాలుగా పన్నులు చెల్లించాలి. ఇదంతా ఎందుకని ఓ కన్నడ నటి ఏకంగా గోల్డ్ స్కాం కు తెర తీసింది. దీని వెనుక ఉన్న పాత్రధారులు, సూత్రధారులను పక్కన పెడితే.. ఆమె ఏకంగా బంగారు నేరా చిత్రాన్ని అద్భుతంగా నడిపించింది. చివరికి దొరికిపోయింది. సదరునటి అద్భుతంగా హావభావాలు ఒలికించిన గోల్డ్ స్కీం కథలో ఎన్నో మలుపులున్నాయి. ఈ మలుపులు కేంద్ర దర్యాప్తు సంస్థ అధికారులపై చుక్కలు చూపిస్తున్నాయి.
గోల్డ్ స్మిగ్లింగ్ కేసులో కన్నడ నటి రన్యా రావును ఈ ఏడాది మార్చి 5న పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసింది. ఆమె కొంతమంది వ్యక్తులతో కలిసి దుబాయిలో భారీగా బంగారం కొనుగోలు చేసి.. అక్రమ మార్గంలో మన దేశానికి తరలిస్తుండగా పట్టుబడింది. బెంగళూరు నగరంలో అధికారులు ఆ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత ఆ కేసును మరింత తవ్వడం మొదలుపెట్టారు. దీంతో ఈ వ్యవహారంలో కేవలం ఆమె మాత్రమే లేదని.. పెద్దపెద్ద తలకాయలు ఉన్నాయని తెలుస్తోంది. ఈ కేసు విచారణను కేంద్ర దర్యాప్తు సంస్థ అధికారులు సవాల్ గా తీసుకున్నారు. ఇందులో భాగంగానే ఈ కేసు కు సంబంధించిన అన్ని వ్యవహారాలను పరిశీలిస్తున్నారు. అధికారుల పరిశీలనలో దిమ్మతిరిగిపోయే వాస్తవాలు వెలుగు చూసాయి.
గోల్డ్ స్కాం లో భారీ ఎత్తున హవాలా నగదు బదిలీ జరిగిందని తెలిసింది. అయితే ఈ నగదు మొత్తం కూడా వివిధ మార్గాల ద్వారా చేరాల్సిన వ్యక్తులకు చేరిపోయిందని సమాచారం. బంగారాన్ని కొనుగోలు చేయడానికి కంటే ముందే హవాలా మార్గంలో నగదును దుబాయ్ పంపించారని తెలుస్తోంది. బెంగళూరులో ఆర్థిక వ్యవహారాలు సాగించే కొంతమంది వ్యక్తులు ఈ హవాలా మార్గంలో డబ్బులు పంపించారని సమాచారం. అయితే వారికి డబ్బు ఎవరిచ్చారు? హవాలా మార్గంలో ఎలా పంపించారు? దీనికి సహకరించిన వ్యక్తులు ఎవరు అనే కోణంలో కేంద్ర దర్యాప్తు సంస్థ అధికారులు విచారణ సాగిస్తున్నారు..
Also Read: రామ్ చరణ్ పెద్ది మూవీలో ఐటమ్ సాంగ్ చేస్తున్న స్టార్ హీరోయిన్…
ఇక ఈ కేసులో భాగంగా ఇప్పటికే రమ్య రావుకు సంబంధించిన 34 కోట్ల విలువైన ఆస్తులను కేంద్ర దర్యాప్తు సంస్థ అధికారులు అటాచ్ చేశారు. హవాలా, బంగారం అక్రమ రవాణా, నగదును వివిధ మార్గాలలో బదిలీ చేయడం వంటి వ్యవహారాలు ఈ స్కాం లో ఉన్నాయని కేంద్ర దర్యాప్తు సంస్థ అధికారులు చెబుతున్నారు. అయితే ఈ కేసులో ఇప్పటికే రన్యా రావు కీలక విషయాలు వెల్లడించింది.. ఆ ప్రకారం కేంద్ర దర్యాప్తు సంస్థ అధికారులు విచారణ సాగించారు. ఇప్పటికే కీలక ఆధారాలు మొత్తం సేకరించారు.
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం గోల్డ్ స్కామ్ లో పెద్ద పెద్ద తలకాయలు ఉన్నాయని.. వారంతా కూడా సేఫ్ గేమ్ ఆడుతున్నారని తెలుస్తోంది. రన్యా రావు ఈ స్కామ్ లో కేవలం పావు మాత్రమేనని.. అసలు వ్యక్తులు వేరే ఉన్నారని ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఈ కేసులో ఎంతటి వారు ఉన్నా వదిలిపెట్టబోమని కేంద్ర దర్యాప్తు సంస్థ అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే దుబాయ్ నుంచి బంగారం కొనుగోలు చేసిన వ్యక్తుల వివరాలను కేంద్ర దర్యాప్తు సంస్థ అధికారులు సేకరించారు. వారికి డబ్బు అందిన విధానంపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ వ్యవహారంలో మరిన్ని సంచలమైన విషయాలు త్వరలోనే వెలుగు చూసే అవకాశం ఉందని తెలుస్తోంది.