Homeబిజినెస్Twitter New Logo: ట్విట్టర్ పిట్టకు మస్క్ ఎందుకు టాటా చెప్పారు? "X"ను ఎందుకు తీసుకొచ్చారు?

Twitter New Logo: ట్విట్టర్ పిట్టకు మస్క్ ఎందుకు టాటా చెప్పారు? “X”ను ఎందుకు తీసుకొచ్చారు?

Twitter New Logo: నీలిరంగు పిట్ట.. ట్విట్టర్ అధికారిక లోగో.. గత 11 సంవత్సరాలుగా ఉన్న ఈ అధికారిక “ముద్ర” మస్క్ దెబ్బకు ఎగిరిపోయింది. నలుపు రంగు నేపథ్యంలో ఎక్స్ అనే ఆంగ్ల అక్షరం కొత్త లోగోగా వచ్చింది. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ట్విట్టర్ పిట్టను తీసేస్తానంటూ ట్వీట్ చేసిన మస్క్ అనంతపనీ చేశాడు. లోగో మార్పు గురించి ట్విట్టర్ కొత్త సీఈవో లిండా యక్కారినో ట్విట్ చేసిన తర్వాత బయటి ప్రపంచానికి తెలిసింది. లోగో మార్చడమే కాదు ట్విట్టర్ సైట్ ను కూడా మస్క్ తన “ఎక్స్ డాట్ కామ్” వెబ్ సైట్ తో అనుసంధానం చేశాడు. అంటే “ఎక్స్ డాట్ కామ్” అని గూగుల్ బ్రౌజర్ లో టైపు చేస్తే అది మిమ్మల్ని ట్విట్టర్ హోమ్ పేజీలోకి తీసుకెళ్తుంది.

మస్క్ కి..ఎక్స్ కి అవినాభావ సంబంధం

మస్క్ ట్విట్టర్ లోగోను ఎక్స్ అనే అక్షరం తో మార్చడం వెనక చాలా చరిత్ర ఉంది. 1999లో మాస్క్ స్థాపించిన మొదటి స్టార్టప్ ఎక్స్ డాట్ కామ్. తర్వాత కాలంలో అది పేపాల్ చేతుల్లోకి వెళ్ళింది. తర్వాత దానిని 2017లో మస్క్ కొనుగోలు చేశాడు. అనంతరం అంతరిక్ష ప్రయోగాల కోసం తాను స్థాపించిన కంపెనీకి స్పేస్ ఎక్స్ అని నామకరణం చేశాడు. చివరికి ఎలక్ట్రానిక్ వెహికల్స్ విభాగంలో తాను ప్రవేశపెట్టిన టెస్లా కార్లలోనూ ఎక్స్ మోడల్ ను ప్రవేశపెట్టాడు. అంతేకాదు తన కుమారుల్లో ఒకరికి అత్యంత విచిత్రంగా “ఎక్స్ యాష్ ఏ12” అనే పేరు పెట్టాడు. ఇటీవల కృత్రిమ మేధకు సంబంధించిన స్టార్టప్ నూ స్థాపించాడు.

అప్పుడు పిట్ట బొమ్మ లేదు

వాస్తవానికి ట్విట్టర్ ను ప్రారంభించినప్పుడు దాని లోగోగా పిట్ట బొమ్మ లేదు. 2012లో ట్విట్టర్ మాజీ క్రియేటివ్ డైరెక్టర్ బౌమాన్ లోగోలో ట్విట్టర్ పిట్టను ప్రవేశపెట్టాడు. ఈ పిట్ట బొమ్మను అప్పట్లో 15 డాలర్లకు ఒక స్టాక్ ఇమేజెస్ సంస్థ నుంచి కొనుగోలు చేశాడు. కానీ ఒక సంస్థ లోగోగా స్టాక్ ఇమేజెస్ ఉండకూడదని నిబంధన ఉండడంతో.. మార్టిన్ గ్రాఫర్ అనే డిజైనర్ తో ఆ పిట్టకు మార్పులు చేర్పులు చేశాడు. మొన్నటిదాకా ఉన్న లోగోను ఖరారు చేశాడు. ఆ పక్షి ముక్కు ఆకాశం వైపు సాచినట్టుగా ఉంటుంది. స్వేచ్ఛ, ఆశ, హద్దుల్లేని అవకాశాలకు చిహ్నంగా ఆ పిట్ట బొమ్మను అభివర్ణించేవారు. ఈ పిట్ట బొమ్మ కన్నా ముందు నీలిరంగు వర్ణంలో ఆంగ్ల అక్షరాలతో ట్విట్టర్ అనే పేరే ఆ సంస్థ లోగో గా ఉండేది. తొలుత ఆ అక్షరాలకు చివర్లో ఈ పిట్టను జోడించారు. తర్వాత కొంతకాలానికి ఆ అక్షరాలను తీసేసి కేవలం పిట్టని మాత్రమే లోగో గా ఉంచారు. దాదాపు 12 సంవత్సరాల తర్వాత దానిని మస్క్ ఎక్స్ గా మార్చేశాడు. మస్క్ వ్యాపార కార్యకలాపాలు మొత్తం ఎక్స్ కంపెనీ ద్వారా సాగుతున్న నేపథ్యంలో.. లోగోను కూడా అలానే మార్చేశాడనే వాదనలు ఉన్నాయి.. ట్విట్టర్ ను స్వాధీనం చేసుకున్న తర్వాత అనేక మార్పులకు శ్రీకారం చుట్టిన మస్క్.. దాని లోగోను కూడా మార్చడం వ్యాపార వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular